cloudfront

Advertisement


Home > Politics - Gossip

బ్రేకింగ్ : తెలంగాణ ఎన్నికలకు పవన్ దూరం!

బ్రేకింగ్ : తెలంగాణ ఎన్నికలకు పవన్ దూరం!

తెలంగాణలో ఇప్పటిదాకా తమ పార్టీ అస్తిత్వం గురించి ఏమాత్రం దృష్టి పెట్టని జనసేనాని పవన్ కల్యాణ్.. తెలంగాణలో ఇప్పుడు ముంచుకు వచ్చిన ముందస్తు ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు! ఎన్నికలు అనుకున్న షెడ్యూలు ప్రకారం.. 2019 మేలో జరిగి ఉన్నట్లయితే.. జనసేన తప్పకుండా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు సొంతంగా పోటీచేసి ఉండేదని.. కానీ ఎన్నికలు ఏడునెలలు ముందుగానే వచ్చిన నేపథ్యంలో పార్టీ వ్యవస్థీకృతంగా ఇంకా సన్నద్ధంగా లేనందున ఈ ఎన్నికల్లో పోటీచేయబోయేది లేదని పవన్ కల్యాణ్ ప్రకటించబోతున్నారు!!

ఈ ఎన్నికలకు సంబంధించినంత వరకు ఏ పార్టీలకు మద్దతు ఇవ్వబోయేది కూడా లేదని ప్రకటించాలని పవన్ నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో కొంతమేర లబ్దిపొందడానికి పవన్ కల్యాణ్ ను కూడా తమతో కలుపుకుని, ఆయన క్రేజ్ ను కూడా వాడుకుని కొన్ని సీట్లయిన గెలవాలని సీపీఎం తన ప్రయత్నాల్లో తాను ఉంది. ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం- పవన్ ను బహుజన లెఫ్ట్ కూటమిలోకి ఆహ్వానించారు. అందుకోసం రెండు విడతలుగా పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీతో చర్చలు కూడా జరిపారు.

ఆ చర్చల్లో వారు తమ్మినేనికి ఏ నిర్ణయమూ తేల్చి చెప్పలేదని సమాచారం. తమ్మినేని ప్రతిపాదనను పవన్ దృష్టికి మాత్రమే తీసుకువెళ్లారు. అయితే సీపీఎం వారికంటూ సొంత లేకపోగా, తమమీద ఆధారపడుతున్నదని, అందుకు తాము అవకాశం ఇవ్వకూడదని పవన్ భావించినట్లు పార్టీవర్గాల ద్వారా తెలుస్తోంది. అందుకే ఎటూ మొగ్గకుండా.. పై తెలిపిన కారణాలు చెప్పి ఎన్నికలకు దూరంగా ఉండిపోతారన్నమాట.

పవన్- చంద్రబాబును సుదీర్ఘకాలం పాటు పదేపదే కీర్తించి హటాత్తుగా ప్లేటు ఫిరాయించి తిట్టడం స్టార్ట్ చేశారు. తెలంగాణలో కేసీఆర్ పాలనను కూడా నిన్నటిదాకా తెగపొగిడారు. ఇప్పుడు ఇక్కడ కూడా ప్లేటు ఫిరాయించి.. కేసీఆర్ వ్యతిరేక పార్టీలతో జట్టు కడితే.. తనకున్న క్రెడిబిలిటీ సాంతం నాశనం అవుతుందని పవన్ కల్యాణ్ భయపడుతున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి పవన్ ఏ పార్టీతో కలుస్తాడో అని నిరీక్షించిన పార్టీలు.. ఆయన సంగతి మరచిపోయి.. ఇక తమ పొత్తుల సంగతి డిసైడ్ కావొచ్చునన్నమాట.