Advertisement


Home > Politics - Gossip
దుర్గమ్మ చీరదొంగ బోర్డు మెంబరే!

దుర్గగుడి పాలకమండలి సభ్యత్వం నుంచి కోడెల సూర్యలతను ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు జీవో జారీచేసి, ఈవోకు కూడా కాపీ పంపేసింది. దుర్గగుడిలో విలువైన చీర దొంగతనం జరిగినప్పటినుంచి.. ఆరోపణలు ఎదుర్కొంటున్న పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలతపై ప్రభుత్వం వేటువేసింది. ఇప్పుడు తప్పు జరిగిన తర్వాత.. వేటు వేయడం సంగతి సరే... అసలు తెలుగుదేశం తైనాతీలుగా పదవులు దక్కించుకుని.. తప్పు బయటపడకుండా.. దొరలుగానే చెలామణీ అవుతున్నవారు ఇంకా ఎందరున్నారు? అనేదే ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న.

అడుసు తొక్కనేల కాలు కడగనేల అనేది సామెత. తప్పుడు పనులు చేయడం ఎందుకు ? వాటి వలన పరువు పోయినప్పుడు, దిద్దుకోవడానికి నానాతంటాలు పడడం ఎందుకు? అనే నీతిని ఈ సామెత మనకు తెలియజేస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రం ఈ నీతికి భిన్నంగా వ్యవహరిస్తుండటం విశేషం! మేము తప్పులు చేస్తూనే ఉంటాం... అవి బయటపడిన సందర్భంలో మాత్రమే వాటిని దిద్దుకునే ప్రయత్నం చేస్తాం!

ఎవరూ గుర్తించకపోతే అదే తప్పులతో విచ్చలవిడిగా చలామణి అవుతూ ఉంటాం... అనేదే తమ నీతిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెలరేగుతూ ఉన్నదనడానికి అనేక నిదర్శనాలు మనకు కనిపిస్తుంటాయి. మొన్నటికి మొన్న తిరుమల తిరుపతి దేవస్థానాలకు పాలకమండలిని నియమించినప్పుడు... క్రిస్టియన్ ఓ ఎమ్మెల్యేను బోర్డు మెంబరుగా నియమించడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం తమ అరాచకత్వాన్ని ప్రదర్శించింది. తప్పు బయటపడిపోగానే.. ఏదో ఎంక్వయిరీ అనే తంతు జరిపించి.. చివరికి ఆమెను బోర్డు సభ్యుల జాబితానుంచి తొలగించి నాలుక కరచుకున్నారు.

ఇప్పుడు దుర్గగుడి వ్యవహారం తెరమీదకు వచ్చింది. దుర్గగుడిలో ఎంతో విలువైన చీర మాయం అయింది. భక్తులు కానుకగా సమర్పించిన చీరను.. దుర్గమ్మ వారి పాలకమండలి సభ్యురాలుగా ఉన్న తెదేపా నాయకురాలే దొంగిలించడం ఇక్కడ విశేషం. మొత్తానికి ఆమెను బోర్డు నుంచి తప్పించారు.

ఇలా పచ్చదొంగలు బయటపడినప్పుడు.. నిస్సిగ్గుగా ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకుంటోంది. అంటే.. తప్పులు బయటపడకుండా ఇంకా ఎందరు దొంగలు చెలరేగుతూ ఉన్నారో అనే భయాలు ప్రజలకు కలుగుతున్నాయి.