ఎవరు ఔనన్నా కాదన్నా ఇది నిజం. చంద్రబాబుపై లోకేష్ గుర్రుగా ఉన్నారు. తన టాలెంట్ చూపించుకోడానికి అవకాశం ఇవ్వడంలేదని, వచ్చే ఎన్నికల్లో తన యాత్రలకు అడ్డు పడుతున్నారని, పార్టీలో తన కోటరీని ఎదగనీయడంలేదని అనుకుంటున్నారు.
అనుకోవడం కాదు అదే నిజం కూడా. కానీ కొడుకు భవిష్యత్తు కోసం బాబుకి అది తప్పడం లేదు. చాలా విషయాల్లో కొడుకును, ఆయన నిర్ణయాల్ని బాబు పక్కనపెట్టాల్సిన పరిస్థితి.
చంద్రబాబుపై పీకే దెబ్బ
2019 సార్వత్రిక ఎన్నికల్లో పీకే వ్యూహాలు వైసీపీకి బాగా ఉపయోగపడ్డాయి. ఆ తర్వాత పీకేతో డీల్ సెట్ చేసుకునేందుకు టీడీపీ ప్రయత్నించినా కుదరలేదు. అదే సమయంలో మరోసారి పీకే టీమ్ ఏపీలో వైసీపీ కోసం రంగంలోకి దిగుతోందనే విషయంపై క్లారిటీ వచ్చేసింది.
మంత్రులతో స్వయంగా జగనే ఈ విషయం చెప్పడం, ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని హింట్ ఇవ్వడంతో చంద్రబాబుకి మరో షాక్ తగిలింది. అందుకే బాబు ముందే వ్యూహాత్మకంగా చినబాబును పక్కనపెట్టారు. ఎందుకంటే, గత ఎన్నికల్లో లోకేష్ ను టార్గెట్ చేస్తూ, పీకే టీమ్ టీడీపీకి చేసిన డ్యామేజీ బాబుకు ఇంకా గుర్తుంది.
పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత..
కొడుకుపై చంద్రబాబుకి విపరీతమైన ప్రేమ ఉండొచ్చు కానీ, నమ్మకం లేదు. పార్టీలోని ఇతర నాయకులకు ఆయనపై ప్రేమ, నమ్మకం రెండూ లేవు. అందుకే వారంతా ఈసారికి చంద్రబాబే ఎన్నికల కోసం ముందుండి పార్టీని నడిపించాలని కోరుతున్నారు.
ఇప్పుడున్న గడ్డు పరిస్థితుల్లో లోకేష్ ని తెరపైకి తెచ్చి రిస్క్ చేయడం కంటే, చంద్రబాబే తాడోపేడో తేల్చుకోవడం బెటర్ అనేది పార్టీ నాయకుల వాదన. అందుకే వారంతా పరోక్షంగా లోకేష్ ప్రయారిటీని వ్యతిరేకిస్తున్నారు. ప్రచార సారధి చంద్రబాబే కావాలని కోరుకుంటున్నారు.
లోకేష్ యాత్రకు బ్రేకులు
లోకేష్ సైకిల్ యాత్ర చేయాలనుకున్నారు. దానికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా వేయించారని, ప్రమోషన్ టీమ్ ని రెడీ చేసుకున్నారని అంటున్నారు. అయితే ఆ యాత్రకు బాబు బ్రేక్ వేశారు. తానే స్వయంగా బస్సు యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు.
ఆ బస్సులో లోకేష్ కూడా ఉంటారు కానీ, ఆయనకు అంతగా ప్రయారిటీ ఇవ్వరు. లోకేష్ లో ఉబలాటం ఎక్కువగా ఉన్నా కూడా భవిష్యత్తుని ఊహించుకుని బాబు ఆయన్ను పూర్తిగా పక్కనపెట్టేస్తున్నారు.
కోటరీకి బ్రేకులు..
లోకేష్ కోటరీ నుంచి వస్తున్న ఏ ఒక్క నేతను బాబు ఎంకరేజ్ చేయడం లేదు. వచ్చే ఎన్నికల్లో కలిసొస్తారనుకుంటే కన్సిడర్ చేస్తున్నారు, లేదంటే పొమ్మంటున్నారు.
ఒకరకంగా సీనియర్లతోటే ఈసారి ఎన్నికలను ఎదుర్కోవాలనేది బాబు ఆలోచన. లోకేష్ చుట్టూ చేరే కోటరీ ఏమి ఆశిస్తారనేది బాబుకి బాగా తెలుసు. అందుకే వారందర్నీ కట్ చేస్తున్నారు.
పొత్తు చర్చల్లో కూడా లోకేష్ కట్
టీడీపీతో పొత్తు పెట్టుకుంటే, రాబోయే రోజుల్లో లోకేష్ కు ప్రాధాన్యం ఇస్తారే తప్ప, చంద్రబాబు పొత్తు ధర్మం పాటించరని చాలామందికి అనుమానం ఉంది. అందుకే ఈ విషయంపై కూడా బాబు క్లారిటీ ఇస్తున్నారు.
తానే ముఖ్యమంత్రి అభ్యర్థిని అని చెబుతున్నారు. పొత్తులతో కూటమి అధికారంలోకి వస్తే తానే ముఖ్యమంత్రిగా ఉంటూ అందరికీ సమ ప్రాధాన్యమిస్తామని అంటున్నారు. ఇక్కడ కూడా చంద్రబాబుకు, చినబాబును కట్ చేయక తప్పని పరిస్థితి.
చిర్రుబుర్రులాడుతున్న చిన్నోడు
చంద్రబాబు నిర్ణయాలు, తాజా పరిణామాలతో లోకేష్ చిర్రుబుర్రులాడుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు మనుషులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారని సమాచారం.
ఇప్పుడు కాకపోతే తన టాలెంట్ ఇంకెప్పుడు చూపించాలని లోకేష్ ప్రశ్నిస్తున్నారట. చూస్తుంటే.. లోకేష్ కు ట్విట్టర్ పర్మినెంట్ కేరాఫ్ అడ్రస్ గా మారేలా ఉంది.