cloudfront

Advertisement


Home > Politics - Gossip

ఈ ప్రేలాపనల భావమేమిటి సారూ?

ఈ ప్రేలాపనల భావమేమిటి సారూ?

పరనిందలు రాజకీయాల్లో కొత్త, వింత కానేకాదు. కానీ సందర్భాన్ని బట్టి పరనిందలకు ఉండే భావం మారుతుంటుంది. ఒక విలన్ ను సృష్టించి... తన ప్రత్యర్థులందరికీ ఆ విలన్ తో ముడిపెట్టడం ద్వారా రాజకీయంగా గట్టెక్కాలని ఇన్నాళ్లూ ప్రయత్నించిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు చాలా రకాలుగా నిప్పులు చెరగుతున్నారు. అయితే ఈ ప్రేలాపనలు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు మాత్రం చాలా దురర్థాన్ని మోసుకెళుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఓడిపోయినట్టేనా? అని పార్టీ శ్రేణులే తమ అధినేత మాటలు విని మల్లగుల్లాలు పడుతున్నారు.

ఈవీఎంలు సక్రమంగా పనిచేయకపోవడం ద్వారా.. ఎన్నికల సంఘం దారుణంగా విఫలమైన మాట వాస్తవం. బహుశా ఇదంతా చంద్రబాబుకు కలిసి వచ్చిన పరిణామాం లాగా కనిపిస్తోంది. రేపు రిజల్టు ఎలా ఉంటుందో దేవుడికెరుక.. ముందుగానే వైకాపాకు అంటగట్టి నాలుగు నిందలు వేసేస్తే.. అవలా పడి ఉంటాయి.. రేపు పొద్దున్న అవసరం వస్తే వాడుకోవచ్చు.. అని చంద్రబాబునాయుడు భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

తనకు తాను హైటెక్ ముఖ్యమంత్రిని అని బోర విరుచుకుని చెప్పుకునే చంద్రబాబునాయుడు.. ఈవీఎంల విషయానికి వచ్చేసరికి బ్యాలెట్ పేపర్ కావాలంటున్నారు. ఇలాంటి మాటలు విన్నప్పుడు.. నోట్ల స్థానంలో ప్లాస్టిక్ కరెన్సీ రావాలని ప్రతిపాదించింది... ఎమ్మార్వో ఆఫీసుల్లో లంచాల దోపిడీని అరికట్టలేని చేతగానితనంతో... మీ వాకిట్లో వీధిలైటు వెలిగిందో లేదో.. కంట్రోల్ రూం నుంచి చూస్తానని చెప్పేది ముఖ్యమంత్రి ఈయనేనా అని సందేహం కలుగుతుంది.

ఈవీఎంలు పనిచేయక పోయినంత వరకు... ఈసీని నిందించడంలో తప్పేమీ లేదు. ఓటు వేయడం గురించి అంత ముమ్మరంగా ప్రచారం చేస్తుండే ఎన్నికల సంఘం... ఈవీఎంలు పనిచేస్తున్నాయో లేదో పద్ధతిగా చెక్ చేసుకోకపోవడం క్షమించరాని నేరం. అంతమాత్రాన.. అదేదో వైకాపాకు లబ్ధి చేకూర్చడానికే ఈసీ అలా చేసిందని ఆపాదించడం... తాను ఇప్పటికే విలన్ గా ప్రజల ఎదుట నిలబెట్టిన మోడీతో వారికి బంధాన్ని అంటగట్టడం.. తద్వారా వారు జగన్ గెలుపుకోసం చేశారన్నట్లుగా వక్రభాష్యాలు చెప్పడం.. ఇదంతా నేలబారు వ్యవహారంగా కనిపిస్తోంది.

దేశమంతా తిరిగి ఈసీ తీరును ఎండగడతారట. ధర్నాలు చేస్తారట... ఈసీ మీద ఆయన పోరాటం మొత్తం దేశం కోసమేనట, ప్రజాస్వామ్యం కోసమేనట. ఈ ప్రేలాపనలన్నీ వింటోంటే.. పైత్యం ప్రకోపించినట్లే అనిపిస్తుంది. ఈవీఎంలలో ఓటు ఎవరికి వెళ్లిందో తెలియదు.. అని అంటున్నది మన చంద్రబాబేనా అనిపిస్తోంది.

ఇవాళ... వైఎస్సార్ కాంగ్రెస్ గెలిచి జగన్ ముఖ్యమంత్రి అయితే.. తాను ఎందుకు ఓడిపోయానో సమర్థించుకోవడానికి చంద్రబాబునాయుడుకు ఈ మాటలన్నీ ఉపయోగపడుతుండవచ్చు గాక. ఆయన అంచనాలు/భయాలు తేడాకొట్టి.. తెలుగుదేశమే గెలిస్తే గనుక.. చంద్రబాబు ఏం చెబుతారు? ఆయన ఘటనాఘటన సమర్థులు... ఇదే మాటలను తనకు అనుకూలంగా అప్పుడు మళ్లీ మార్చుకుని కొత్త భాష్యాలు చెప్పగలరు!

ఒపీనియన్ కోసం నేను చిరంజీవిగారిని వెళ్లి అడిగాను