Advertisement


Home > Politics - Gossip
గుర్రమూ గాడిదా ఒకటేనా... రాహుల్!

గుర్రాన్నీ గాడిదనీ ఒకే గాటన కట్టేస్తే పోలా.. అన్నాట్ట వెనకటికి ఓ మేధావి. ఈ దేశానికి కాబోయే ప్రధాని అనే ట్యాగ్ లైన్ తగిలించుకుని ప్రపంచం మొత్తం తిరిగేస్తూ ఉండే కాంగ్రెస్ పార్టీ ఆశా కిరణం రాహుల్ గాంధీ ప్రస్తుతం వ్యవహరిస్తున్న శైలి, మాట్లాడుతున్న మాటలు ఈ మేధావి వచనాల కంటె భిన్నంగా ఎంతమాత్రమూ లేవు. 

ఏదో తాను భట్టీయం వేసుకుని... ముక్కున పట్టి వచ్చిన నాలుగు ముక్కలను ప్రజల ఎందుట ప్రసంగం రూపంలో అప్పజెప్పేసి వెళ్లిపోవడం అంటే తనకు చెల్లుతుంది గానీ.. ఎదుట ఉన్న జన సమూహం లోంచి ఎవరో ఒకరు ఏదో ఒక ప్రశ్నను సంధిస్తే మాత్రం ఆయన తెలివితేటలు అచ్చంగా బయటపడిపోతూనే ఉంటాయి. తాజాగా అమెరికా బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ప్రసంగించిన రాహుల్.. తన తత్తరపాటును ప్రదర్శించారు. అర్థం పర్థంలేని వ్యాఖ్యానాలతో రక్తి కట్టించారు.

ఆ సభలో రాహుల్ ను సభికులు, భారతదేశంలో కుటుంబ పరిపాలన గురించి ఓ ప్రశ్న అడిగారు. కేవలం కుటుంబం పేరు చెప్పుకునే.. ‘మా తాతలు నేతులు తాగారు...’ సామెత చందంగా.. తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న రాహుల్.. ఈ ప్రశ్నతో తడబడిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే.. ఆ ప్రశ్నల పట్ల ఆయన అసహనం కూడా ప్రదర్శించారు. కుటుంబ పాలన గురించి, వారసత్వ వ్యవహారాల గురించి నన్న గుచ్చి గుచ్చి ప్రశ్నించకండి అంటూ రిటార్టు ఇచ్చారు. అయితే.. తన వారసత్వపు పెత్తనం గురించి ఆయన సమర్థించుకున్న తీరు మాత్రం చాలా చిత్రంగానే ఉంది.

భారతదేశంలోనే వారసత్వపు వ్యవహారాలు ఎక్కువట. అందుకని.. రాజకీయాల్లో ఉన్న తనను, స్టాలిన్, అఖిలేశ్ యాదవ్ వంటి వారితో ఆయన పోల్చుకున్నారు. అయితే చిత్రంగా చిత్రపరిశ్రమలో ఉన్న అభిషేక్ బచ్చన్ వంటి వారిని కూడా ఆయన ఇదే గాటన కట్టేశారు. వ్యాపార రంగంలో ఉన్న ముఖేష్, అనిల్ అంబానీలను కూడా వారసత్వపు గాటన కట్టేశారు. అసలు రాహుల్  తలాతోకా లేకుండా మాట్లాడేశారు. చిత్రపరిశ్రమలో వారసత్వంగా హీరోలు రావచ్చు గాక.. కానీ.. వారసత్వంగా వారి సినిమాలు హిట్ అవుతాయనే నమ్మకం లేదు.

వారసత్వంగా వారు కామన్ గా ఎంట్రీ ఇవ్వగలరే తప్ప.. పెత్తనం చెలాయించే పై పొజిషన్ లోకి వారసత్వంగా రారు.. తమ ప్రతిభ ఆధారంగా మాత్రమే వస్తారు. కానీ రాజకీయాల్లో అలా కాదు.. కేవలం ‘ఆ’ కుటుంబంలో పుట్టినందుకు వారు పెత్తనం వహిస్తూ పై పదవుల్లోకే ఎంట్రీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే.. వ్యాపార రంగంలో వారసత్వాన్ని కూడా.. రాజకీయాలతో ఏ లెక్కన రాహుల్ పోల్చారో అర్థం కావడం లేదు. ధీరూబాయ్ అంబానీ వ్యాపారానికి ఆయన కొడుకులు కాకుండా మరొకరు వారసులు ఎలా అవుతారు? వ్యాపారం అనేది ఆస్తి.

దానికి కుటుంబమే వారసత్వం వహిస్తుంది. రాజకీయాన్ని , కాంగ్రెస్ పార్టీని కూడా రాహుల్ తమ కుటుంబ ఆస్తిగా భావిస్తున్నారా... అనే అభిప్రాయం ఈ మాటలు వింటే ఏర్పడుతుంది. అందుకే... రాహుల్.. తన అవగాహన రాహిత్యంతో.. గుర్రాన్నీ గాడిదనూ ఒకే గాటన కట్టేసే చందంగా రాజకీయాలను, సినిమా రంగాన్ని, వ్యాపార రంగాన్ని .. వారసత్వం విషయంలో  ఒకటే అన్నట్లుగా మాట్లాడుతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.