Advertisement


Home > Politics - Gossip
చంద్రబాబు అసలు ప్లాన్ బయటపడిందిలా?

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. రాజకీయ ప్రయోజనం ఆశించకుండా ఏ పనీ చేయరు అనేది సార్వజనీనమైన, సార్వకాలీనమైన సిద్ధాంతం. ఆ మాటకొస్తే ఏ రాజకీయ పార్టీ కూడా తమ పార్టీ ప్రయోజనాన్ని ఆశించకుండా.. పనిచేయదు. అయితే అందులోనూ చంద్రబాబు స్టయిలే సెపరేటు. ప్రత్యేకహోదా కోసం పోరాటం అనేది కేవలం ఆయన రాజకీయ లబ్ధికోసం ఆశ్రయించిన ఒక టెక్నిక్ మాత్రమే. అన్యధా దానిమీద ఆయనకు ఏమాత్రం మమకారం గానీ, కాంక్ష గానీ.. పట్టుదల గానీ లేవు. ఈ విషయాన్ని తాజాగా మరోసారి నిరూపించడానికి చంద్రబాబు సిద్ధం అవుతున్నారు.

చంద్రబాబు.. ప్రత్యేకహోదా కోసం.. ఇతర పార్టీలు ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్రంలో దీక్షలు చేసినంత కాలమూ వారిని నానా రకాలుగా నిందిస్తూ వచ్చారు. ఇవన్నీ డ్రామాలే తప్ప.. ఢిల్లీలో దీక్షలు చేయడం లేదని హూంకరించారు.

తీరా వారు ఢిల్లీలో దీక్షలు చేయడం ప్రారంభించాక.. ఆయన రాష్ట్రంలో తమ పార్టీ సభలు గట్రా నిర్వహిస్తుందని అంటూ.. కొత్త ప్రణాళిక ప్రకటించారు. తాజాగా సోమవారం నాడు నిర్వహించిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో.. చంద్రబాబు ఇంకా పెద్ద పోరాట ప్రణాళికనే ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ భారీ బహిరంగ సభలు నిర్వహించాలని, 20రోజుల పాటు సైకిల్ యాత్రలు నిర్వహించాలని ఆయన కోరారు.

ఇవన్నీ చూసి.. అబ్బో చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం చాలా కష్టపడిపోతున్నారే అని అనుకుంటే ప్రమాదమే. ఎందుకంటే.. ఇవన్నీ కూడా అచ్చంగా ఆయన సొంతడబ్బా కొట్టుకోవడం కోసం ప్లాన్ చేసిన ప్రణాళికలే తప్ప.. హోదా కోసం చేస్తున్న పోరాటం కానేకాదు. ఈ యాత్రలు, సభల్లో.. ప్రభుత్వం సాధించిన విజయాల గురించి బాగా ప్రచారం చేసుకోవాలట. సైకిల్ యాత్రలను బాగా సద్వినియోగం చేసుకోవాలట. పనులు చేయడం కంటె వాటి గురించి ప్రచారం చేసుకోవడం చాలా ముఖ్యమని చంద్రబాబునాయుడు భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

సోమవారం నాటి తెలుగుదేశం సమన్వయ కమిటీ సమావేశాన్ని మొత్తంగా గమనిస్తే ఎక్కడా... ప్రత్యేక హోదా సాధించే పోరాటం గురించిన ప్రణాళిక లేదు. పార్టీ కార్యకర్తలకు అలాంటి సందేశం లేదు. అంతా ప్రభుత్వ కార్యక్రమాలు సొంత డబ్బా కొట్టుకోవడం గురించే తప్ప.. హోదా పోరాటమూ, కేంద్రం పై ఏ రకంగా ఒత్తిడిపెంచాలనే దిశగా నలుగురి ఆలోచనలను తీసుకోవడమూ.. ఆ ప్రకారంగా తీవ్ర పోరాటాన్ని నడపడమూ.. ఇలాంటి వేమీ లేకపోవడం చూస్తోంటే.. రాష్ట్రంలో వరుస కార్యక్రమాల ప్లాన్ ద్వారా చంద్రబాబు అసలు ప్లాన్ ఏమిటో ఇట్టే తెలిసిపోతోందని ప్రజలు అనుకుంటున్నారు.