Advertisement


Home > Politics - Gossip
భారతీ మేడం... 'సాక్షి' ఎటుపోతోంది..!

గత వారంలో.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అనంతపురం జిల్లా ధర్మవరంలో పర్యటించాడు. వాస్తవాలు మాట్లాడుకుంటే.. అక్కడ జగన్‌ పర్యటన విజయవంతం అయ్యింది. ఎంతలా అంటే.. తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ అనుకూల మీడియాకు ముచ్చెమటలు పట్టేంతలా! రేపటి ఎన్నికల్లో జగన్‌ గెలుస్తాడా, ఓడుతాడా.. అనే విషయం గురించి వాదన కాదిక్కడ, ఈ సభకూ దానికీ సంబంధం లేదని అనుకున్నా.. ధర్మవరంలో జగన్‌ పర్యటన మాత్రం సూపర్‌ హిట్‌ అయ్యింది. 

మరుసటి రోజు.. ప్రముఖ పత్రికల ఆంధ్రప్రదేశ్‌ ఎడిషన్లలో అందుకు సంబంధించిన వార్తను పరిశీలిస్తే.. లార్జెస్ట్‌ సర్క్యులేటెడ్‌ డెయిలీలో.. జగన్‌ వార్తను వెదుక్కోవాల్సి వచ్చింది. అదెక్కడ ఉందో కనుక్కోవడం కష్టం అయ్యింది. చివరాఖరికి ఒక పేజీలో ఉంది. అది కూడా సింగిల్‌ కాలమ్‌ సైజ్‌లోని డీసీ వార్తగా దాన్ని ప్రచురించారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఆ వార్తలో ఎక్కడా జగన్‌ను 'ప్రతిపక్ష నేత'గా చెప్పలేదు. జస్ట్‌.. 'వైకాపా అధినేత' అని మాత్రమే రాశారు! ఎక్కడ ప్రతిపక్ష నేత అనిరాస్తే జగన్‌కు క్రెడిట్‌ వస్తుందో అనేది ఆ పత్రిక విలేకరుల భయం కావొచ్చు!

ఇక తెలుగుదేశం ట్రూపులోని రెండో పత్రికలో అదే వార్త గురించి గాలిస్తే.. అదీ దొరికింది. దీంట్లో కొంచెం స్పేస్‌ ఇచ్చారు కానీ.. హెడ్డింగ్‌ దగ్గరే నెగిటివిటీని పండించారు. తను ముఖ్యమంత్రి కావాలని అంతా ప్రార్థించాలని జగన్‌ ప్రజలను కోరాడు.. అనేది హెడ్డింగ్‌. వార్తంతా అదే. జగన్‌ ధర్మవరంలో మాట్లాడిన పాయింట్లన్నీ వదిలేసి.. జగన్‌కు ముఖ్యమంత్రి పదవి మీద కాంక్ష చూశారా.. అనే పాయింట్‌ను మాత్రమే హైలెట్‌ చేయడానికి ఈ పత్రిక తెగతాపత్రయపడింది!

ఇదీ తెలుగుదేశం అనుకూల మీడియా పత్రికల తీరు.. రోజు రోజుకూ మరీ దారుణంగా తయారవుతున్నాయవి! ఎంతలా అంటే.. మొన్న కోడెల శివరామక్రిష్ణ వార్త ఒకటి రాశారు. ఆయన ఆక్రమణల మీద సీబీఐ విచారణ జరిపించాలని ఎవరో కోర్టుకు ఎక్కారు. అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను సమర్పించి.. విన్నవించుకున్నారు. ఆ వార్తను ప్రచురించిన లార్జెస్ట్‌ సర్క్యులేటెడ్‌ డెయిలీ.. ఆ వార్తలో ఎక్కడా కోడెల శివరామక్రిష్ణ అనే వ్యక్తి.. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ తనయుడు అనే విషయాన్ని ప్రస్తావించలేదు. ఎక్కడ స్పీకర్‌ కోడెల పేరు రాస్తే.. ఆయనపై వ్యతిరేకత ప్రబలుతుందో అనే భయం!

జగన్‌ పాదయాత్ర అన్నప్పటి నుంచి.. రెండు ప్రధాన పత్రికల తీరు మారింది! జగన్‌ జనాల్లోకి వెళ్తున్నప్పుడు వీళ్ల టోన్‌ మారుతోంది! జగన్‌ జనసభలు విజయవంతం అయితే.. వీళ్ల కవరేజీతీరు మారుతోంది!  చిన్నపిల్లాడికి కూడా సులభంగా అర్థం అవుతున్న విషయం ఇది!  ఆ రెండు పత్రికలూ ఏ రోజూ తమ నైజాన్ని దాచుకోవడం లేదు! సూటిగా సుత్తిలేకుండా.. బయటపడిపోతున్నాయి. దేనికీ భయపడటం లేదు! ఆఖరికి తమ పాఠకులకు కూడా!

