Advertisement


Home > Politics - Gossip
అంత తెగింపు ధైర్యం మంత్రులకు ఉంటుందా?

సుప్రీం కోర్టు నిర్వహణ , న్యాయవ్యవస్థలో చోటు చేసుకున్న లోపాల గురించి సుప్రీం సీనియర్ న్యాయమూర్తులు ప్రెస్ మీట్ పెట్టడం.. చీఫ్ జస్టిస్ పై ప్రజల్లో అనుమానాలు రేకెత్తేలా ఆరోపణలు చేయడం ద్వారా రేగిన దుమారం ఇప్పట్లో చల్లారే అవకాశం కనిపించడం లేదు. రాజకీయాల్లో కూడా ఇలాంటి వైఖరి.. పరిణామాలు రావాలని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

ఫరెగ్జాంపుల్.. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుల్లో ఒకరు... మాజీ కేంద్ర  ఆర్థిక మంత్రి కూడా అయిన యశ్వంత్ సిన్హా.. కేంద్రంలోని మంత్రులు, ఎంపీలు కూడా ప్రభుత్వంలో ఉన్న లోటు పాట్ల గురించి.. ఏకపక్ష ధోరణుల గురించి.. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల మాదిరిగా నిస్సంకోచంగా మాట్లాడాలని.. అప్పుడే ప్రజాస్వామ్యానికి మేలు జరుగుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు రాజకీయ వ్యవస్థలో ఈ రకంగా తెగింపుతో.. ప్రభుత్వంలోని పెద్దల మీద విమర్శలు చేసేంత స్వేచ్ఛాయుత వాతావరణం మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నదా? అనే చర్చ మొదలవుతోంది.

యశ్వంత్ సిన్హా అంటే ఆషామాషీ నాయకుడు  కాదు. అయితే ఆయన చాలా కాలంగా సొంత పార్టీ నాయకత్వం మీదనే అనేకానేక విమర్శలు రువ్వుతున్నారు. ప్రతిసారీ ప్రధానంగా ఆయన విమర్శనాస్త్రాలు నరేంద్రమోడీ, అమిత్ షాల మీదనే ఎక్కు పెట్టి ఉంటాయి. అలాంటి యశ్వంత్ సిన్హా ఇప్పుడు సుప్రీం న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్ కు వ్యతిరేకంగా పెట్టిన ప్రెస్ మీట్ ను విడిచిపెట్టడం లేదు. అందులో అంశాలను ఉదాహరిస్తూ.. ఆయన కేంద్ర ప్రభుత్వం ఉన్న లోటుపాట్ల గురించి మంత్రులు కూడా ఇలాగే స్పందించాలని అంటున్నారు.

‘‘చీఫ్ జస్టిస్ అంటే.. ఆయన ఉన్నత పదవిలో ఉన్నట్లు కాదని.. సమానహోదాగల  న్యాయమూర్తుల్లో ఆయన ఒకరు మాత్రమే’’ అని నలుగురు న్యాయమూర్తులు తెగేసి చెప్పారు. కేంద్ర కేబినెట్ కూడా అంతే అని సిన్హా అంటున్నారు. ‘‘ప్రధాని అంటే ఆయన గొప్పేమీ కాదు. సమాన హోదా ఉండే మంత్రుల్లో ఆయన ఒకరు మాత్రమే ’’ అనేది ఆయన తెరపైకి తెస్తున్న వాదన. అందరూ సమానులే కాబట్టి.... నరేంద్రమోడీ మోనార్క్ ధోరణులను దుర్మార్గపు పాలన విధానాలను గురించి మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు తెలియజెప్పే రోజు రావాలని ఆయన కోరుకుంటున్నారు.

సాంకేతికంగా యశ్వంత్ సిన్హా చెప్పిన మాటలు నిజమే కావొచ్చు. అంటే సాంకేతికంగా ప్రధాని మిగిలిన మంత్రులతో సమానమే కావొచ్చు. కానీ మన రాజకీయ వ్యవస్థలో ప్రధానిని ధిక్కరించే, ప్రధాని మీదే ఆరోపణలు చేసే వారికి అసలు వ్యవస్థలో మనుగడ ఉంటుందా? అనే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి. నిజానికి మన రాజకీయ పార్టీలు వ్యక్తి స్వామ్య పునాదుల మీద ఏర్పడినటువంటివి.

సాంకేతికంగా నియమాలు ఎలా ఉన్నా.. ఇక్కడ వ్యక్తి పూజ మాత్రమే నడుస్తుంటుంది. హవా నడిపించే వ్యక్తిని ధిక్కరించి చిన్న నాయకులు కూడా మనలేని పరిస్థితి. సుప్రీం న్యాయవ్యవస్థలో అలాంటి పరిస్థితిలేదు. వారు చట్ట పరమైన రక్షణ ఉన్న  ఉద్యోగులు.. వారి ఉద్యోగానికి వచ్చే ప్రమాదం ఏమీ లేదు.. ధిక్కార స్వరం వినిపించిన న్యాయమూర్తిని బర్తరఫ్ చేసే అధికారం.. చీఫ్ జస్టిస్ కు ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అలాంటి రక్షణ ఉండబట్టే వారు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు.

మరి రాజకీయాల్లో అలాంటి స్వేచ్ఛకు అవకాశమే లేదు కదా.. అనే వాదన బలంగా వినిపిస్తోంది. మంత్రి పదవులకు కూడా చట్టపరమైన రక్షణ, వారిని తొలగించాలన్నా సరే.. దానికి సుదీర్ఘమైన నియమబద్ధ విధానం ఉన్నట్లయితే.. మంత్రులు కూడా ప్రభుత్వంలో లోపం ఉన్నప్పుడు స్వేచ్ఛగా గళం విప్పి ప్రజలకు చెప్పే పరిస్థితి వస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి సిన్హా మాటలు ఆచరణ సాధ్యం సంగతి పక్కన పెడితే.. కొత్త ఆలోచనలకు బీజం వేస్తున్నాయి.