Advertisement


Home > Politics - Gossip
కారుచౌక ధరకే ఎన్టీఆర్‌ ట్రస్ట్‌కు ప్రభుత్వ స్థలం కేటాయింపు!

ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఆగ్రహం

తెలుగుదేశం ప్రభుత్వం దొడ్డిదారిలో కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కారుచౌక ధరకు లీజు పద్ధతిలో పొందడంపట్ల ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు నుండి పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని కచేరిపేటలో జిల్లా పరిషత్‌కు చెందిన సుమారు 25కోట్ల విలువైన స్థలాన్ని ఆ మధ్య ఎన్టీఆర్‌ ట్రస్ట్‌కు అధికారులు కారుచౌక ధరకు కట్టబెట్టారు. 91సంవత్సరాల లీజుకు సంవత్సరానికి కేవలం 25వేల అద్దె చెల్లించే పద్ధతిలో ఈ స్థలాన్ని ట్రస్ట్‌కు బదలాయించారు.

ఇది జరిగిన నాటి నుండి వివిధ ప్రజా సంఘాలు సహా ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ నేతలు అనేక విమర్శలు చేశారు. అయినప్పటికీ ఖాతరు చేయకుండా ఆ స్థలంలో తెలుగుదేశం పార్టీకి జిల్లా కార్యాలయ భవనాన్ని నిర్మించారు. తాజాగా ఈ కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. అయితే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు చెందిన నేతలు దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం ప్రభుత్వ భూములను కబ్జా చేస్తోందని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లోనూ ఈ విధంగా ప్రభుత్వ, జిల్లా ప్రజాపరిషత్‌లకు చెందిన కోట్లాది రూపాయల విలువైన భూములను కారుచౌక ధరకు స్వాధీనం చేసుకుంటున్నారని ధ్వజమెత్తుతున్నారు. రాజకీయ పార్టీలకు ఎ్కడైనా స్థలం కేవాలంటే చట్టప్రకారం, నిబంధనల మేరకే ఆయా ప్రభుత్వాలు స్థలాలను కేటాయించేవని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ పేరుతో టీడీపీ కార్యాలయాల నిర్మాణానికి రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ఖరీదైన భూములను, జడ్వీ స్థలాలను ఆక్రమంగా స్వాధీనం చేసుకుంటున్నారన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయమై కాకినాడలో మాజీ మంత్రి, వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలంటే భయంలేకుండా పోయిందని, అందుకే చంద్రబాబు ఇటువంటి పనులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలో ప్రజాప్రయోజనాల కోసం ఉద్దేశించిన సుమారు 35కోట్ల విలువైన భూమిని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ పేరుతో అతి తక్కువ లీజు ధరకు తీసుకున్నారని ఆయన తెలిపారు.

తూర్పు గోదావరిలోనూ జిల్లా పరిషత్‌కు చెందిన సుమారు 25కోట్ల స్థలాన్ని ట్రస్ట్‌కు ఏడాదికి 25వేలు నామమాత్రపు అద్దెకు కట్టబెట్టారని ధర్నాన వాపోయారు. ఐదేళ్ళు ప్రజలు అధికారం ఇచ్చింది ఈ విధంగా ప్రజల ఆస్తులను కొల్లగొట్టడానికా? అని ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్షంగా రాజకీయ పార్టీల కార్యాలయాలకు స్థలాలు ఇవ్వడానికి వైసీపీ వ్యతిరేకం కాదని, కుటుంబ సభ్యుల పేరునున్న ట్రస్ట్‌ కోసం జిల్లా పరిషత్‌కు చెందిన స్థలాలను కబ్జాచేస్తే ఎలా సహిస్తారని ప్రశ్నించారు.

మరోవైపు ఓ ట్రస్ట్‌ పేరుతో కేటాయించిన ప్రభుత్వ స్థలంలో రాజకీయ పార్టీ కార్యాలయాన్ని నిర్మించడం పంతమాత్రం న్యాయసమ్మతం కాదని ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ కార్యాలయం నిర్మించిన ఆ స్థలం నేటికీ తూర్పుగోదావరి జిల్లా పరిషత్‌దేనని ఆర్‌పీఐ నేత అయినాపురపు సూర్యనారాయణ స్పష్టం చేశారు. ఇదిలావుంటే టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఇదేరీతిలో రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో పార్టీకి స్వంత భవనాలు నిర్మించాలని నేతలకు పిలుపునివ్వడం గమనార్హం! పార్టీకి స్వంత భవనాన్ని సమకూర్చి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని నేతలను ఆభినందించి, భవన నిర్మాణానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

టీడీపీ ఆవిర్భవించి 35సంవత్సరాల తర్వాత అతి ముఖ్యమైన తూర్పుగోదావరి జిల్లాలో పార్టీకి సొంతభవనం సమకూరడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు తూర్పుగోదావరి జిల్లా టీడీపీ కార్యాలయం ఆదర్శం కావాలని, అన్ని జిల్లాల్లో ఇదేవిధంగా పార్టీకి స్వంత భవనాలు సమకూర్చుకోవాలని ఆయా ప్రాంతాల నేతలకు సూచించారు. కార్యకర్తలకు కేరాఫ్‌ అడ్రస్‌ ఉండాలంటే ఇటువంటి కార్యాలయాలు నిర్మాణం అవసరమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏదేమైనా కాకినాడలో టీడీపీకి ఏర్పాటైన స్వంత భవన సముదాయం వ్యవహారం మాత్రం వివాదాస్పదంగా మారింది.