cloudfront

Advertisement


Home > Politics - Gossip

మారిన చంద్రబాబు : అఖిలపక్షానికి కసరత్తు!

మారిన చంద్రబాబు : అఖిలపక్షానికి కసరత్తు!

2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత.. తాను మారిన చంద్రబాబును అని చంద్రబాబునాయుడు ప్రకటించుకున్నారు. కానీ నాలుగేళ్ల తర్వాత.. ఆయనలో కొంత మార్పు వచ్చిన మాట నిజమేనేమో అనే సందేహం కలుగుతోంది. తాను పాలన సాగిస్తుండగా.. కేంద్రానికి ప్రతినిధి బృందంగా వెళ్లడానికి అఖిలపక్షం ఏర్పాటు చేయడం అంటేనే ఆయన తెగ చిరాకు పడిపోయేవారు. అలాంటి చంద్రబాబునాయుడు ఇప్పుడు స్వయంగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. విభజన హామీల సాధన, కేంద్రంపై ఒత్తిడి పెంచడం అనేవే ఈ అఖిలపక్ష సమావేశం ప్రధాన ఎజెండాగా ఉంటున్నాయి.

అఖిలపక్షం ఎప్పుడు నిర్వహించాలనే విషయం మంగళవారం జరిగే తెలుగుదేశం సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయించబోతున్నారు. 24వ తేదీనుంచి విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు ఉంటున్న నేపథ్యంలో అంతకంటె ముందే ఈ తంతు పూర్తి చేసేయాలని అనుకుంటున్నారు. అయితే అఖిలపక్షానికి ఏయే పార్టీలను పిలవాలి.. అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్న తెదేపా, వైసీపీ, భాజపా లను మాత్రం పిలిస్తే సరిపోతుందా. లేదా, ఈసీ వద్ద రిజిస్టరు అయిన అన్ని ప్రధాన పార్టీలను పిలవాలా అనే చర్చ పార్టీలో నడుస్తోంది.

నిజానికి అఖిలపక్షం ఏర్పాటు చేయడానికి చంద్రబాబు దిగిరావడం అనేదే... ఆయనలో కొత్తగా పుట్టిన భయానికి నిదర్శనం అని పలువురు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అన్ని పరిణామాలను గమనించినప్పుడు.. తాను ఒంటెత్తు పోకడలకు పోతున్నట్లుగా జంనలోని భావనను ఆయనకు ఇంటెలిజెన్స్  వర్గాలు నివేదించినట్లు సమాచారం. అందుకే ఆయన పర్యవసానాలను అందరి నెత్తిన పులిమేయడానికి అన్నట్లుగాను, తాను ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం లేదనే కలర్ ఇవ్వడానికి గాను అఖిలపక్షం ఏర్పాటు చేస్తున్నట్లుగా పార్టీలో చెప్పుకుంటున్నారు.

అయితే ఈ అఖిలపక్షం ఎంతమేర సక్సెస్ ఫుల్ గా సాగుతుందో సందేహమే. ఎందుకంటే.. ఈ పార్టీల్లో చంద్రబాబు, భాజపా, జనసేన మాత్రమే ప్రత్యేక ప్యాకేజీ పాట పాడుతున్నారు. వైసీపీ, కాంగ్రెస్, వామపక్షాలు, లోక్ సత్తా ఇతరులందరూ కూడా ఇప్పటికీ హోదా మాత్రమే మంచిది అనే ఉద్దేశంతోనే ఉన్నారు. ఈ రకంగా వారి మధ్య ప్రతిష్టంభన ఏర్పడ్డానికి కూడా అవకాశం ఉంది. కనీసం అఖిలపక్షానికి స్వేచ్ఛ ఇచ్చి తిరిగి సమష్టిగా ప్రత్యేకహోదా డిమాండును అందరూ కలిసి భుజానికెత్తుకుంటే.. రాష్ట్రానికి మేలు జరుగుతుంది.