ఎంతైనా లక్షల సర్క్యులేషన్‌ ఉంది. తమ పాఠకులు కేవలం వన్‌సైడ్‌ వార్తలు రాస్తే నవ్వుకుంటారు, కామెడీ అయిపోతుంది.. అనే భయాలేమీ లేవు! వ్యవహారం ఏదైనా, అప్‌డేట్‌ ఏదైనా.. తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలే ముఖ్యం, జగన్‌ మీద ఏదోలా దుమ్మెత్తిపోయాలి.. అనే రీతినే ఆ పత్రికలు ముందుకుసాగుతున్నాయి. ఇందులో సందేహంలేదు. ఇది ఎవరికైనా సులభంగా అర్థం అవుతున్న విషయం.

ఇక్కడే.. సగటు పాఠకుడికి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభిమానులకు అర్థంకాని విషయం మాత్రం ఒకటి ఉంది. అదే.. 'సాక్షి' తీరు!! ఈ పత్రిక ఏమిటో... దీని దారెటో.. ఇది ఎటుపోతోందో.. అంతిమంగా జగన్‌కు వీలైనంతగా నష్టం చేయడానికే ఇది సాగుతోంతో అర్థంకాని పరిస్థితి. ఇంతకీ 'సాక్షి'కి కావాల్సింది ఏమిటి? వార్తలో రెండో కోణాన్ని చూపిస్తాం, ఆ రెండు పత్రికలూ ఒకేరీతిన వ్యవహారిస్తున్నాయి, వార్తను తెలుగుదేశం అనుకూలంగా మాత్రమే చూపుతాయి.. అలా కాకుండా, అదే అంశంలోని రెండో కోణాన్ని కూడా చూపిస్తామని.. సాక్షి ఆరంభం నుంచి డప్పు కొట్టుకుంటున్నారు కానీ.. ఈ మీడియా వర్గంతీరు.. రోజు రోజుకూ తీసికట్టుగా మారుతోంది.

న్యూట్రాలిటీ.. న్యూట్రాలిటీ.. అనే ముద్ర వేసుకోవడానికి సాక్షి తన ఒరిజినాలిటీని కోల్పోయింది!! ఇందులో సందేహం అక్కర్లేదు, ఎలాంటి డౌటూలేదు. ఆల్రెడీ పరిస్థితి చేతులు దాటిపోవడమే ఇక్కడ గమనించాల్సిన విషయం. తెలుగుదేశం అనుకూల పత్రికలు తమ పార్టీని కాపాడుకోవడానికి ప్రత్యర్థులపై దాడిచేసే తీరుంది చూశారూ.. ఆకలి గొన్న పులి వేటాడినట్టుగా ఉంటుంది! వేటాడేస్తాయంతే! ఆ పత్రికల్లో ఉండే కసి అలాంటిలాంటిది కాదు. ఇక సాక్షి కథ ఎలా ఉంటుందంటే... సోమరిపోతు నైజం. ఆకలి వేసినా.. ఆరాటమే తప్ప పోరాటం లేదిక్కడ.

లోపమంతా సంస్థాగతంగేనా..?

పత్రికకు న్యూట్రాలిటీ తేవాలని.. సాక్షి యాజమాన్యం తెగ తపించిపోతోంది. గత మూడు సంవత్సరాల నుంచి ఇదే తపనే.. చివరకు ఆ పత్రికను ఎందుకూ కొరకాకుండా చేస్తోంది. జగన్‌ ఎక్కడైనా సభ పెడితే, జగన్‌ ఎక్కడికైనా వెళితే.. ఆ రోజున కరపత్రికా.. ఒకటిన్నర పేజీ పాటు.. కవరేజీ ఇవ్వడానికి మించి.. జగన్‌కు ఏ రకంగానూ ఉపయుక్తం కాలేకపోతోంది సాక్షి! 

