cloudfront

Advertisement


Home > Politics - Gossip

స్టాలిన్ తో ఆ మాట చెప్పించగలరా బాబూ!

స్టాలిన్ తో ఆ మాట చెప్పించగలరా బాబూ!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన సీరియల్ నాటకాలకు ఇప్పుడు కొత్త వేదికను సిద్ధం చేసుకుంటున్నారు. భాజపా వ్యతిరేకతతో దేశంలోని అన్ని పార్టీలను ఒక తాటిమీదకు తెస్తానంటూ పంతం పట్టిన చంద్రబాబునాయుడు ఇవాళ చెన్నై వెళ్లి అక్కడి డీఎంకే అధినేత స్టాలిన్ ను కలవబోతున్నారు. అలాగే, చెన్నై నగరంలోనూ తన ధర్మపోరాట దీక్షను చేస్తారని, అందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని కూడా తెలుస్తోంది.

అయితే ఇక్కడ తమాషా ఏంటంటే.. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసినందుకు’ అని పైకి చెప్పుకుంటూ చంద్రబాబు... మోడీ వ్యతిరేక పార్టీలను అక్కున చేర్చుకుంటున్నారు. ఆ ప్రాసెస్ లో భాగంగానే ఆయన ఇవాళ స్టాలిన్ ను కూడా కలుస్తున్నారు. అదలా ఉండగా, చెన్నైలో కూడా ధర్మపోరాట దీక్ష చేయబోతున్నట్లు తెదేపా చాలాకాలం ముందునుంచి ప్రకటిస్తూనే ఉంది. నిజానికి చెన్నై, బెగుళూరుల్లో కూడా అక్కడి ఎన్నికల్లో తెలుగుదేశాన్ని పోటీకి దింపదలచుకుంటున్నట్లు కూడా.. తెలుస్తోంది.

అయితే ఇప్పుడు ఆలోచించాల్సినది ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా రాకుండా అడ్డుపడుతున్న వారిలో తమిళులు కూడా ఉన్నారు. మన హోదా అవసరం సంగతి ఎలా ఉన్నా.. వారికి రాజకీయ పరిమితుల దృష్ట్యా వారు అడ్డుపడుతున్నారు. ప్రత్యేకహోదా ఏపీకి ఇస్తే, తమిళనాడు నష్టపోతుందని వారి భయం. అయితే ఇప్పుడు  చంద్రబాబు తగుదునమ్మా అని వెళ్లి డీఎంకేతో జట్టు కట్టడానికి సిద్ధమవుతున్నారు.

అయితే తాను ఏం చేసినా సరే, అది రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసమే.. అంటూ తన రాజకీయ చాణక్య నీతులకు వక్రభాష్యాలు చెప్పుకునే చంద్రబాబునాయుడు.. ఇప్పుడు డీఎంకేతో ప్రత్యేకహోదాకు అనుకూలంగా ఒక్కమాటైనా చెప్పించగలడా? అనే ప్రశ్న ప్రజల్లోంచి వినిపిస్తున్నది. స్టాలిన్ తో ఆ మాట చెప్పించగలరా? అనేది డౌటు!

చంద్రబాబునాయుడు తన తెలుగుదేశం పార్టీకి జాతీయ హోదా అనే అస్తిత్వం తీసుకురావడానికి నానాపాట్లు పడుతున్నారు. కన్నడ, తమిళ సీమల్లోని పార్టీలతో జట్టు కట్టి, ఒకటిరెండు సీట్లలో తెదేపాను పోటీచేయించి.. కాసిని ఓట్లు, వీలైతే సీట్లు సంపాదించి.. తెలుగుదేశం అనేది జాతీయ పార్టీ అని చాటుకోవాలని ఆయన ప్లాన్.

ఆయన రాజకీయాలు ఆయన ఇష్టం అయితే.. స్టాలిన్ తో హోదాకు అనుకూలంగా మాట చెప్పించుకుండా.. చంద్రబాబు భేటీలు సాగిస్తే గనుక, ఆయన తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యేకహోదాను పణంగా పెట్టినట్టేనని భావించాల్సి ఉంటుంది.

ఆ టికెట్ల విషయంలో కుటుంబ పోరు!... చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్