Advertisement


Home > Politics - Gossip
మనసులోని మాట తెలిసేదెప్పుడో....!

తెలంగాణ టీడీపీ నేతలు ఒక విధమైన అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఏడాదిన్నర ముందుగానే ఎన్నికల జ్వరం పీడిస్తున్నా సరైన ట్రీట్‌మెంట్‌ ఏమిటనేది అర్థంకావడంలేదు. అందుకే ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుతున్నారు. బద్ధ శత్రువైన అధికార పార్టీ టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవాలని ఒక నాయకుడంటే, కాంగ్రెసుతో కలిసి నడిస్తే బాగుంటుందని మరో నాయకుడు అంటున్నాడు. కొందరు తటస్థంగా ఉన్నారు. అధినేత చంద్రబాబు నాయుడి మనసులో ఏముందో తెలియదు. తాజాగా తెలంగాణ నేతలతో సమావేశమైన అధినేత పొత్తులపై ఎవరికి తోచినట్లు వారు మాట్లాడొద్దని, పొత్తు విషయం ఎన్నికల సమయంలో నిర్ణయిస్తామని హెచ్చరించారు. ఆయన మనసులో ఏముందో బయటపడటానికి ఇంకా చాలాకాలం ఆగాల్సివస్తుంది.

ఈలోగా పలువిధాలైన పుకార్లు వ్యాపిస్తూనే ఉంటాయి. టీఆర్‌ఎస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకోవాలనేది చంద్రబాబు మనుసులోని ప్లాన్‌ అని 'సాక్షి' బాగా ఎక్స్‌పోజ్‌ చేసింది. టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవాలని సీనియర్‌ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నప్పుడు పార్టీలో పెద్ద దుమారం రేగింది. చంద్రబాబే ఆయన నోట చెప్పించాడని జగన్‌ పత్రిక ప్రచారం చేసింది. అదే జరిగితే కేసీఆర్‌ మీద అలుపెరుగని పోరాటం చేస్తున్న రేవంత్‌ రెడ్డి, ఆయన అనుచరులు వెళ్లిపోవడం ఖాయమనే ప్రచారమూ జరిగింది. ఒకవేళ టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుంటే జరిగేది ఇదే. ప్రస్తుతం టీడీపీ ఉనికి కొద్దిగా మిగిలింది. కాని అధికార పార్టీతో పొత్తు పెట్టుకొని, రేవంత్‌ వెళ్లిపోతే అసలు ఉనికి  ఉండదని చెప్పుకోవచ్చు.

టీఆర్‌ఎస్‌తో టీడీపీ పొత్తు ప్రచారాన్ని బలపరిచేలా సీఎం కేసీఆర్‌ అనంతపురం పర్యటన సాగింది. ఏపీ మంత్రి పరిటాల సునీత కుమారుడి వివాహానికి కేసీఆర్‌ కుమారుడితో కలిసి వెళ్లడం, అక్కడ టీడీపీ నాయకులు వీరికి ఘనస్వాగతం పలకడం, నేతలు, ప్రజలు కేసీఆర్‌కు జయజయధ్వానాలు పలకడం, ఈయన పయ్యావుల కేశవ్‌తో మంతనాలు జరపడం....ఇదంతా తెలంగాణ టీడీపీలో కేసీఆర్‌ను వ్యతిరేకించే వర్గానికి అనుమానంగా ఉంది. చంద్రబాబుతో జరిగిన సమావేశంలో ఆంధ్రా టీడీపీ నేతల వైఖరిని ఆక్షేపించారు. అక్కడి నాయకులు కేసీఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తుతుంటే ఇక్కడ తాము పోరాటాలు చేసి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. దీనిపైనా బాబు క్లారిటీ ఇవ్వలేదు.

ఆంధ్రాలో బీజేపీతో పొత్తు కొనసాగించాలనుకుంటున్న బాబు తెలంగాణలోనే స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. గులాబీ పార్టీతో పొత్తు పెట్టుకుంటే అది టీడీపీ మరింత పతనం కావడానికే దోహదం చేస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. పొత్తు పెట్టుకుంటే కొన్ని సీట్లయినా దక్కుతాయని మరికొందరి అభిప్రాయం.  తెలంగాణ టీడీపీ స్వతంత్రంగా వ్యవహరించాలని చంద్రబాబు నాయకులకు చెప్పారు. కాని స్వతంత్రంగా ఎలా వ్యవహరించాలో ఆయన వారికి క్లారిటీ ఇచ్చారో లేదో తెలియదు. చంద్రబాబు ఏపీకి తరలివెళ్లిన తరువాత తెలంగాణ టీడీపీ చుక్కాని లేని నావ మాదిరిగా మారింది. రేవంత్‌ రెడ్డి ఒక్కడు తప్ప ఇతురులెవరూ పెద్దగా మాట్లాడుతున్నట్లు కనబడటంలేదు.

ఒకప్పుడు కేసీఆర్‌పైన ఒంటి కాలు మీద లేచిన మోత్కుపల్లి నర్సింహులు పూర్తిగా డల్‌ అయిపోయారు. గవర్నర్‌ పదవి రాలేదనే బాధ తొలిచేస్తోంది. తాజా సమావేశంలోనూ బాబుకు తన బాధ చెప్పుకున్నారు. ఆయన్ని చూసి బాబు కూడా బాధ పడ్డారు తప్ప మళ్లీ ఆశ పెట్టలేదు. ప్రధాని మోదీ గవర్నర్‌ పదవి ఇవ్వరనే విషయం బాబుకు అర్థమైపోయింది. మోత్కుపల్లికి భవిష్యత్తులో ఇస్తే గిస్తే రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలి. ఏది ఏమైనా తెలంగాణ టీడీపీ గందరగోళంలో ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో బలంగా ఉన్న ఈ పార్టీ భవిష్యత్తు ఏమవుతుందో నని దాని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.