ఇప్పుడు సాక్షి పరిస్థితి ఎలా తయారైందంటే.. ఎటూ కాకుండా! అధికారంలో ఉన్న వారు ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తిపై తీవ్రమైన కౌంటర్లు వేస్తున్నాయి. కానీ ప్రభుత్వం మీద పాజిటివ్‌ వార్తలో సాక్షి విసిగెత్తిస్తోంది. ఆఖరికి లోకేష్‌ బాబు, చంద్రబాబు, టీడీపీ చోటా మోటా నేతలు.. చేసే ఆర్భాటపు ప్రకటనలు కూడా సాక్షిలో ప్రముఖ వార్తలుగా వస్తున్నాయంటే.. ఈ పత్రిక తీరు ఎంత కామెడీ అయిపోతోందో అర్థం చేసుకోవచ్చు. వైకాపా వాళ్లు గొంతు చించుకుంటే.. స్వయంగా జగన్‌ మోహన్‌ రెడ్డి ఒక రేంజ్‌లో మాట్లాడితే.. ఆ పత్రికలు దానికి కించిత్‌ విలువ ఇవ్వవు. ఇలా నడుస్తోంది కథ.

ఇక సాక్షి వెబ్‌సైట్‌ను చూసినా, పత్రికను రెగ్యులర్‌గా గమనిస్తున్నా.. తెలుగుదేశం పార్టీ కోసం యథాతథశక్తిన సేవ చేస్తున్నాయని స్పష్టం అవుతోంది. ఆ రెండు పత్రికల తీరుతో విసిగి వేసారిపోయి.. వైవిధ్యం కోసమైనా సాక్షిని చదివే వాళ్లకు ఆ సమాచారాన్ని కూడా లేకుండా చేస్తోంది జగన్‌ మోహన్‌ రెడ్డి సొంత పత్రిక. గతంలో వార్తా, ఆంధ్రభూమి వంటి పత్రికలు వార్తలోని ఈ యాంగిల్‌ను చక్కగా ప్రజెంట్‌ చేశాయి. పరిమిత వనరుల్లో అయినా ఆ పత్రికలు చాలావరకూ న్యాయం చేశాయి. అయితే అన్నీఉన్నా అల్లుడి నోట్లో శనిలా తయారైంది జగన్‌ మోహన్‌ రెడ్డి సొంత పత్రిక పరిస్థితి,

మరి దీనికి ప్రధానంగా రెండు కారణాలు.. ఒకటి న్యూట్రాలిటీ.. అంటూ హెచ్చులకు పోవడం. తెలుగుదేశం వార్తలను కూడా బాగా కవర్‌ చేసేసి.. ఆ పార్టీ వారినీ ఆకట్టుకోవాలని సాక్షి తన తోకకు తాను నిప్పుపెట్టుకుంది. అది మంటై కూర్చుంది. ఇక రెండో విషయం.. సంస్థాగత వైఫల్యం. సాక్షి పత్రికలో పరిస్థితి ఎలా ఉంటుందంటే.. అక్కడ ఒక్కో సెక్షన్‌ ఇన్‌చార్జి తన సెక్షన్‌ను సామ్రాజ్యంగా భావిస్తాడు.

జర్నలిజంలో వీరత్వాన్ని చాటడం వంటి నేపథ్యం వీళ్లకు ఎలాగూలేదు. లాబీయింగులతో ఎదిగిన సరుకు అంతా. ఇలాంటి మినిమం కామన్‌సెన్స్‌ లేని వాళ్లు..  జగన్‌పై విధేయత అంటూ.. తమ తమ సామ్రాజ్యాలను విస్తరించుకుంటున్నారు. తమ సెక్షన్లో తమకు అనుకూలంగా తలూపే పని చేయాలి. తమ చుట్టాలూ, తమ స్నేహితులు తమ పక్కనే ఉండాలి. వాళ్లకు ఓనమాలు రాకపోయినా ఫర్వాలేదు, కనీస అవగాహన లేకపోయిన ఫర్వాలేదు.. ఈ ఎడిటర్ల, ఇన్‌చార్జిలకు మర్దన చేసే వాళ్లు అయితే చాలు.

ఇలాంటి ట్రెండ్‌ సాక్షిలో మూడు నాలుగేళ్ల కిందట మొదలైంది. దాని దుష్ఫలితాలు ఇప్పుడు స్పష్టం అవుతున్నాయి. చెప్పుకొంటూపోతే.. సాక్షిలో సంస్థాగత లోపాలు.. ఇప్పుడు పరిష్కరించలేని స్థితికి చేరుకున్నాయి. చైర్మన్‌ భారతికి అయినా.. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి అయినా.. వాటిని పరిష్కరించడం కూడా కష్టతరమే! ఇక రానున్న రోజుల్లో కూడా 'సాక్షి' వల్ల జగన్‌కు వీలైనంత నష్టం, తెలుగుదేశానికి, తెరాసాకు వీలైనంత లాభమే తప్ప.. జగన్‌కు ఎలాంటి ఉపయోగం ఉండబోదు.. ఈ అంశం మీద నిస్సందేహంగా బెట్‌ కాయొచ్చు!