Advertisement


Home > Politics - Gossip
కంచికి పోయిన 'క్యాష్‌లెస్‌' నాటకం...!

నటీనటులు అనగానే మనకు నాటకాల్లో, సినిమాల్లో నటించేవారే గర్తుకువస్తారు. కాని ప్రజాస్వామ్యంలో అసలైన నటీనటులు రాజకీయ నాయకులే. ముఖ్యంగా అధికారంలో ఉన్నవారు ఆడినన్ని నాటకాలు ఎవరూ ఆడరు. అద్భుతమైన నాటకాలు వేస్తూ ప్రజలను మాయ చేయడంలో సిద్ధహస్తులు. ఏదైనా విషయంలో పాలకులపై తీవ్ర విమర్శలు వచ్చినప్పుడు, వారు చేసిన ఏదైనా పెద్ద కార్యక్రమం విఫలమైనప్పుడు ప్రజల దృష్టిని మళ్లించేందుకు, చర్చ వేరే విషయాలపైకి పోయేందుకుగాను మరో అంశాన్ని ప్రచారంలోకి తెస్తారు.

మీడియా కూడా వివాదాస్పద విషయంపై కాకుండా తాము ప్రచారంలోకి తెచ్చిన అంశంపై ఫోకస్‌ చేసేలా చూస్తారు. ఇలా కేంద్రం, తెలుగు రాష్ట్రాల, బిజెపి పాలిత రాష్ట్రాల పాలకులు బ్రహ్మాండంగా ప్రచారం చేసిన అంశమే 'నగదురహిత లావాదేవీలు'. అంటే క్యాష్‌లెస్‌ వ్యవహారాలన్నమాట. ఇదో పెద్ద నాటకం. ఇదిప్పుడు దాదాపు ముగిసిపోయింది. జనం మర్చిపోయారు.

ప్రధాని నరేంద్ర మోదీ అనాలోచితంగా పెద్ద నోట్లు రద్దు చేసి సామాన్య ప్రజలను నానా ఇబ్బందులపాలు చేశారు. ఆ విషాద గాథ తెలిసిందే. నోట్ల రద్దుపై ప్రజల్లో, మీడియాలో తీవ్ర ఆగ్రహం పెల్లుబుకిన నేపథ్యంలో దాన్నుంచి దృష్టిని మళ్లించేందుకు ప్రధాని మోదీ నగదురహిత లావాదేవీలు తెరమీదికి తెచ్చారు. దీనికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వంతపాడారు. ఇద్దరు సిఎంలు పోటీలుపడి, రోజుల తరబడి క్యాష్‌లెస్‌ గొప్పతనం, ప్రయోజనాలపై మాట్లాడారు. ప్రతి ఊరూ వందశాతం క్యాష్‌లెస్‌గా మారాల్సిందేనంటూ అధికారులను పరుగులు పెట్టించారు. ఫలాన ఊరు వందశాతం క్యాష్‌లెస్‌ అయిందంటూ బోగస్‌ ప్రచారం చేశారు.

మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఉన్న దసాయ్‌ గ్రామం ఈ ఏడాది జనవరి నాటికి వందశాతం క్యాష్‌లెస్‌ గ్రామం అయిందని ప్రకటించారు. దసాయ్‌ దేశంలో రెండోదని, మహారాష్ట్రలో మొదటిదని చెప్పారు. కాని ఇప్పుడు అక్కడ క్యాష్‌లెస్‌ ఊసు లేదు. ఇరవైశాతం కూడా నగదురహిత లావాదేవీలు జరగడంలేదు. క్యాష్‌లెస్‌కు ప్రజలు, వ్యాపారులు ఇష్టపడటంలేదు. ఈ నాటకం ముగిసిందనడానికి ఇదో ఉదాహరణ మాత్రమే.

