cloudfront

Advertisement


Home > Politics - Gossip

ఆ జీవో ఎత్తేస్తే ఆగమైపోతది!

ఆ జీవో ఎత్తేస్తే ఆగమైపోతది!

గులాబీ అధినేత కేసీఆర్ హైదరాబాదులో తన తాజా ఎన్నికల ప్రచార సభను చాలా ఘనంగా నిర్వహించారు. నగరవాసులకు ఆయన కొత్త వరాలను ప్రకటిచారు. వాటిలో అన్నిటికంటె ప్రధానమైనది.. తెరాస మళ్లీ అధికారంలోకి రాగానే... జీవో 111ను ఎత్తివేస్తాం అన్నది. భాగ్య నగరానికి కృష్ణా గోదావరి నీళ్లు వస్తున్నాయి గనుక.. జీవో 111ను ఎత్తివేయవచ్చుననేది కేసీఆర్ ఉవాచ. మళ్లీ అధికారం కట్టబెడితే. ఆరు నెలల్లోగా  ఈ జీవో ఎత్తివేస్తానని ఆయన చెబుతున్నారు. అయితే దీని మీద చాలా గందరగోళం రేకెత్తుతోంది.

హైదరాబాదు నగరానికి నీళ్లందించే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ చెరువుల క్యాచ్ మెంట్ ఏరియా కిందికి వచ్చే ప్రాంతాన్ని బయో కన్జర్వేషన్ జోన్ గా ప్రకటిస్తూ.. గతంలో ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలే జీవో నెంబర్ 111. ఈ జీవో ప్రకారం ఈ రెండు చెరువుల పరిధిలోని క్యాచ్ మెంట్ ఏరియా కిందికి వచ్చే 84 గ్రామాల్లో విచ్చలవిడి నిర్మాణాలకు అనుమతులుండవు. దీనివలన రియల్ ఎస్టేట్ రంగం మందగిస్తుందనేది కొందరి వాదన. అయినా సరే పర్యావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని.. నగర నీటి అవసరాలను తీర్చే ఈ రెండు పెద్ద చెరువులకు ఎలాంటి హాని జరగకుండా జీవో తెచ్చారు.

అయితే ఇప్పుడు కేసీఆర్ తాము అధికారంలోకి వస్తే ఈ జీవో ఎత్తివేస్తాం అంటున్నారు. ఈ నిర్ణయం మీద పర్యావరణ వేత్తలలో ఆందోళన రేగుతోంది. హైదరాబాదు నగరానికి కృష్ణ గోదావరి నదుల నుంచి తాగునీళ్లు సరఫరా చేయగలుగుతున్నాం గనుక.. ఈ రెండు చెరువులు సర్వనాశనం అయిపోయినా పర్లేదన్నట్లుగా కేసీఆర్ మాటలు ఉంటున్నాయి.

ఆ రెండు నదుల నీళ్లు నగరానికి రావడంతో పాటూ... మూసీనీటిని కూడా తిరిగి తాగునీటికి వాడుకునేలాగా దానిని శుద్ధి చేయబోతున్నాం కాబట్టి.. జీవో 111ను ఆరునెలలకే ఎత్తివేస్తాం అనేది కేసీఆర్ హామీ. అయితే మూసీ శుద్ధి అనేది ఎప్పటికి పూర్తయ్యే ప్రాజెక్టో అనేది ప్రజల సందేహం.

అలాగే.. కృష్ణ, గోదావరి నీళ్లను నమ్ముకుని.. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లను పణంగా పెట్టడం అనేది చాలా దారుణమైన చర్య అవుతుందని పలువురు భావిస్తున్నారు. ఓట్లకోసం, రియల్ ఎస్టేట్ వర్గాలను సంతృప్తి పరచడం కోసం తెరాస ఇలాంటి నిర్ణయానికి వస్తే గనుక.. ప్రజాసంక్షేమాన్ని విస్మరించినట్లే అవుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు.

తమాషా ఏంటంటే.. తెరాసకు ఇది కొత్త హామీ కాదు. గత ఎన్నికలకు ముందునుంచి జీవో 111ను ఎత్తివేయడం గురించి చెప్పుకుంటూ కాలం నెట్టుకొస్తున్నారు. కాకపోతే.. అదేమాదిరి మాటలు చెప్పి కాలయాపన చేస్తే పర్లేదు, అంతేతప్ప ఆచరణలోకి దిగితే.. ఆగమైపోతుందని పలువురు అంటున్నారు.

ఆ పార్టీకి మినిమం మెజారిటీ గ్యారెంటీ!... ఎందుకో తెలుసా?