cloudfront

Advertisement


Home > Politics - Gossip

భూమా బ్రహ్మానికి బాబు మార్కు ట్రీట్‌మెంట్‌!

భూమా బ్రహ్మానికి బాబు మార్కు ట్రీట్‌మెంట్‌!

వాడుకుని వదిలేయడంలో చంద్రబాబు నాయుడుకు ఉన్న టాలెంట్‌ ఏమిటో అప్పుడెప్పుడో భూమా నాగిరెడ్డే చెప్పాడు. అన్నిమాటలు చెప్పిన భూమా నాగిరెడ్డి చివరకు చంద్రబాబు ఒత్తిడి భరించలేక, కేసుల వేధింపులకు తాళలేక మంత్రిపదవి హామీ కూడా లభించడంతో తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. అయితే అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పెట్టిన ఒత్తిడితో భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించారు.

ఇక భూమా కోసం హెలికాఫ్టర్‌ అంబులెన్స్‌ అంటూ ఆయన మరణం సమయంలోనే తెలుగుదేశం వాళ్లు నానా రకాల రాజకీయం చేశారు. శవానికి ట్రీట్‌మెంట్‌ ఇప్పిస్తామన్నట్టుగా రచ్చచేశారు. అదంతా రాజకీయం. ఆ తర్వాత కూడా అది కొనసాగింది. అందులో భాగమే అఖిలప్రియకు మంత్రిపదవి. ఎలాగూ నంద్యాలకు బైపోల్‌ వస్తుందని తెలిసి అఖిలప్రియకు మంత్రిపదవిని ఇచ్చారు. ఉప ఎన్నికల సమయంలో భూమా పిల్లలందరినీ రోడ్డెక్కించి వాళ్లచేత కన్నీరు కార్పించి సానుభూతిని క్యాష్‌ చేసుకున్నారు. దానికితోడు నంద్యాల్లో గెలవడానికి ఏపీ టీడీపీ అంతా అక్కడ దిగబడి ప్రచారం చేసింది. ఎలాగోలా నెగ్గడం అయితే నెగ్గారు.

ఆ తర్వాత నంద్యాల రాజకీయం అనేక మలుపులు తిరిగింది. అటు నంద్యాల, ఇటు ఆళ్లగడ్డల విషయంలో భూమా ఆధిపత్యానికి తెలుగుదేశం పార్టీ వైపు నుంచినే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఆళ్లగడ్డలో భూమా కుటుంబానికి వ్యతిరేకంగా ఏవీ సుబ్బారెడ్డిని ఉసిగొల్పాడు చంద్రబాబు. అసలుకు సుబ్బారెడ్డికి అంత సీన్‌ లేకపోయినా ఏకంగా ఎమ్మెల్యే అభ్యర్థి అనేంత స్థాయిలో కలరింగ్‌ ఇస్తున్నారు. రేపటి ఎన్నికల్లో ఆళ్లగడ్డ సీటును ఏవీకి కేటాయించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అఖిలప్రియను తెలివిగా నంద్యాల ఎంపీగా దిగమని అంటున్నాడట చంద్రబాబు నాయుడు.

భూమా కూతురుకు అలా చెక్‌పెట్టిన బాబు.. ఇప్పుడు భూమా బ్రహ్మానికి కూడా ఎర్త్‌ పెడుతున్నాడట. ఒక కుక్కను చంపాలంటే దానికి పిచ్చిది అని ముద్ర వేయడం అనేది సామెత. ఎవరికైనా రాజకీయంగా చెక్‌ పెట్టాలంటే వారిపై అవినీతి ముద్రను వేయడం చంద్రబాబుకు తెలిసిన రాజకీయం. ఇప్పుడు అదే జరుగుతోంది. భూమా బ్రహ్మం పెద్ద అవినీతి పరుడు అని, అతడికి ఎలాగూ మళ్లీ ఛాన్స్‌ రాదని అడ్డంగా దోచుకుంటున్నాడని.. అనుచరవర్గం భారీఎత్తున కబ్జాలూ గట్రా చేస్తోందని పచ్చమీడియా ఘోషిస్తోంది.

డైరక్టుగా ఆయన పేరు పెట్టకుండా.. ఇన్‌ డైరెక్టుగా బ్రహ్మాన్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా చంద్రబాబు మార్కు ట్రీట్‌మెంట్‌ అని.. వచ్చేసారి టికెట్‌ ఇవ్వకుండా పూర్తిగా పక్కన పెట్టడానికి ఇప్పటి నుంచినే కార్యాచరణ మొదలైందని స్పష్టం అవుతోంది. అటు అఖిలను, ఇటు బ్రహ్మాన్ని  ఇద్దరినీ చంద్రబాబు పక్కన పెట్టేయడం ఖరారే అని విశ్లేషకులు అంటున్నారు.