cloudfront

Advertisement


Home > Politics - Gossip

మరింత ఊబిలోకి దిగుతున్న భాజపా నేతలు!

మరింత ఊబిలోకి దిగుతున్న భాజపా నేతలు!

ఏపీలోని భారతీయ జనతా పార్టీ నేతలు తమకు తెలియకుండానే ఊబిలోకి దిగిపోతున్నారు. కేంద్రం ద్వారా ఆచరణ సాధ్యంకాని, కేంద్రం మంజూరుచేసే అవకాశం లేని హామీల విషయంలో వీరు స్థానికంగా తమ పరువు కాపాడుకోడానికి కమిట్ అయిపోతూ.. ఇరుక్కుపోతున్నారు. ఏదో కర్ర విరగకుండా, పాము చావకుండా.. నర్మగర్భపు మాటలు చెప్పి.. తప్పించుకోవాల్సిన రాజకీయ సందర్భాలలో వారు తెలిసీ తెలియకుండా ఊబిలోకి కూరుకుపోతున్నారని.. విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఒకవైపు కేంద్ర హోంశాఖ కార్యదర్శి స్వయంగా.. విశాఖ రైల్వేజోన్ రావడం అసాధ్యం అని.. ఏపీ చీఫ్ సెక్రటరీకే తేల్చి చెప్పేసిన నేపథ్యంలో.. ఇంకా భాజపా నేతలు మాత్రం వచ్చి తీరుతుందని.. కేంద్రం జోన్ ఇస్తుందనే విశ్వాసం ఉందని, అధికార్ల మాటలు నమ్మాల్సిన అవసరం లేదని.. సన్నాయి నొక్కులు నొక్కుతుండడం విశేషం.

ప్రత్యేకహోదాకు సంబంధించిన డిమాండ్ ను రాష్ట్రంలోని మిగతా అన్ని పార్టీలతో కలిపి.. అధికార తెలుగుదేశం కూడా ఆలస్యంగా భుజానికెత్తుకున్న తర్వాత.. భాజపా నాయకులకు మరోరకమైన మాయ చేసే అవకాశం లేకుండాపోయిందనే చెప్పాలి. హోదా విషయంలో వారు చేయగలిగింది ఏమీలేదని వారికే అర్థమైపోయింది. సాక్షాత్తూ అరుణ్ జైట్లీ హోదా సాధ్యంకాదని చెప్పేసిన తర్వాత.. వారు రాష్ట్ర ప్రజల్ని ట్యూన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. 

హోదా కోసం ఎందుకు పట్టుపడతారు. దానికి సమానమైన ప్యాకేజీ ఇస్తాం అంటున్నారు కదా.. అంటూ చెబుతున్నారు. ఆ మాటలు ప్రజలు నమ్మరని వారికి తెలుసు గనుక.. విశాఖ రైల్వేజోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ తథ్యంగా వస్తాయంటూ.. చాలా నమ్మకంగా నాలుగురోజులపాటూ చెప్పారు. అయితే సోమవారానికి రైల్వేజోన్ హుళక్కి అని తేలిపోయింది.

నిజానికి భాజపా నాయకులు.. ఇక్కడితో.. ఆ సంగతి వదిలేసి.. మరోరకం మాయ మాటల్ని నమ్ముకుంటే బాగుండేది.. కానీ.. వారు ఇంకా.. రైల్వేజోన్ తప్పక వస్తుందనే అంటున్నారు. అక్కడ తేడాకొడితే.. భాజపా నాయకులు  ప్రజల దృష్టిలో పచ్చిమోసగాళ్లుగా ముద్రపడే అవకాశం ఉంటుందని వారు తెలుసుకోవాలి.