Advertisement


Home > Politics - Gossip
సీట్లు పెరగకున్నా ఎక్కువ డిమాండ్‌ చేస్తుందా?

పొత్తులు లేకుండా రాజకీయ పార్టీలు ఎన్నికలను ఎదుర్కోవడం సాధ్యం కాని పరిస్థితి నెలకొనివుంది. రాష్ట్రాల్లో, జాతీయ స్థాయిలో రాజకీయ పరిణామాలను బట్టి రెండు మూడు పార్టీలతో కూడిన కూటములతో పాటు పది కంటే ఎక్కువ పార్టీలూ కలిసి మహా కూటములుగా ఏర్పడుతున్నాయి. ఇలాంటి పెద్ద కూటమిని రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో చూశాం. బిహార్‌ ఎన్నికల్లో మూడు పార్టీల కూటమి చూశాం. యూపీ ఎన్నికల్లో కాంగ్రెసు-ఎస్పీ కూటమి చూశాం.

ఏపీలో రెండు పార్టీల కూటమి ఉంది. ఎన్‌డీఏ, యూపీఏ వివిధ పార్టీలతో కూడిన కూటములు. రెండు పార్టీలైనా, అంతకుమించిన పార్టీలైనా కూటములుగా ఏర్పడేవరకూ బాగానే ఉంటుంది. కాని ఆ వెంటనే లుకలుకలు మొదలవుతాయి. ఎందుకు? సీట్లు (అసెంబ్లీ లేదా పార్లమెంటు స్థానాలు) పంచుకునే విషయంలో తగాదాలొస్తాయి. ప్రతి పార్టీ తానే గొప్పదనే భావన ఉంటుంది. కాబట్టి ఎక్కువ సీట్ల కోసం పట్టుబడుతుంది. సాధారణంగా పార్టీలు అసలు బలం కంటే ఎక్కువ సీట్లు డిమాండ్‌ చేస్తుంటాయి. 

ఇక్కడే తగాదా మొదలవుతుంది. ఒక్కోసారి ఈ గొడవ ముదిరితే కూటమి నుంచి ఏదో ఒక పార్టీ బయటకు వెళ్లిపోవచ్చు కూడా. ఇలాంటి సందర్భాలు చరిత్రలో చాలా ఉన్నాయి. ఇదిలా ఉంటే... తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తామని చెబుతున్న బీజేపీ, ఆంధ్రప్రదేశ్‌లో రకరకాల వ్యూహాల గురించి ఆలోచిస్తోంది. ప్రస్తుతం టీడీపీతో ఉన్న పొత్తు వచ్చే ఎన్నికల్లో ఉంటుందో, ఉండదో తెలియదు.

ఒకవేళ పొత్తు కొనసాగించదల్చుకుంటే టీడీపీకి ఏం షరతు పెట్టాలి? ఏం డిమాండ్‌ చేయాలి? అనే దానిపై బీజేపీ నాయకులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇతర విషయాలు ఎలా ఉన్నా బీజేపీ ప్రధానంగా ఎక్కువ సీట్లు (అసెంబ్లీ, పార్లమెంటు) డిమాండ్‌ చేయొచ్చని ఆ పార్టీ నాయకుల నుంచి అందుతున్న సమాచారం. కేంద్రంలో మళ్లీ బీజేపీయే (ఎన్‌డీఏ) అధికారంలోకి వస్తుందని, నరేంద్ర మోదీయే ప్రధాని అవుతారని కమలనాథులు నిశ్చితాభిప్రాయంతో ఉన్నారు.

తమది బలమైన పార్టీ కాబట్టి ఎక్కువ సీట్లు డిమాండ్‌ చేయాలని అనుకుంటున్నారు. టీడీపీ తమతో కలిసి కొనసాగాలంటే ఎక్కువ సీట్లు ఇవ్వక తప్పదని, తమతో ఆ పార్టీకి అవసరం ఉంది తప్ప తమకేమీ లేదని చెబుతున్నారట...! టీడీపీ కాదనుకుంటే వైకాపా ఉందని అంటున్నారట...! అసెంబ్లీ సీట్లు  ఎలాగైనా పెరుగుతాయి కాబట్టి ఎక్కువ సీట్లు డిమాండ్‌ చేయాలని బీజేపీ నాయకులు మొన్నటివరకూ అనుకున్నారు.

కాని సీట్లు పెరగవని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పినట్లు వార్తలొచ్చాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు దీనిపై ఇంకా ఆశ చావనప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెరగవనే అభిప్రాయానికి  వచ్చేశారు. అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం లేదని, అయినా తమకు ఫరక్‌ పడదని ఆయన ఈమధ్య చెప్పారు. సో...పెరగవనే అనుకోవాలి. సీట్లు పెరగకపోయినాసరే ఎక్కువ డిమాండ్‌ చేయాలని బీజేపీ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. 

అయితే రాష్ట్రంలో బలం పెంచుకోకుండా ఎక్కువ సీట్లు డిమాండ్‌ చేయడం కుదరదని, ముందుగా పార్టీని బలోపేతం చేయాలని కొందరు నాయకులు పార్టీ పెద్దలకు చెబుతున్నారు. దానిపై వ్యూహాలు తయారుచేయడానికే పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా నెలాఖరులో రాష్ట్రానికి రాబోతున్నారు. ఈ సందర్భంగానే కొత్త రాష్ట్ర అధ్యక్షుడి నియామకం కూడా జరుగుతుందంటున్నారు. ఇక పార్టీ ఇన్‌చార్జిగా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ను నియమిస్తారని తెలుస్తోంది. ఆయనకు ఒక్క ఏపీ బాధ్యతే కాకుండా దక్షిణాది బాధ్యతలు అప్పగిస్తారని అనుకుంటున్నారు. రామ్‌మాధవ్‌ వస్తే ఏపీలో పార్టీ బలోపేతం అవుతుందంటున్నారు.

బలోపేతం చేయడమంటే ఇతర పార్టీల్లోని బలమైన, ప్రజాదరణ ఉన్న నాయకులను బీజేపీలో చేర్చుకోవడమే. కేంద్ర ప్రభుత్వ పథకాలను, మోదీ గొప్పతనాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం. కేంద్ర పథకాలను తన పథకాలుగా టీడీపీ సర్కారు ప్రచారం చేసుకుంటోందని రాష్ట్ర బీజేపీ నాయకులు గుర్రుగా ఉన్నారు. బీజేపీ ఎదగడానికి టీడీపీ అడ్డంకిగా ఉందనే భావన కూడా ఉంది. పార్టీ బలంగా లేకపోవడంతో ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి తదితర విషయాలపై బీజేపీ గట్టిగా మాట్లాడలేకపోతోంది. కాబట్టి పార్టీ బలోపేతమైతే 'మా దారి మేం చూసుకుంటాం' అనే ధైర్యం ఉంటుంది. అమిత్‌ షా, రామ్‌మాధవ్‌ వెంటనే ఆ పనిలో నిమగ్నమవుతుండొచ్చు.