cloudfront

Advertisement


Home > Politics - Gossip

కాంగ్రెస్‌కు పట్టిన గతి.. బీజేపీకా? టీడీపీకా?

కాంగ్రెస్‌కు పట్టిన గతి.. బీజేపీకా? టీడీపీకా?

‘కాంగ్రెస్ కు పట్టిన గతే మీకూ పడుతుంది..’ అని భారతీయ జనతా పార్టీకి తెగ శాపనార్థాలు విధిస్తున్నారు తెలుగుదేశం వాళ్లు. వీళ్ల కథ ఎలా ఉందంటే.. తామేదో ప్రతిపక్ష పార్టీ అయినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. బహుశా జనాలను మరీ వెర్రివాళ్ల కింద లెక్కేస్తే తప్ప.. తెలుగుదేశం పార్టీ వాళ్లు ఇలాంటి మాటలు మాట్లాడరు. జనాలు ఏదీ అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు కాబట్టి.. తమ మాటలను నమ్మేస్తున్నారు, తమ అనుకూల మీడియా తమ తరఫున టమకు వేస్తుంది కాబట్టి.. తామేం చెప్పినా అదే నిజం అయిపోతుంది.. అనే భ్రమలో బతుకుతూ ఉన్నట్టుగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్లు. 

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయాలు, తెలుగుదేశం వాళ్లు ఎస్కేప్ చేసేస్తున్న విషయాలు చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఏమిటంటే.. కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీకి పడుతుంది అనేది అసలు నిజంకాదు. ఎందుకంటే.. ఏపీలో భారతీయ జనతా పార్టీకి ఉన్నది ఏమీలేదు! రాష్ట్ర విభజనకు పూర్వం ఏపీ అంటే అది కాంగ్రెస్ కు స్వర్గధామం. దశాబ్దాలుగా.. కాంగ్రెస్ ను ఆదరిస్తూ వచ్చింది సీమాంధ్ర. దశాబ్దాలకు దశాబ్దాలు అధికారాన్ని ఇచ్చింది, బోలెడంత మంది ఎంపీలను ఇచ్చింది. అలాంటి చోట విభజనతో కాంగ్రెస్ దుంపనాశనం అయ్యింది. 

అయితే.. ఏపీలో బీజేపీకి ఉన్నది బూడిద మాత్రమే. ఉన్న సీట్లు పరిమితం. అవి ఉన్నా లేకపోయినా.. కమలానికి పోయేదీ ఏమీలేదు! ఇక రెండో విషయంలో.. ఇప్పుడు తెలుగుదేశం ఎంపీల తీరును చూస్తుంటే, నాటి కాంగ్రెస్ పార్టీ ఎంపీలే గుర్తుకు వస్తూ ఉన్నారు. విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఏం చేశారో.. ప్రత్యేక హోదా విషయంలో, కేంద్రం చేస్తున్న అన్యాయం విషయంలో.. ఇప్పుడు తెలుగుదేశం వాళ్లు అదే పనే చేస్తున్నారు. నిజం చెప్పాలంటే.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్లు చేస్తున్న నటన కన్నా నాటి కాంగ్రెస్ ఎంపీలే మహా గొప్పగా నటించారు. 

రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తుంటే.. నాటి ఎంపీలు కాంగ్రెస్ లోనే కూర్చున్నారు. సోనియాగాంధీకి విన్నవించామని, దిగ్విజయ్ సింగ్ కు వివరించామని, మొయిలీని హెచ్చరించామని.. ఇలాంటి కథలు చెబుతూ బండి లాగించారు. ఒకవైపు కేంద్రమంత్రి పదవులు అనుభవిస్తూ, అధికార పార్టీ నేతలుగా ఉంటూ.. రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వం అని ప్రగల్బాలు పలికారు. ఉభయసభల్లో రచ్చలు చేశారు, పెప్పర్ స్ప్రేలు చల్లారు. ఆఖరికి వరకూ అలాంటి హైడ్రామాలు చేస్తూ.. చివర్లో మాత్రం.. సమైక్యాంధ్ర అన్నారు. 

కిరణ్ కుమార్ రెడ్డి వెంట కొందరు వెళ్లారు.. చివరకు ఏమైంది? కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్రానికి అన్యాయం చేయదు అని చివరి వరకూ వాదించిన వారూ అడ్రస్ లేకుండా పోయారు, విభజన తర్వాత సమైక్యాంధ్ర అని కిరణ్ వెంట వెళ్లిన వారూ గల్లంతయ్యారు. మరి అప్పట్లో కాంగ్రెస్ ఎంపీలు పోషించిన పాత్రనే.. ఇప్పుడు తెలుగుదేశం ఎంపీలు పోషిస్తూ ఉన్నారు. ఇందుమూలంగా ఈజీగా అర్థం చేసుకోవచ్చు.. కాంగ్రెస్ కు పట్టే గతి పట్టేదెవవరికో! బీజేపీకి కాంగ్రెస్ గతి పట్టడమే నిజం అయితే, ఆ గతి బీజేపీతోనే ఆగిపోదు. తెలుగుదేశానికీ చావుదెబ్బ తగలకపోదు సుమా!