Advertisement


Home > Politics - Gossip
బాలయ్యకు కోపమొచ్చిందట.!

నియోజకవర్గ ప్రజలు తిరగబడినందుకు కాదు.. అలా తిరగబడ్తారని తెలిసీ, పార్టీ నేతలు అప్రమత్తంగా లేనందుకు టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారట. బావ చంద్రబాబు సూచన మేరకు అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ, నియోజకవర్గ అభివృద్ధితో తనకేం సంబంధం అన్నట్టు వ్యవహరిస్తున్న విషయం విదితమే. 'నువ్వు పోటీ చేస్తే చాలు.. నీ సినిమాలు నువ్వు చేసుకోవచ్చు.. నియోజకవర్గ అభివృద్ధి, స్థానిక రాజకీయాలన్నీ మేమే చూసుకుంటాం..' అని చంద్రబాబు, బాలయ్యకు అప్పట్లో సూచించారట. కానీ, ఇప్పుడు జరుగుతున్నది అందుకు పూర్తి భిన్నంగా వుంది. 

ఏకంగా, నియోజకవర్గ ప్రజలు తనను 'దున్నపోతు'గా మార్చేశారంటూ, బాలకృష్ణ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరిగినా, స్థానిక టీడీపీ నేతలు స్పందించకపోవడంపై బాలకృష్ణ గుస్సా అవుతోంటే, అసలంటూ ఎమ్మెల్యే బాలకృష్ణ తమనెక్కడ లెక్కచేశారంటూ స్థానిక టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగుతుండడం గమనార్హం. బాలకృష్ణ మాజీ పీఏ శేఖర్‌ వ్యవహారంలో టీడీపీ నేతలు తీవ్ర అసహనానికి గురైన విషయం విదితమే. 

'మా ఎమ్మెల్యే కన్పించడంలేదు..' అని నియోజకవర్గ ప్రజలు పోలీసులను ఆశ్రయించినప్పుడే టీడీపీ అధిష్టానం స్పందించి వుండాల్సిందన్నది బాలయ్య వెర్షన్‌. అయితే, నియోజకవర్గ ఎమ్మెల్యేగా కనీసపాటి అధికార పర్యటనలు కూడా చేయకపోవడంతోనే ఈ సమస్య వచ్చిందని స్థానిక టీడీపీ నేతలు అంటున్నారు. మొత్తమ్మీద, ఏపీ రాజకీయాల్లో బాలకృష్ణ పేరు ఇప్పుడు వివాదాస్పదంగా మార్మోగిపోతోంది. ఎమ్మెల్యే పదవి అంటే, అదొక బాధ్యతగా తీసుకోకుండా 'కేర్‌లెస్‌' వైఖరి ప్రదర్శించడం బాలకృష్ణకు ఎంతవరకు సబబు.? అన్న మాటే ఎక్కువగా విన్పిస్తోంది. జనం తనగురించి ఒకలా అనుకుంటోంటే, బాలయ్య ఇంకోలా భావిస్తున్నారు. రాజకీయమంటే ఇది కాదు బాలయ్యా.!