Advertisement


Home > Politics - Gossip
చంద్రబాబే ఎక్కువ భయపడుతున్నారా?

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, చంద్రశేఖర్‌రావు ఇప్పుడు ఓ విషయంలో తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఆ పని అయితే వారు ఊపిరి పీల్చుకుంటారు. ఏ విషయంలో ఆందోళన చెందుతున్నారు? ఏం జరిగితే ఊపిరి పీల్చుకుంటారు? రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయా? పెరగవా?... ఇదీ వారిని తీవ్రంగా వేధిస్తున్న సమస్య. పెరిగితే ఇద్దరు చంద్రులు వెరీ హ్యాపీ. ఎందుకు? ఫిరాయింపుదారులందరికీ టిక్కెట్లు ఇవ్వొచ్చు.

కొంతకాలం క్రితం ఇద్దరు చంద్రులూ కలిసికట్టుగా సీట్లు పెంచాలని కేంద్రాన్ని కోరారు. విభజన చట్టంలోనే ఉన్న సీట్ల పెంపు విషయం మూడేళ్ల గడిచిన తరువాత కూడా ఓ కొలిక్కి రాకపోవడం ముఖ్యమంత్రులను చికాకు పరుస్తోంది. ఎలాగైనా సీట్లు పెరిగేలా చూడాలని చంద్రులు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిని బతిమాలుతున్నారు. ఆయన మాత్రం ఏం చెబుతారు? ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం కావాలి కదా.

రాజ్యసభలో ఈ బిల్లును అడ్డుకుంటామని, పాస్‌ కానివ్వబోమని కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చెబుతున్నారు. ఆయన ఇలా చెప్పడానికి కారణం... రాజ్యసభలో ప్రతిపక్షాలకు బలం ఎక్కువగా ఉండటమే. విభజన సమయంలో యూపీఏ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా ఇవ్వనందుకు, విభజన చట్టంలో పేర్కొన్న రైల్వే జోన్‌ తదితరాలు అమలు చేయనందుకు నిరసనగా అసెంబ్లీ సీట్ల పెంపు బిల్లు ఆమోదం పొందకుండా చూస్తామని రాహుల్‌ చెబుతున్నారు.

తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంచొద్దని అక్కడి బీజేపీ నాయకులు కేంద్ర నాయకత్వానికి చెబుతుండగా, ఏపీ బీజేపీ నాయకులు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా, సీట్ల పెంచాలని ఇద్దరు చంద్రులూ కేంద్రాన్ని గట్టిగా కోరుతున్నప్పటికీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఎక్కువగా ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. కేసీఆర్‌ కంటే ఆయనకే ఎక్కువ ఆందోళనగా ఉందట...!

ఇందుకు కొన్ని కారణాలున్నాయి. సీట్లు పెరగకపోతే ఫిరాయింపుదారులకు టిక్కెట్లు ఇవ్వడం సాధ్యం కాదు. వారికి టిక్కెట్లు ఇవ్వకుంటే  పార్టీలో  రచ్చరచ్చ అవుతుంది. టీడీపీలో చేరితే గెలుస్తామనే అభిప్రాయంతోనే వారు పార్టీ ఫిరాయించారు. ఇక సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో ఎక్కువమందిపై ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉందని సమాచారం. సీట్లు పెరగకపోతే వీరికే (కొంతమందిని డ్రాప్‌ చేస్తారనుకోండి) టిక్కెట్లు ఇవ్వాల్సివస్తుంది.

మొత్తంమీద టీడీపీపై వ్యతిరేకత ఉంది కాబట్టి సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో ఎక్కువమందికి టిక్కెట్లు ఇస్తే పార్టీ ఢమాల్‌మంటుంది. కాబట్టి సీట్లు పెరిగితే ఫిరాయింపుదారులకే కాకుండా కొత్తవారికీ టిక్కెట్లు ఇవ్వొచ్చు. పార్టీలో తిరుగుబాటు రాకుండా చూసుకోవచ్చు. మరి తెలంగాణలో కేసీఆర్‌ పరిస్థితి ఏమిటి? ఆయనకూ ఫిరాయింపుదారుల సమస్య ఉంది. వారికి టిక్కెట్లు ఇవ్వకపోతే ఇబ్బందులొస్తాయి. అయితే ప్రజల్లో టీఆర్‌ఎస్‌ పట్ల తీవ్ర వ్యతిరేకత లేదనేది విశ్లేషకుల అభిప్రాయం. 

ఏపీలో వైఎస్సార్‌సీపీ బలమైన ప్రతిపక్షంగా ఉంది కాబట్టి చంద్రబాబు భయపడుతున్నారని, తెలంగాణలో బలమైన ప్రతిపక్షం లేనందున కేసీఆర్‌ బాబు మాదిరిగా ఆందోళన చెందడంలేదని, ఆంధ్రాలో టీడీపీ ఎమ్మెల్యేలు రచ్చ చేసే తీరులో తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు చేయలేరని విశ్లేషకుల అంచనా. గతంలో ఓసారి అసెంబ్లీ సీట్లు పెంచేది లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పార్లమెంటులోనే చెప్పగా, అబ్బే...అలాంటిదేంలేదని, సీట్లు పెరుగుతాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు.

తెలంగాణ బీజేపీ నాయకులు అసెంబ్లీ సీట్లు పెంచకూడదని కోరుకుంటుంటే, ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ నాయకులు స్థానాలు పెరగాలని కోరుకుంటున్నారు. ఒకసారి వెంకయ్య నాయుడు 'ఏం భయపడక్కర్లేదు. అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. కసరత్తు పూర్తి కావొచ్చింది' అని చెప్పారు. ఆయన ఈమాట చెప్పి చాలాకాలం గడిచిపోయినా ఇప్పటివరకు స్పష్టత లేకపోవడంతో చంద్రులు భయపడుతున్నారు. అసెంబ్లీ సీట్ల పెంపు గురించి వెంకయ్య నాయుడు  భరోసా ఇవ్వడంతో ముఖ్యమంత్రులు ధైర్యంగా ఫిరాయింపులను ప్రోత్సహించారు.