cloudfront

Advertisement


Home > Politics - Gossip

బరితెగించిన రాజకీయం: బాబు వర్సెస్ మోడీ

బరితెగించిన రాజకీయం: బాబు వర్సెస్ మోడీ

క్రమక్రమంగా ఆంధ్రప్రదేశ్‌లో 'రాజకీయ రణరంగం' పతాక స్థాయికి చేరుతోంది. రాజకీయాల్లో ఎత్తులు, పై యెత్తులు మామూలే. కానీ, ఇక్కడ పరిస్థితులు మారిపోయాయి. రోజురోజుకీ వాతావరణం ఉద్రిక్తంగా మారుతోంది. ముందు ముందు దాడులు, ఎదురుదాడులతో రాజకీయం మరింత ఉద్రిక్తం కాబోతోంది. 'ఫినిష్‌ అయిపోతారు..' అంటూ చంద్రబాబు చేసిన హెచ్చరిక, అంతకుముందే 'ఆంధ్రప్రదేశ్‌లో అసలు సిసలు రాజకీయం మొదలవుతోంది..' అంటూ బీజేపీ జాతీయస్థాయి నేతలు చేసిన ప్రకటన.. వెరసి, కొత్త అనుమానాలకు తావిస్తుండడం గమనార్హం.

ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చిన సమయంలోనే, బీజేపీ జాతీయస్థాయి నేతలు.. ఆంధ్రప్రదేశ్‌లో 'రాజకీయ రణ రంగం'పై సంకేతాలు ఇచ్చారు. అప్పటిదాకా టీడీపీతో అంటకాగిన బీజేపీ, అక్కడినుంచే చంద్రబాబు సర్కార్‌పై అవినీతి ఆరోపణలు చేయడం షురూ చేసింది. మరోపక్క, అప్పటివరకూ బీజేపీపై ఈగ కూడా వాలనివ్వని టీడీపీ, ఆ తర్వాత నుంచే బీజేపీ నేతల్ని అడ్డుకోవడమూ మొదలుపెట్టింది. సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ, రెండుపార్టీల మధ్యా యుద్ధ వాతావరణం కన్పిస్తోందంటే.. తెరవెనుక 'సూత్రధారులు' ఎంత పక్కాగా, ఈ రాజకీయ రణ రంగానికి స్క్రీన్‌ ప్లే రచించారో అర్థం చేసుకోవచ్చు.

సాక్షాత్తూ ముఖ్యమంత్రి, 'ఫినిష్‌ అయిపోతారు' అని చెప్పడమంటే, చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. రాష్ట్రాధినేత అయిన ముఖ్యమంత్రే అలా వ్యాఖ్యానించారంటే, రాష్ట్రంలో ప్రజల భద్రతకు భరోసా ఇచ్చేదెవరు.? చంద్రబాబు, బీజేపీతో విడిపోయాక.. టీడీపీ ఎంపీలు, ఢిల్లీలో ఆందోళనలు చేశారు. ఢిల్లీ పోలీసులు, సదరు ఎంపీల్ని అరెస్ట్‌ చేశారు కూడా. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, తిరుపతికి వస్తే, ఆయన కాన్వాయ్‌పై దాడికి యత్నించారు టీడీపీ నేతలు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణపై పలుమార్లు దాడికి టీడీపీ కార్యకర్తలు యత్నించిన విషయం విదితమే.

ప్రజాస్వామ్యంలో 'ఆందోళన - అడ్డగించడం' అనేది కూడా ఓ నిరసన మార్గమే. చంద్రబాబు కాన్వాయ్‌కి కాకినాడలో బీజేపీ నేతలు అడ్డుపడటం కూడా అలాంటిదే. కాన్వాయ్‌లోని అత్యంత భద్రతతో కూడిన బస్సులోంచి దిగి చంద్రబాబు, బీజేపీ నేతలతో పంచాయితీ పెట్టుకున్నారు, వార్నింగ్‌ కూడా ఇచ్చారు. అంటే, ఇక్కడ చంద్రబాబు 'ఇన్‌టెన్షన్‌' క్లియర్‌గా కన్పిస్తోంది. చంద్రబాబు డైరెక్షన్‌లో, టీడీపీ నేతలే.. బీజేపీ ముఖ్య నేతలపై దాడులకు యత్నిస్తున్నారు.

మొత్తంగా చూస్తే, ఇదంతా టీడీపీ - బీజేపీ కలిసి ఆడుతున్న 'డ్రామా'లా కన్పిస్తోంది తప్ప, రెండు పార్టీల మధ్యా నిజంగానే 'ఆధిపత్య పోరు' వుందనిపించదు. రెండు రాజకీయ పార్టీలూ ఆంధ్రప్రదేశ్‌లో అలజడి సృష్టించి రాజకీయ లబ్దిపొందాలని చూస్తున్న దరిమిలా, రాష్ట్ర ప్రజలు పరిస్థితుల్ని ఇప్పుడిప్పుడే మరింత లోతుగా అవగతం చేసుకుంటున్నారు.

నాలుగేళ్ళలో అవినీతి జరిగితే, దానికి ఈ రెండు పార్టీలూ బాధ్యత వహించాల్సిందే. చంద్రబాబు అవినీతిలో బీజేపీకి భాగముంటుంది, నరేంద్రమోడీ అవినీతిలో టీడీపీకీ వాటా వుంటుంది. ఆ వాటాల వ్యవహారం బయటకు రాకూడదనే, నిస్సిగ్గుగా ఈ రెండు పార్టీల నేతలూ బరితెగించి రోడ్డెక్కారని ఎందుకు అనుకోకూడదు.?

జనసేన అన్ని స్థానాల్లో పోటీ పవన్ కళ్యాణ్ ధైర్యమేంటి?

మహిళా మంత్రికి సలహాలు.. పోటీ చేయకమ్మా డబ్బులు మిగులుతాయ్