Advertisement


Home > Politics - Gossip
రోజురోజుకూ బలపడుతున్న బీజేపీ

ఎట్టకేలకు భారతీయ జనతా పార్టీకి రాజ్యసభలో మెజా రిటీ వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ కంటే బీజేపీకి ఒక సీటు పెరిగింది. బీజేపీ సంఖ్యాబలం 58 అయితే కాంగ్రెస్‌ సంఖ్యాబలం 57. అయితే ఎన్డీఏకు మెజారిటీ రావడానికి మరో ఏడాది పడుతుంది. ఏప్రిల్‌ 2018 తర్వాత ఎన్డీఏకు రాజ్యసభలో తిరుగుండదు. రాజ్యసభ చైర్మన్‌గా ఉపరా ష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రవేశించిన తర్వాత బీజేపీకి రాజ్యసభలో నైతిక బలం పెరిగినట్లే లెక్క.

ఇప్పటివరకూ రాజ్యసభ చైర్మన్‌గా ఉన్న హమీద్‌ అన్సారీ, వైస్‌ చైర్మన్‌గా ఉన్న పిజె కురియన్‌ ఇద్దరూ ప్రతిపక్షానికి చెందిన వారే. ఇక పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా కూడా రాజ్యసభ సభ్యు డుగా సభలో ప్రవేశించారు. దీనితో బీజేపీకి అటు పీఠం పై వెంకయ్య, ఇటు క్రింద అమిత్‌ షా పెద్ద అండగా లభించారు. ఇద్దరూ గతంలో పార్టీ అధ్యక్షులు కావడం గమనార్హం.

బీజేపీకి మరో ప్రయోజనం నితీష్‌ కుమార్‌ వల్ల కలి గింది. జేడీయూ ఎన్డీఏలో చేరినందువల్ల లోక్‌సభ నుంచి ఇద్దరు ఎంపీలు, రాజ్యసభ నుంచి 9 మంది ఎంపీలు అధి కార పక్షానికి వచ్చారు. దీనివల్ల అధికారపక్ష సంఖ్యాబలం పెరిగింది. ఇప్పుడు తమిళనాడులో ఉన్న అన్నాడీఎంకె కూడా ఎన్డీఏలో చేరే అవకాశాలున్నాయి. దీనివల్ల బీజేపీకి 13మంది ఎంపీలు లభిస్తారు. గత కొద్ది నెలలుగా రాజ్య సభలో బీజేపీ సంఖ్యాబలం కూడా పెరిగింది. గోవాలో ఉన్న ఏకైక సీటు బీజేపీకి దక్కింది. బహుజన సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతి రాజీనామా చేయడం వల్ల ఆ సీటు కూడా బీజేపీకి దక్కే అవకాశాలున్నాయి. మరోవైపు బీజేపీ నామినేటెడ్‌ కేటగిరిలో మరికొన్ని సీట్లను పెంచేందుకు వీలుంది.

బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా రాజ్యసభలో ప్రవేశించిన తీరు కాంగ్రెస్‌కు ముచ్చెమటలు పెట్టించింది. సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌ మరోసారి రాజ్య సభకు రావడానికి నానా కష్టాలు పడాల్సి వచ్చింది. కాం గ్రెస్‌ ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించడం, కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టడం, బెంగళూరు మంత్రి శివకు మార్‌పై ఏసీబీ నేతలు దాడులు చేయడం, ఎన్నికల కమి షన్‌ చుట్టూ తిరిగి రెండు ఓట్లు చెల్లవని ప్రకటించేలా చేయడంతో చివరకు చావుతప్పి కన్ను లొట్టపోయినట్లుగా అహ్మద్‌ పటేల్‌ గెలిచాడు. ఇప్పటివరకూ కాంగ్రెస్‌ నేతలను తనచుట్టూ తిప్పుకున్న అహ్మద్‌ పటేల్‌ అమిత్‌ షా చక్రబంధంలో గిలగిల తన్నుకున్నారు.

పార్టీ ఎమ్మెల్యేలపై తనకు పట్టులేదని అహ్మద్‌ పటేల్‌ తెలుసుకున్నారు. శంకర్‌ సింఘ్‌ వఘేలా గ్రూపు అహ్మద్‌ పటేల్‌కు వ్యతి రేకంగా పనిచేసింది. నిజానికి అహ్మద్‌ పటేల్‌ ఒక దశలో మమతా బెనర్జీ సహాయం తీసుకుని పశ్చిమ బెంగాల్‌ ద్వారా రాజ్యసభకు వచ్చేందుకు ప్రయత్నించారంటేనే అమిత్‌ షా అంటే ఆయన ఎంత భయపడ్డారో అర్థమ వుతుంది. అయితే రాహుల్‌ గాంధీ ఒప్పుకోకపోవడంతో అహ్మద్‌ పటేల్‌ గుజరాత్‌ నుంచి రాక తప్పలేదు.