ఇప్పుడు ఇద్దరు చంద్రులు క్యాష్‌లెస్‌ ఊసే ఎత్తడంలేదు. అప్పట్లో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల సంగతేమోగాని కేసీఆర్‌, చంద్రబాబు 'నగదు రహితం'పై పోటీపడ్డారు. ఈ విషయంలో ప్రధానికి మోదీకి ఇద్దరూ కుడి ఎడమల డాల్‌ కత్తులు మెరయగ అన్న  టైపులో తయారయ్యారు. దీన్నో పెద్ద ఉద్యమంగా తయారుచేశారు. క్యాష్‌లెస్‌ విధానాలను అనుసరించనివారి బతుకు బస్టాండే అనే విధంగా ప్రచారం చేశారు.  దీనికి అనుకూలంగా మీడియాలో ప్రచారం చేయించుకున్నారు.

క్యాష్‌లెస్‌ అమలు చాలా సులభమని కేసీఆర్‌ చెప్పారు. ఈ ప్రయోగానికి సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని మోడల్‌గా ఎంపిక చేశారు. దాన్ని వందశాతం క్యాష్‌లెస్‌గా మారుస్తామన్నారు. అదేమైందో తెలియదు. ఏపీ సీఎం క్యాష్‌లెస్‌ లావాదేవీలతో ప్రజలు చాలా హ్యాపీగా ఉంటారని, అవినీతి ఉండదని, ఇంట్లో కూర్చుని బ్యాంకు పనులు నిర్వహించుకోవచ్చని సినిమా చూపించారు. అప్పట్లో వందశాతం నగదురహిత లావాదేవీలు జరిపే స్థితికి చేరిన తొలి గ్రామానికి పది లక్షలు, రెండో స్థానంలోని గ్రామానికి ఐదు లక్షలు బహుమతిగా ఇస్తామని తెలంగాణ మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. సిద్దిపేటను దేశంలోనే నగదురహిత నియోజకవర్గంగా మారుస్తామన్నారు. క్యాష్‌లెస్‌ వల్ల అవినీతి పోతుందని, ధరలు తగ్గుతాయని చెప్పారు. ఏదీ జరగలేదు.

క్యాష్‌లెస్‌ ప్రోత్సాహాల కోసం వంద కోట్లు కేటాయిస్తున్నట్లు  ఏపీ సిఎం చెప్పారు. క్యాష్‌లెస్‌ లావాదేవీలపై బ్యాకింగ్‌ నిపుణులు 'ఇదంత వీజీ వ్యవహారం కాదు' అన్నారు. అన్ని స్థాయిల్లో క్యాష్‌లెస్‌ లావాదేవీలు చేయాలంటే ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పనికాదని, ముఖ్యంగా చిన్న వ్యాపారుల విషయంలో మాటలు చెబుతున్నంత సులభం కాదని చెప్పారు. అయినా ముఖ్యమంత్రుల చెవిక్కెలేదు. అప్పట్లో బ్యాంకు అకౌంట్లు లేనివారికి అధికారులు దగ్గరుండి అకౌంట్లు తెరిపించారు.

ఆధార్‌, పాన్‌ కార్డులు ఇప్పించారు. ప్రతి ఒక్కరి దగ్గర డెబిట్‌ కార్డులు ఉండాల్సిందేనన్నారు. రేషన్‌ షాపుల్లో, పంచాయతీ ఆఫీసుల్లో, గ్రామ సమైక్య సంఘాల్లో మైక్రో ఏటీఎంలు పెడుతున్నామన్నారు. క్యాష్‌లెస్‌పై అవగాహన కలిగించేందుకు లఘు చిత్రాలను ప్రదర్శించారు. క్యాష్‌లెస్‌లో జాతీయస్థాయిలో రికార్డులు సృష్టించాలని తెలుగు రాష్ట్రాల పాలకులు తాపత్రయపడ్డారు. నోట్ల రద్దు సమస్యలు వెనకపట్టు పట్టగానే క్యాష్‌లెస్‌ కథ కంచికిపోయింది. సామాన్యులెవరూ క్యాష్‌లెస్‌ జోలికి పోవడంలేదు.