cloudfront

Advertisement


Home > Politics - Gossip

తాడిని తన్నే వాడి.. తలదన్నేవారుంటారు మోడీజీ!

తాడిని తన్నే వాడి.. తలదన్నేవారుంటారు మోడీజీ!

తాడిని తన్నే వాడుంటే.. వాడి తల దన్నేవాడుంటాడనేది సామెత. ఇప్పుడు మోడీ ఈ దేశానికి నేర్పిన ఒక నినాదమే ఇప్పుడు ఆయన విషయంలోనే వినిపిస్తోంది. అవును మరి.. ఆయన ఇతరుల గురించి ఏ రకంగా నిందలు వేస్తూ.. వారికి ఏ రకంగా చుక్కలు చూపించాలని ప్లాన్ చేశారో... ఇప్పుడు ఆయనకు అదే రకంగా చుక్కలు చూపించి.. ఆయన మీద నిందలు వేయడానికి కూడా మరొకరు తయారవుతున్నారు.

కాంగ్రెస్ ముక్త భారత్ అంటూ.. కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలో ఖాళీ చేసేయడం గురించి.. మోడీ గత ఎన్నికల సమయంలో పిలుపు ఇచ్చి.. ఆ కార్యక్రమాన్ని ఒక యజ్ఞం లాగా నిర్వహించగా.. ఇప్పుడు.. మోడీ ముక్త భారత్ ను తయారుచేయాలనే ఉద్యమ నినాదంతో.. మరొకరు ప్రజలకు పిలుపు ఇస్తున్నారు.

నరేంద్రమోడీకి వ్యతిరేకంగా దేశంలోని చిన్న పార్టీలను అన్నీ జట్టుకట్టి.. ఏకంగా కాంగ్రెస్, భాజపా కూటముల అంతు చూడడానికి ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి మరో ఫ్రంట్ ఏర్పాటుకు నడుం బిగించి.. కార్యాచరణ ప్రణాళికలోనికి దిగిన సంగతి అందరికీ తెలిసిందే. కాంగ్రెస్, భాజపా రెండు జాతీయ పార్టీలూ రాష్ట్రాల హక్కులను హరించేస్తున్నాయంటూ వాటికి పూర్తిస్థాయిలో చెక్ చెప్పడమే లక్ష్యంగా.. కేసీఆర్ ఈ విషయంలో పావులు కదుపుతున్నారు.

ఇదే సమయంలో భాజపా పట్ల సానుకూలత ఉన్నప్పటికీ.. మోడీకి వ్యతిరేకంగా మరో ప్రయత్నం కూడా మొదలవుతోంది. కొన్ని దశాబ్దాలుగా భాజపాతో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ.. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో వారితో కలిసే సీట్లు పంచుకుని ఆ తర్వాత మోడీ వైఖరితో విసిగిపోయి.. ఎన్డీయేతో తెగతెంపులు చేసుకున్నారు. ఇప్పుడు ఆయన ఏకంగా మోడీ ముక్త భారత్ అని పిలుపు ఇస్తున్నారు. కనీసం మోడీ ముక్త భాజపా తయారైనా సరే.. శివసేన వారితో మళ్లీ జతకలుస్తుందనేలా ఈ సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఎన్డీయే కీలక భాగస్వామి పార్టీలు ఇప్పుడు పక్కకు తప్పుకుని.. మోడీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తూ ఉండడం.. కేసీఆర్ సారథ్యంలో మరో ఫ్రంట్ తయారవుతూ ఉండడం, తాజాగా భాజపా ప్రభావం తగ్గుతున్నట్లు కూడా కనిపిస్తుండడం ఈ పరిణామాల నేపథ్యంలో మోడీ ముక్త భారత్ అసాధ్యమేమీ కాదని అనిపిస్తోంది.