cloudfront

Advertisement


Home > Politics - Gossip

బాబు రావొద్దంటే.. రాజు రారమ్మంటున్నారు!

బాబు రావొద్దంటే.. రాజు రారమ్మంటున్నారు!

ఫర్ సప్పోజ్.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధాని నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి పర్యటించి, ర్యాలీలు చేసి, బహిరంగ సభ నిర్వహిస్తే ఏం జరుగుతుంది. ఆయన ఏమూల అడుగుపెట్టినా సరే.. ఓంప్రథమంగా రాష్ట్రవ్యాప్తంగా బీభత్సమైన ప్రచారం దక్కుతుంది. ఇన్నాళ్లుగా ఆంధ్రప్రదేశ్ కు మోడీ అన్యాయం చేస్తున్నారంటూ.. చంద్రబాబునాయుడు ఏ విమర్శలనైతే చేస్తున్నారో.. వాటన్నింటినీ ఇండైరక్టుగా అయిన మోడీ కౌంటర్ చేసే అవకాశం ఉంటుంది.

ఒకవేళ సదరు మోడీ కార్యక్రమంతో విభేదించి.. చంద్రబాబునాయుడు గైర్హాజరు అయితే గనుక.. చంద్రబాబును కూడా శత్రుపక్ష నాయకుడిగా పరిగణించి.. మోడీ తన సభల్లో విమర్శల, సెటైర్ల దాడిని కురిపించే అవకాశం కూడా పుష్కలంగా ఉంది. పరిస్థితులు ఇలా ఉండగలవు గనుకనే.. ప్రధాని ఏపీకి రాకూడదని, ఆయన కార్యక్రమాలు ఏపీలో జరగరాదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బలంగా కోరుకుంటున్నారనేది సమాచారం.

అయితే తెలుగుదేశానికి చెందిన ఎంపీ, కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు మాత్రం.. రాష్ట్రానికి మోడీ రావాలని కోరుకుంటున్నారు. వచ్చి తన నియోజకవర్గంలో పర్యటించాలని, ఆ రకంగా మాట నిలబెట్టుకోవాలని కూడా అంటున్నారు. అదే మరి చిత్రం. ఎన్డీయే నుంచి తెలుగుదేశం వైదొలగిన తర్వాత.. రాష్ట్రంలో మోడీ వ్యతిరేక ప్రచారం ముమ్మరంగా ప్రారంభం అయిన తర్వాత.. మోడీ ఆంధ్రప్రదేశ్ కు రావాలని అనుకున్నారు.

ఏపీలో కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రారంభానికి గానీ, శంకుస్థాపనలకు గానీ సిద్ధంగా ఉంటే మోడీ హాజరవుతారంటూ పీఎంఓ రాష్ట్రప్రభుత్వ అధికార్లను సంప్రదించింది. అయితే ఇందుకు చంద్రబాబు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అలాంటివేమీ లేవని.. మోడీ రానక్కర్లేదన్నట్లుగా వర్తమానం పంపారు. ఇప్పుడు మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు మాత్రం.. తన నియోజకవర్గం విజయనగరంలో మోడీ పర్యటించాలని కోరుకుంటున్నారు. ఆ రకంగా మోడీ మాట నిలబెట్టుకోవాలని కూడా అంటున్నారు.

నీతిఆయోగ్ పరిశీలించే 42అంశాల్లో అత్యుత్తమంగా దేశంలోనే నిలిచే నియోజకవర్గంలో తాను పర్యటిస్తానంటూ మోడీ గతంలో ప్రకటించారట. తన నియోజకవర్గం విజయనగరం అలా ప్రథమస్థానంలో ఉన్నది గనుక.. మాట నిలబెట్టుకుంటూ మోడీ వస్తారో లేదో చూడాలని అశోక్ గజపతి అంటున్నారు. ఏపీలో కార్యక్రమానికి రావడం నిజానికి మోడీకే ఎడ్వాంటేజీ అవుతుంది.

అందుకే మోడీ అసలు ఇక్కడకు రావొద్దంటూ చంద్రబాబు కోరుకుంటోంటే.. అశోక్ మాత్రం ఆయన రావాలనే కోరికతో.. ఆయనకే ఆఫర్ ఇస్తుండడమే విశేషం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.