Advertisement


Home > Politics - Gossip
లక్ష్మినారాయణ.. రాజకీయాల్లో హీరోనా?

రాజకీయాల్లోకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ.. ఇదో సంచలన వార్త అయ్యింది. చాలామంది మాజీ ఐఏఎస్, ఐపీఎస్ లు రాజకీయాల్లోకి వచ్చారు, వస్తున్నారు. అయితే వాళ్ల విషయంలో లేని సంచలనం.. లక్ష్మినారాయణ విషయంలో ఉందంటే.. జగన్ పై నమోదైన కేసుల పరిశోధకుడిగా ఈయనకు దక్కిన గుర్తింపు ఫలితమే. ఇంకా సర్వీస్ చాలాకాలమే ఉన్నా.. ఆయన ఇప్పుడే రాజకీయాల్లోకి వస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఎప్పుడు రాజకీయాల్లోకి రావడం అనేది ఆయన వ్యక్తిగతం.

ఆ సంగతలా ఉంటే.. జగన్ పై నమోదైన కేసులపై పరిశోధకుడిగా ఒకవర్గం వాళ్లు ఈయనను ఒక హీరోగా చిత్రీకరించడంతో ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ కూడా గ్రాండ్ గానే దక్కేలా ఉంది. చాలా మంది మాజీ ఐపీఎస్ లు, ఐఏఎస్ లు అవకాశాల కోసం చాలాకష్టలే పడుతూ ఉంటారు. కానీ లక్ష్మినారాయణకు అలాంటి కష్టాలేవీ ఉండేలాలేవు. ఈయన వస్తే చాలన్నట్టుగా.. స్వాగతం.. అంటోంది తెలుగుదేశం పార్టీ.

అయితే ఈయన ఆసక్తి బీజేపీ లేదా జనసేన.. లేదంటే కొత్త పార్టీ.. అని అంటున్నారు. బీజేపీ తరఫున అయితే ఏకంగా ముఖ్యమంత్రి అభ్యర్థట! అయినా ఏపీలో బీజేపీకి ప్రస్తుతం ఉన్న బలం ఏమిటి? ఈ మాత్రం బలానికి ముఖ్యమంత్రి అభ్యర్థి కామెడీ కూడానా? వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుంటే బీజేపీ పరిస్థితి ఏమిటి? అనే కనీస అవగాహన ఉన్న వాళ్లెవరూ బీజేపీ సీఎం అభ్యర్థి అనే మాటను ఎత్తరు.

అయితే రాజకీయాల్లో కామెడీకి కొదవలేదు కాబట్టి ఏమైనా మాట్లాడొచ్చు. ఇక ఐపీఎస్ గా, సీబీఐలో పనిచేసిన నేపథ్యాన్ని బట్టిచూస్తే.. లక్ష్మినారాయణ వైఫల్యాలు కూడా ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఉదాహరణకు జగన్ కేసుల్లోనే చాలామంది ఐఏఎస్ లు ఐపీఎస్ ల మీద లక్ష్మినారాయణ బురద జల్లాడు. వాళ్లను ఆ కేసుల్లో ఇన్ వాల్వ్ చేశాడు. వాళ్లందరి కెరీర్ లకూ మరకలు అంటించాడు. ఆ మరకలు నిలబడ్డాయా? అంటేలేదు.

జగన్ కేసుల్లో లక్ష్మినారాయణ పరిశోధకుడిగా ఉన్నదశలో చాలామంది అధికారులను ఇన్ వాల్వ్ చేయగా.. వాళ్లు కోర్టు ద్వారా ఈ కేసుల నుంచి బయటకు వచ్చారు. క్లీన్ చీట్లు పొంది.. తమ విధుల్లోకి వెళ్లిపోయారు. కొందరైతే పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయి.. సీఎస్ స్థాయికి ఎదిగారు. అలాంటి వాళ్లపై సీబీఐ జేడీ హోదాలో లక్ష్మినారాయణ అనవసరంగా బురదజల్లాడు.

ఆధారాలు లేకుండా.. సహచర అధికారులపై కేసులు నమోదు చేసిన పెద్దమనిషి ఈయన! ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నాడట. అంతేకాదు.. జగన్ కేసుల్లో నమోదు చేసిన ‘క్విడ్ ప్రోకో’ వ్యవహారంపై ఇటీవల ఈడీ మీద ట్రిబ్యునల్ చేసిన వ్యాఖ్యలు.. ఈ కేసుల్లో డొల్లతనాన్ని చాటాయి. జగన్ బెదిరించి పెట్టుబడులు పెట్టించాడు అని పెట్టుబడిదారులు ఎవరూ కేసులు పెట్టనప్పుడు ఈ కేసులు ఎలా నమోదు చేశారు? అని ఈడీని ట్రిబ్యునల్ ప్రశ్నించింది.

అది కూడా జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారిలో అందరి మీదా ఎందుకు కేసులు పెట్టలేదు? కొంతమంది మీదే ఎందుకు కేసులు పెట్టారు? కొంతమంది ఆస్తులనే ఎందుకు సెలెక్టివ్ అటాచ్ చేశారు? అనే ప్రశ్నలను కూడా ఈడీకి ట్రిబ్యునల్ సంధించింది. ఈ ప్రశ్నలు ఈడీకే కాదు.. ఈడీ కన్నా మునుపు ఈ అభియోగాలను మోపిన సీబీఐకి కూడా తగులుతాయని వేరే చెప్పనక్కర్లేదు.

లక్ష్మినారాయణ ఆధ్వర్యంలోని ఈ కేసులు నమోదయ్యాయి. కాబట్టి.. అధికారిగా ఈయన సత్తా ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అన్నింటికీ మించి.. జగన్ పై నమోదైన కేసులన్నీ కాంగ్రెస్ అధిష్టానం కనుసన్నల్లో నమోదయ్యాయి.. రాజకీయంగా జగన్ ను అణగదొక్కడానికే వాటిని పెట్టారు.. అని నాటి కాంగ్రెస్ నేతలే చాలామంది చెబుతున్నారు. మరి వీటిపై లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో సీబీఐ చేసిన పరిశోధనను ఏమనాలి? ఇలాంటి కేసులతో లక్ష్మినారాయణ సంపాదించుకున్నది హీరోయిజమా?