Advertisement


Home > Politics - Gossip
వెంకయ్య కన్నీళ్లకు బ్రాండ్ అంబాసిడర్?

తెలుగువాడైన వెంకయ్యనాయుడు దేశంలోనే రెండో అత్యున్నత పదవిలో ఉన్నారు. ఆయన ఈ దేశానికి ఉపరాష్ట్రపతి. ఆయన ఏ ప్రాంతం వాడైనప్పటికీ తెలుగుజాతి మొత్తం గర్వంగా భావించగల అంశం ఇది. అయితే ఆ ఉపరాష్ట్రపతి పదవి పట్ల వెంకయ్యనాయుడు విలపిస్తున్నారా? ఆయనకు ఆ పదవి ఇష్టం లేదా? ‘తెలుగుజాతికి ద్రోహం చేయడం’ అనే సుదీర్ఘమైన ఎజెండాలో భాగంగానే.. ప్రధాని నరేంద్రమోడీ వెంకయ్యనాయుడును కేంద్రమంత్రి పదవి నుంచి ఉపరాష్ట్రప్రతి స్థానంలోకి పంపించారా? ఆ రకంగా ఆయనను పంజరంలో బంధించారా? అనే అనుమానాలు ఇప్పుడు ప్రజల్లో కలుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధన సమితి అధ్యక్షుడిగా ఉన్న చలసాని శ్రీనివాస్ మాటల వల్ల ఇలాంటి అనుమానాలు పుట్టుకొస్తున్నాయి.

వెంకయ్యనాయుడు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితిని ప్రధాని మోడీ కల్పించారంటూ చలసాని వ్యాఖ్యానించారు. వెంకయ్యనాయుడు స్వర్ణ పంజరంలో ఉన్నారంటూ ఆయన మీద సానుభూతిని కూడా కురిపించారు.

అయితే చలసాని మాటల మీదే పుట్టెడు అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. వెంకయ్యనాయుడును భాజపాకు దూరం చేయడంతోపాటూ, దత్తాత్రేయను కేంద్రమంత్రిగా తప్పించడం, మరే తెలుగు వ్యక్తికీ కేంద్ర కేబినెట్ లో చోటు ఇవ్వకపోవడాన్ని చలసాని శ్రీనివాస్ ప్రశ్నిస్తున్నారు గానీ.. వెంకయ్య విషయంలో ఆయన సానుభూతి అర్థం కావడం లేదు.

వెంకయ్యనాయుడు పదవిలో ఉండగా రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఊసెత్తింది లేదు. పైగా అది సర్వరోగ నివారణి కాదంటూ ఎద్దేవా చేశారు. ప్యాకేజీకి మూలకారకుడు తానేనంటూ రాష్ట్రవ్యాప్తంగా సన్మానాలు చేయించుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీని భారత దేశానికి దేవుడిచ్చిన వరంగా, సాక్షాత్తూ దేవుడిగా అభివర్ణించి మురిసిపోయారు. అయితే ఇప్పుడు కొత్తగా వెంకయ్య కన్నీళ్ల గురించి ప్రచారం చేస్తూ... ఆయన ఆ పదవిలో అసంతృప్తిగా ఉన్నట్లు చలసాని శ్రీనివాస్ ప్రచారం చేస్తుండడం చిత్రమైన సంగతే.

ఆయన కన్నీళ్లకు చలసాని శ్రీనివాస్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని ప్రజలు అనుకుంటున్నారు. వెంకయ్యనాయుడు విభజన సమయంలో హోదా గురించి గర్జించి, తీరా తాను కేంద్రమంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత.. హోదా విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేశాడనే బాధ ప్రజల్లో ఉంది. వారు దానిని మరచిపోయేలా వెంకయ్య మీద సానుభూతి పుట్టించడానికి చలసాని శ్రీనివాస్ వకాల్తా పుచ్చుకున్నట్లున్నదని ప్రజలు అనుకుంటున్నారు.