cloudfront

Advertisement


Home > Politics - Gossip

బీజేపీకి అస్సలేమీ తెలియదు పాపం.!

బీజేపీకి అస్సలేమీ తెలియదు పాపం.!

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు.. ఎందుకు, ఎలా వచ్చాయో అందరికీ తెలుసు. ఢిల్లీకి వెళ్ళిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, అక్కడ పరిస్థితులన్నిటిపైనా కేంద్రప్రభుత్వ పెద్దలతో మంతనాలు జరిపి.. తిరిగొచ్చాక, తెలంగాణ అసెంబ్లీ రద్దు విషయమై కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెల్సిందే. ఎప్పుడు అసెంబ్లీని రద్దుచేస్తే, ముందస్తు ఎన్నికలు ఎప్పుడొస్తాయో పక్కా ప్లానింగ్‌ వేసుకుని, అందుకు తగ్గట్టే అన్నీ సిద్ధం చేసుకుని, కేంద్రంలోని ఎన్డీయే సర్కార్‌ ఆశీస్సులు తీసుకున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌.

చిత్రంగా, బీజేపీ పెద్దలు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్ళారో సమాధానం చెప్పాలంటూ డిమాండ్‌ చేసేస్తున్నారు. బీజేపీ జాతీయస్థాయి నేతలూ 'మాకేమీ తెలియదు' అన్నట్టే వ్యవహరిస్తున్నారు.. ముందస్తు ఎన్నికలు - కేసీఆర్‌ వ్యూహంపై. ముందస్తు ఎన్నికల ఆలోచన కేసీఆర్‌ది.. ఆ ఆలోచనకి ఆశీస్సులు అందించింది కేంద్రప్రభుత్వ పెద్దలే. ఇందులో ఇంకోమాటకు తావులేదు. కేసీఆర్‌ని, పార్లమెంటు సాక్షిగా 'మెచ్యూర్డ్‌ సీఎం' అని ప్రధాని అభివర్ణించడం.. ఆ తర్వాతే, జాతీయ స్థాయిలో బీజేపీ - టీఆర్‌ఎస్‌ మధ్య ఆఫ్‌ ది రికార్డ్‌గా అవగాహన కుదరడం తెల్సిన విషయాలే.

కోర్టులో ఓటరు లిస్టు విషయమై కేసు పెండింగ్‌లో వుండగానే, ఎన్నికల కమిషన్‌.. తెలంగాణలో ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం ఆషామాషీ వ్యవహారం కాదు. పైగా, ఆ ప్రకటన చేసిన సమయానికి కొద్దిగంటల ముందు ప్రధాని నరేంద్రమోడీ రోడ్‌ షో ఒకటి జరిగింది. ఆ రోడ్‌ షో కారణంగా, ఎన్నికల కమిషన్‌ మీటింగ్‌ కూడా కొద్దిగంటలు వెనక్కి జరిగింది. ఒకదానికొకటి 'లింక్డ్‌' వ్యవహారాలే వున్నాయిక్కడ.

లేటెస్ట్‌ డెవలప్‌మెంట్‌.. కేంద్రం, తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు నిధుల్ని ప్రకటించడం. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక, ఇదెలా సాధ్యమయ్యింది.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఇవేనా, ముందు ముందు చాలా అద్భుతాలు జరగనున్నాయి. కేంద్రంతో, తద్వారా ఎన్నికల కమిషన్‌తో ఎంత సఖ్యత లేకపోతే డిసెంబర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, తెలంగాణ అసెంబ్లీని రద్దుచేసిన అనంతరం కేసీఆర్‌ ధీమాగా చెప్పగలరు.?

2014 ఎన్నికల తర్వాత తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అధికార పీఠమెక్కింది.. ఆ ప్రభుత్వానికి బయటనుంచి మద్దతిచ్చింది మజ్లిస్‌ పార్టీ. ఇప్పుడు, 2018లో జరిగే ముందస్తు ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌ మళ్ళీ అధికార పీఠమెక్కితే.. ఆ పార్టీకి రెండు పార్టీలు బయటనుంచి మద్దతివ్వనున్నాయి.. అందులో ఒకటి మజ్లిస్‌.. ఇంకోటి బీజేపీ.

ఇందులో తప్పేమింది, టీఆర్‌ఎస్‌కి వ్యతిరేకంగా.. కాంగ్రెస్‌, టీడీపీ, తెలంగాణ జనసమితి ఒక్కటయ్యాక.. ఇతర రాజకీయ పార్టీలు టీఆర్‌ఎస్‌ వెనకాల నడవడం వింతేమీ కాకపోవచ్చేమో.!