cloudfront

Advertisement


Home > Politics - Gossip

వైకాపా వాదనకు కమలదళం దన్ను!

వైకాపా వాదనకు కమలదళం దన్ను!

నిజానికి ఇప్పుడు ఎవరు మాట్లాడినా కూడా.. ఎంత మాట్లాడినా కూడా పెద్ద ప్రయోజనం లేదు! ఇక మిగిలిన వ్యవధి మహా అయితే తొమ్మిది నెలలు కూడా లేదు. ‘బెటర్ లేట్ దేన్ నెవర్’ అన్న సామెత ప్రకారమే చూస్తే గనుక.. కమలదళం ఇన్నాళ్ల తర్వాత అయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండుకు మద్దతుగా తమ గళం వినిపిస్తోంది. అయినా సరే...  చంద్రబాబు ప్రభుత్వం ఎదుట అదంతా బధిరశంఖారావమే అవుతుందనే సంగతి కూడా అందరికీ తెలుసు!

ఇంతకూ విషయం ఏంటంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ మీద ఎమ్మెల్యేలుగా గెలిచి.. తర్వాత తెలుగుదేశంలో చేరిన వారి మీద ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం..  అనర్హత వేటు వేయాలని చాలాకాలంగా జగన్ అండ్ కో డిమాండ్ చేస్తూనే ఉంది. అయితే తొలినుంచి ఏనాడూ వారి వినతులను స్పీకరు కోడెల శివప్రసాద్ పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా.. మరింతగా వైకాపా నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించి.. తెదేపాలో కలిపేసుకున్నారు. వారిలో నలుగురికి నైతిక విలువలకు విరుద్ధంగా మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు.

ఈ అనైతిక పోడకలను నిరసిస్తూ.. ఫిరాయింపుదార్ల మీద చర్య తీసుకునే వరకు తాము సభలో అడుగుపెట్టం అంటూ వైకాపా శాసనసభకు డుమ్మా కొట్టేసింది. ‘అంతకంటె భాగ్యమా’ అన్నట్లుగా వారు రాకపోవడమే మంచిదనుకుంటూ.. తెదేపా స్పందించింది. ఫిరాయింపుదార్లపై వేటు గురించి మాత్రం పట్టించుకోలేదు. పైపెచ్చు.. ‘ప్రభుత్వాన్ని కూలుస్తానని జగన్ అన్నందుకే వారంతా తమ పార్టీలోకి వచ్చారంటూ...’ చంద్రబాబు నిర్మొగమాటంగా ప్రకటించుకున్నారు కూడా.

అయితే, ఈ అరాచక ఫిరాయింపులు ఎప్పుడో మొదలైనా.. ఇన్నాళ్లకు అది తప్పే అంటూ భాజపా కూడా గళం కలుపుతోంది. దాదాపు నాలుగున్నరేళ్లు గడచిపోయాక.. మూడేళ్లుగా వైకాపా ఫిరాయింపుదార్లపై అనర్హత వేటు గురించి పోరాడుతున్నప్పటికీ.. ఏనాడూ ఆ అంశాన్ని పట్టించుకోని రాష్ట్ర భాజపా నాయకులు ఇప్పుడు ఆ అనర్హతల గురించి మాట్లాడడమే చోద్యం.

ఇప్పుడు ఎటూ చంద్రబాబుతో సున్నం పెట్టుకున్నారు గనుక.. జగన్ ను కాస్త ప్రసన్నం చేసుకోవడమే వారి ఉద్దేశంగా ఉన్నదే తప్ప.. ఈ చిత్తశుద్ధిని ఇన్నాళ్లూ ఎందుకు ప్రదర్శించలేకపోయారన్నది ప్రశ్న. పైగా ఫిరాయింపులు కేవలం రాష్ట్రానికి పరిమితమైన విషయాలు కాదు. పార్లమెంటులోనూ వైకాపా తరఫున గెలిచిన ఎంపీలు.. తెదేపాలోకి ఫిరాయించి ఉన్నారు. వారిపై అనర్హత వేటు ఫిర్యాదులు కూడా పార్లమెటు స్పీకరు వద్ద పెండింగులో ఉన్నాయి. భాజపా నాయకులకు అంత చిత్తశుద్ధి ఉంటే ఆ ఎంపీల మీదనైనా వేటు వేయించవచ్చు కదా అని పలువురు అంటున్నారు.