అహ్మద్‌ పటేల్‌ కూడా లేకపోతే గుజరాత్‌లో కాంగ్రెస్‌ మరింత బల హీనపడుతుందని రాహుల్‌భావించారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆఖరున జరగనున్న గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోరు హోరాహోరీ ఉంటుందని పరి శీలకులు భావిస్తున్నారు. గుజరాత్‌లో 150అసెంబ్లీ సీట్లు గెలుచుకుని చరిత్ర సృష్టించాలని అమిత్‌షా ఇప్పటికే పార్టీ వర్గాలకు పిలుపు నిచ్చారు.

ఇక బీహార్‌లో అసెంబ్లీని రద్దుచేసి తిరిగి ఎన్ని కలకు పోవడానికి నితీష్‌ కుమార్‌ సిద్ధపడుతున్నట్లు సమాచారం. ఈలోపు ఆర్‌జేడీనేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు అమిత్‌ షా చకచకా పావులు కదుపుతున్నారు. లాలూప్రసాద్‌ యాదవ్‌ ప్రతిరోజూ సీబీఐ కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తు న్నది. ఆయన మొత్తం కుటుంబం కేంద్ర సంస్థల దర్యా ప్తును ఎదుర్కొంటున్నది. ఒకవైపు వచ్చే ఎన్నికలకు సన్నద్ద మవ్వాలా, లేక మరోవైపు కోర్టుల చుట్టూ తిరగాలా తేల్చు కోలేక లాలూ, ఆయన కుటుంబ సభ్యులు సతమతమ వుతున్నారు.

ఆగస్టు 27న భారీ ర్యాలీ జరిపి తన బలప్రద ర్శన నిరూపించుకోవాలని లాలూ భావిస్తున్నారు. బీజేపీ భాగో, బీహార్‌ బచావో నినాదంతో లాలూ తలపెట్టిన ఈ ర్యాలీకి రాహుల్‌, మమతా బెనర్జీతో సహా మొత్తం ప్రతి పక్ష నేతలు హాజరయ్యే అవకాశాలున్నాయి. కాని ఈ ర్యాలీని అధికారంలోని నితీష్‌ ప్రభుత్వం భగ్నం చేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. ర్యాలీ విఫలమైతే ఎన్డీఏ నైతికంగా బలపడుతుంది. ఈ ర్యాలీ జరిగేలోపే లాలూ, ఆయన కుమారుడు తేజస్విని అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదు.

అన్ని అవాంతరాలను దాటుకుని ర్యాలీ విఫ లమైతే తమకూ ప్రతిపక్షాలకూ మధ్య పోరాటాన్ని నీతికి, అవినీతికి మధ్య పోరాటంగా చిత్రించేందుకు ఎన్డీఏ సిద్దమవుతున్నది. ఏమైనా లోక్‌సభ ఎన్నికలతో పాటే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఓడిషా, బీహార్‌, మహారాష్ట్ర, జార్కండ్‌, హర్యానా ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. వర్షాకాల సమావేశాలు శుక్రవారంతో ముగుస్తుండగా, డిసెంబర్‌ మొదటివారంలో శీతాకాల సమావేశాలు జరి గేలోపు పార్లమెంట్‌కు సుదీర్ఘ విరామం లభిస్తుంది. ఈ కాలంలో మోడీ, అమిత్‌ షా ద్వయం అనేక పావులు కదుపనున్నాయి. వివిధ రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షుల మార్పు జరుగనున్నది.

అందులో ముఖ్యమైనది ఆంధ్రప్రదేశ్‌ పార్టీ అధ్యక్షుడి మార్పు. ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గంలో కూడా భారీ ఎత్తున విస్తరణ జరుగనుంది. పలువురు నేతలకు ఉద్వాసన, కొత్త వారికి స్థానం లభించనుంది. అయిదారు రాష్ట్రాలకు గవర్నర్లు మారనున్నారు. కొన్ని పార్టీలు ఎన్డీఏలో చేరే అవకాశాలున్నాయి. ఈ మొత్తం మార్పుల ద్వారా బీజేపీ ఏ దిశలో పయనిస్తున్నదో తెలుసు కోవడానికి వీలు కలుగుతుంది. ఏమైనా ప్రతిపక్షాలు ఆత్మరక్షణ దశలో ఉండగా బీజేపీ విజ్రుబన దశలో ఉన్నదని చెప్పవచ్చు. ప్రతిపక్షాలు బలాన్ని కూడదీసుకుని సంఘటితం అయినప్పుడే, కొత్త శక్తులు చేరినప్పుడే బీజేపీని ఎదుర్కోగలుగుతాయి.