Advertisement

Advertisement


Home > Politics - Gossip

బడ్జెట్ సూపరహె...అయినా నో కామెంట్

బడ్జెట్ సూపరహె...అయినా నో కామెంట్

కేంద్ర బడ్జెట్ వచ్చేసింది. కానీ పార్టీలకు అతీతంగా, నాయకులకు అతీతంగా అస్సలు ఒక్క మాట అంటే ఒక్క మాట వినిపిస్తే ఒట్టు. బడ్జెట్ ఎంత బ్రహ్మాండంగా వుందో ప్రత్యేకంగా ఎవ్వరూ వివరించనక్కరలేదు. తెలుగు రాష్ట్రాల మీద, ముఖ్యంగా అత్తింటి మీద ఆర్థికమంత్రికి ఎంత ప్రేమాభిమానాలు వున్నాయో ప్రత్యేకించి వివరించాల్సిన పని లేదు. కేంద్ర బడ్టెట్ కేటాయింపులే చెబుతాయి. 

కోట్లకు కోట్లు బెంగాల్ కు, తమిళనాడుకు ఇచ్చినవారు కనీసం లక్షలు కూడా తెలుగు రాష్ట్రాలకు ఇవ్వలేకపోయారు. సరే తెలుగు రాష్ట్రాలకు ఇవ్వడం సంగతి అలా వుంచి అసలు బడ్జెట్ అయినా జనాల ఆశలకు అనుగుణంగా వుందా?

రేట్లు పెరగని ఐటమ్ లేదు. బంగారం తప్ప. అది సామాన్యుడికి ఎంత వరకు అవసరం? ముఖ్యంగా ఇప్పటికే తారా స్థాయికి చేరుకున్న డీజిల్, పెట్రోలు మీద వ్యవసాయ సెస్ అంట..భలే వింతగా వుంది. డీజిల్ వాడే వ్యవసాయ ట్రాక్టర్లు పని చేస్తాయి. ఇప్పుడు ఆ డీజిల్ రేటు అమాంతం పెంచేసి, ఇక వ్యవసాయ సెస్ ఏమిటి? అలా వచ్చిన డబ్బులతో వ్యవసాయానికి చేసేదేమిటి? అలా చేసే అరకొర సాయం కొద్ది మందికే అందుతుంది. ఈ డీజిల్ భారం మాత్రం రైతులోకం మొత్తం మోస్తుంది.

ఎన్నికలు జరిగే రాష్ట్రాలే ముఖ్యమని, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో తమకు పని లేదని చెప్పకనే చెప్పేసింది భాజపా ఈ బడ్జెట్ తో. గత కొన్నేళ్లుగా ప్రతి బడ్జెట్ ముందు పన్ను వెసులుబాట్లు వస్తాయని ఆశపడుతూనే వున్నారు. అవి రాకుండానే వున్నాయి. పైగా ముక్కు పిండి మరీ చెల్లింపులు వసూలు చేస్తూనే వున్నారు. 

డిజిటల్ ఇండియా పేరుతో అన్ని వైపులా తాళాలు వేసి, జనాలను పన్ను చెల్లింపు దారులుగా మారుస్తూ, ఇబ్బడి ముబ్బడిగా ప్రభుత్వ ఆదాయం పెంచుకుంటూ పోతున్నారు. జిఎస్టీ వసూళ్లు రికార్డు సృష్టిస్తున్నాయి. కానీ రాష్ట్రాలకు మొండి చేయినే మిగులుతోంది. 

సామాన్యుడు వాహనం కొనుక్కుని జాగ్రత్తగా వాడుకుంటాడు. ఇప్పుడు 20 ఏళ్లు దాటితే అది తుక్కుకే. 15 దాటిన వాణిజ్య వాహనం తుక్కుకే. దాంతో సరకుల రవాణా చార్జీలు పెరగవా? 75 ఏళ్లు దాటిని పింఛను, వడ్డీ మాత్రమే ఆదాయం వచ్చేవారు పన్ను రిటర్న్ ఇవ్వనక్కరలేదు. 

నిజానికి మన దేశంలో 60  నుంచి 65 రిటైర్ మెంట్ ఏజ్. అందువల్ల ఈ స్కీము అమలు చేస్తే అక్కడి నుంచి అమలు చేయాలి. లేదా పింఛను, వడ్డీ మినహా మరే ఆదాయం లేని వారి నుంచి అమలు చేయాలి. 75 ఏళ్లు అన్నది కంటితుడుపు కాక మరేమిటి?

భీమారంగంలో ఎఫ్ డిఐ లను ఏకంగా 75 శాతానికి పెంచడం అంటే విదేశీ ఇన్వెస్టర్లకు తలుపులు తెరవడమే. అంతే కాదు ఎల్ ఐ సి నుంచి పబ్లిక్ ఇస్యూ తీసుకురావడం రెండు బ్యాంకుల నుంచి ప్రభుత్వ పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని అనుకోవడం. మరిన్ని సంస్థల్లో వున్న ప్రభుత్వ పెట్టుబడుల విషయం సమీక్షించాలని అనుకోవడం అంటే ఏ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు?

సాధారణంగా బఢ్జెట్ వచ్చిన తరువాత రాజకీయ నాయకుల కామెంట్లు కామన్. వాళ్లు చెబుతారు. మీడియా అడుగుతుంది కూడా. కానీ బడ్జెట్ ప్రవేశ పెట్టి గంటలు దాటుతున్నా వైకాపా నేత విజయసాయిరెడ్డి మినహా మరెవరు గొంతెత్తితే ఒట్టు. ట్విట్టర్ లో చెలరేగిపోయే లోకేష్ బాబు, ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఇక భాజపాతో కలిసి నడుస్తున్న పవన్ కళ్యాణ్, ఇక ఇద్దరు సిఎమ్ లు కేసిఆర్, జగన్, తెలంగాణ కీలక నేత కేటీఆర్ ఇలా ఎవ్వరూ పెదవి విప్పితే ఒట్టు.

ఎందుకు పెదవి విప్పాలి? విప్పితే బడ్జెట్ ను సమర్ధించాలి. వ్యతిరేకించడం కష్టం. అందుకే నో కామెంట్ అన్నమాట. ఈ విషయంలో గొంతు బలంగా వినిపించిన విజయసాయి రెడ్డి ని మాత్రం మెచ్చుకోవాలి.

నిమ్మ‌గ‌డ్డ టీడీపీ ముద్ర పోగొట్టుకుంటారా ?

రామతీర్థం లోని రాములోరి గుడి...డ్రోన్ కెమెరా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?