Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఈ మాట‌ల బ‌దులు..బీజేపీ నేత‌లు ఆ టీకా వేయించుకోవాలి!

ఈ మాట‌ల బ‌దులు..బీజేపీ నేత‌లు ఆ టీకా వేయించుకోవాలి!

కాంగ్రెస్ కు దేశ‌మంటే భ‌క్తి లేదు, దేశంపై న‌మ్మ‌కం లేదు, సైనికుల త్యాగాల‌ను కాంగ్రెస్ చుల‌క‌న చేస్తోంది.. ఇవీ భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత‌ల ర‌న్నింగ్ కామెంట్లు! క‌రోనా దేశీయ టీకా మూడో ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ గురించి ప్ర‌శ్నించినందుకు బీజేపీ నేత‌లు ఈ మాట‌ల ప‌రంప‌ర‌ను కొన‌సాగిస్తూ ఉన్నారు. 

అంటే.. ఇండియా క‌రోనా విరుగుడు వ్యాక్సిన్ ను త‌యారు చేసింద‌ని ఒప్పుకుంటే, దేశ‌భ‌క్తి ఉన్న‌ట్టు. అలా కాకుండా.. ట్ర‌య‌ల్స్ ఫ‌లితాల సంగ‌తేంటి? అని ప్ర‌శ్నిస్తే వాళ్ల‌కు దేశ భ‌క్తి లేన‌ట్టు. ఇది బీజేపీ మార్కు భాష్యం. స‌రే.. బీజేపీ నేత‌లు ద‌గ్గ‌రుండి క‌రోనాకు వ్యాక్సిన్ త‌యారు చేయించార‌నే అనుకుందాం. 

ప్ర‌పంచానికి చైనా క‌రోనా వైర‌స్ అంటిస్తే, మ‌నం వ్యాక్సిన్ ఇచ్చామ‌ని గ‌ర్వంగా చెప్పుకుందాం. బీజేపీ నేత‌లు ద‌గ్గ‌రుండి వ్యాక్సిన్ త‌యారు చేయిస్తే.. ఇప్పుడు మిగ‌తా ప్ర‌పంచ‌మంతా ఆ ఫార్ములా ను కాపీ కొట్ట‌డానికి తెగ ప్ర‌య‌త్నిస్తోంద‌ని వాట్సాప్ యూనివ‌ర్సిటీలో ద‌రువేద్దాం! 

వాట్సాప్ యూనివ‌ర్సిటీ మార్కు పోస్టులు ఎన్నైనా సృష్టిద్దాం! గుర్రం ఉంది, మైదానం ఉంది. అలాంటివి సృష్టించే మేధోత‌న‌మూ ఉంది. కాబ‌ట్టి.. తిరుగేలేదు.

అయితే.. ఒకే ఒక్కటి చేశాకా.. కాంగ్రెస్ ను తీరిక‌గా నిందించే ప‌ని పెట్టుకోవాలి. అదేమిటంటే.. ఇండియాలో ఆవిష్క‌రించ‌బ‌డిన క‌రోనా వ్యాక్సిన్ ను బీజేపీ నేత‌లంతా వేయించుకోవాలి. వాళ్లింట్లో వాళ్లు వ‌ద్దు. నేత‌లంతా బ‌హిరంగంగా ఆ వ్యాక్సినేష‌న్ చేయించుకోవాలి. 

ఇండియాలో సృష్టించ‌బ‌డిన ఆ వ్యాక్సిన్ కు డీసీజీఐ ప‌ర్మిష‌న్ ఇచ్చేసింది కాబ‌ట్టి.. బీజేపీ నేత‌ల‌కే ఆ వ్యాక్సిన్ ను ముందుగా స‌ర‌ఫ‌రా చేసి, వాళ్లు ఆ వ్యాక్సిన్ డోసేజ్ ల‌ను ఎక్కించుకోవాలి. అదీ నిజ‌మైన దేశ‌భ‌క్తి. అప్పుడు కాంగ్రెస్ ఆట‌క‌ట్టించ‌వ‌చ్చు. 

లేక‌పోతే.. క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ ఫ‌లితాలు కావాలంటారా?  దుష్ట కాంగ్రెస్ నేత‌లకు దేశ‌భ‌క్తి ఎక్క‌డుంది? ఆ భ‌క్తంతా భ‌క్తుల సొంత‌మే. కాబ‌ట్టి.. సైనికుల త్యాగాల‌తో ముడిపెట్ట‌బ‌డుతున్న టీకాను ఆ ముడిపెట్టే వాళ్లంతా అర్జెంటుగా వేసేసుకోవాలి. త‌ద్వారా వాళ్ల దేశ‌భ‌క్తిని నిరూపించుకోవాలి. 

దుష్ట కాంగిరేసుకు శాశ్వ‌త స‌మాధి క‌ట్టాలంటే.. అర్జెంటుగా భ‌క్తులంతా దేశీ వ్యాక్సిన్ వేయించుకోవాలి! క‌రోనాకు విదేశీయులు త‌యారు చేసిన కోవీ షీల్డ్ వంటి టీకాల‌ను దేశీయ‌వాదులు అస్స‌లు వేయించుకోకూడ‌దు. 

విదేశీ వ‌స్తు బహిష్క‌ర‌ణ కింద కోవీ షీల్డ్ ను వేయించుకోకుండా.. భార‌త‌దేశం ఆవిష్క‌రించిన‌, అదే బీజేపీ ద‌గ్గ‌రుండి చేయించిన టీకాను వేసుకున్న వాళ్ల‌కే దేశ‌భ‌క్తి ఉన్న‌ట్టు.  ఎవ‌రైతే కోవీషీల్డ్ అంటారో, ఎవ‌రైతే జాన్స‌న్ అండ్ జాన్స‌న్ అంటారో.. వాళ్లంద‌రికీ దేశ‌భ‌క్తి లేన‌ట్టే. 

బీజేపీ నేత‌లు విదేశీ వ్యాక్సిన్ ల‌ను ముట్ట‌నే ముట్ట‌రు. అవ‌న్నీ దుష్ట కాంగ్రెస్ వాళ్ల కోస‌మే. ఆత్మ‌నిర్భ‌రం కిందట ట్ర‌య‌ల్స్ తో నిమిత్త లేకుండా దేశీ వ్యాక్సిన్ నే బీజేపీ నేత‌లు వేయించుకోవ‌డానికి రెడీ అని స‌వాల్ విసిరే ధైర్యం, ద‌మ్ము ఉందా?

రాజకీయ కామెడీ స్టార్ గా పవన్ కళ్యాణ్

ప‌వ‌న్ పిలిచి సినిమా చేయ‌మ‌న్నాడు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?