Advertisement


Home > Politics - Gossip
చంద్రన్న కూడా పవన్ లాగే: సేం 2 సేం!

తన రాజకీయ చాణక్యానికి, ఊహకు అందనంత వేగంగా రాజకీయ పరిణామాలు మారిపోతూ ఉండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నట్లుంది. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం విషయంలో వరుస పరిణామాలు.. తెలుగుదేశానికి ప్రమాదకర సంకేతాలుగా మారుతున్నాయని మొత్తానికి ఆయన గుర్తించారు. ఈ విషయాల్లో ఎవరు ఎలాంటి స్టేట్ మెంట్లు ఇస్తున్నప్పటికీ.. చంద్రబాబు ఇప్పటిదాకా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ, పార్టీలోని కొందరు ఎడాపెడా చేసేస్తున్న కామెంట్లు పార్టీకి చేటు చేస్తున్నాయి.

ఒకవైపు తాను మాట్లాడక, మాట్లాడేవాళ్ల వల్ల నష్టం జరుగుతుండగా... మరోవైపు విపక్షనేత జగన్ తన మౌనాన్ని ఎడ్వాంటేజీ గా తీసుకుంటుండడాన్ని సహించలేక చంద్రబాబు ఎట్టకేలకు పెదవి విప్పారు. అన్ని పార్టీలను కూడగట్టి అయినా అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఆలోచిస్తాం అని ఆయన ప్రకటించారు.

అయితే తమాషా ఏంటంటే.. చంద్రబాబు నాయుడు అచ్చం పవన్ కల్యాణ్ చెప్పిన స్కెచ్ లాగానే తన వైఖరి కూడా వివరించడం గమనార్హం. తమ పార్టీకి ఉన్న బలం సరిపోదని.. దేశంలోని మిగిలిన అన్ని పార్టీలతోనూ సంప్రదించి, వారి మద్దతును కూడా కూడగట్టి.. అవిశ్వాసం పెడతానని ఆయన అంటున్నారు. అచ్చంగా జగన్  కూడా తాను అందరి మద్దతు అలా సేకరించగలననే జగన్ కు భరోసా ఇచ్చారు.

అయితే స్క్రిప్టులో చిన్న తేడా ఏంటంటే.. పవన్ కల్యాణ్ జగన్ కు ప్రతి సవాలు విసురుతూ అర్జంటుగా అవిశ్వాసం పెట్టేయాలి.. మార్చి 5న అది చర్చకు వచ్చేయాలి అని అంటూ ఉంటే.. చంద్రబాబు మాత్రం.. ఆఖరి అస్త్రంగా దానిని ప్రయోగించాలని అంటున్నారు. చంద్రబాబు దృష్టిలో ఆఖరి అస్త్రం అంటే.. ఈ బడ్జెట్ సమావేశాలో.. లేదా, వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాలో కూడా అర్థం కావడం లేదని జనం నవ్వుకుంటున్నారు.

తమాషా ఎలా ఉన్నదంటే.. ఒకటే ఇంగ్లిషు సినిమాను చూసి.. ఇద్దరు దర్శకులు రాసుకున్న రెండు వేర్వేరు స్క్రిప్టులతో ఇటు పవన్, అటు చంద్రబాబు సినిమాలు చేసినట్టుగా ఉంది. ఇతరుల మద్దతు కూడగట్టడం వంటి విషయాల్లో దాదాపుగా ఒకే రకమైన అభిప్రాయాలను ఈ ఇద్దరు నేతలూ వెల్లడించారు.

ఇప్పుడు అందరూ అవిశ్వాసం మాటే ఎత్తుతున్నారు. కాంగ్రెస్ తరఫున రాహుల్ కూడా అవిశ్వాసానికి రెడీ అన్నట్లుగా పీసీసీ చీఫ్ రఘువీరా అంటున్నారు. ఇప్పుడిక ఎవరు ముందు ప్రతిపాదిస్తారనేది మాత్రమే మైలేజీకి సంబంధించిన అంశం అవుతుందని వారు తెలుసుకోవాలి.