Advertisement


Home > Politics - Gossip
వేడి చల్లారొద్దు... వైసీపీ చల్లారాలి...!

'వేడిలో వేడి పనులు పూర్తి చేసెయ్యాలి' అంటూ హడావుడి పడుతుంటారు కొందరు. 'ఏదైనా వేడిగా ఉన్నప్పుడే చెయ్యాలి' అంటారు మరికొందరు. ఇక్కడ 'వేడి' అనేదానికి ఉత్సాహమని, ఆత్మవిశ్వాసమని అర్థం. ఒక పనిలో విజయం సాధించగానే ఆ ఉత్సాహం చల్లారకముందే, విజయం తెచ్చిన ఆత్మవిశ్వాసం అండగంటిపోకముందే మరో పని చెయ్యాలని తాత్పర్యం.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఉత్సాహం చల్లారకముందే వేడిలో వేడిగా పనులు కానిచ్చేయాలని అనుకుంటున్నారు. ఆయనకున్న వేడి ఏమిటి? నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో విజయోత్సాహం అనే వేడి. అది చల్లారిపోకముందే ఎన్నికలు జరగకుండా ఆగిపోయిన మున్సిపల్‌ కార్పొరేషన్లలోనూ త్వరలోనే ఎన్నికలు నిర్వహించి ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీని పూర్తిగా చల్లార్చాలని భావిస్తున్నారు. ఆ పార్టీలో ఏ కొద్దిగానైనా వేడి ఉన్నట్లయితే ఈ దెబ్బతో అది పూర్తిగా పోవాలనుకుంటున్నారు.

వచ్చే సాధారణ ఎన్నికల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాల్సివుంది. కోర్టు కేసులు, ఇతర కారణాలతో బాబు అధికారంలోకి వచ్చినప్పటినుంచి అవి పెండింగ్‌లోనే ఉన్నాయి. ఎన్నికలు జరిపితే ఓటమి ఎదురుకావచ్చన్న సందేహంతో, భయంతో ధైర్యం చేయలేదు. గెలిచిన రెండు ఎన్నికలు అనుకోకుండా జరిగినవే. భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది.

కోర్టు ఆదేశాల కారణంగా కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగాయి. ఆ రెండు చోట్లా ఘనవిజయం దక్కుతుందని బాబు కూడా ఊహించివుండరు. ఊహించనిది జరగడంతో ఉత్సాహం కట్టలు తెంచుకుంటోంది. ఆ రెండు ఎన్నికలను 'మోడల్‌'గా తీసుకొని, పాఠ్యాంశంగా పరిగణించి మిగిలిన విజయాలు సాధించాలని నాయకులకు నూరిపోస్తున్నారు.

ఇక తిరుపతి, కర్నూలు, ఒంగోలు, విశాఖపట్నం, గుంటూరు, శ్రీకాకుళం మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాల్సివుంది. ఇవి కాకుండా కొన్ని మున్సిపాలిటీలూ ఉన్నాయనుకోండి. ఈ మున్సిపల్‌ కార్పొరేషన్లు కీలకం కాబట్టి ముందుగా వీటికి ఎన్నికలు జరపాలని చూస్తున్నారు. వీటిల్లో ఎన్నికలు జరిపేందుకు అడ్డంకులు ఏమీ లేవు. వార్డుల విభజన, రిజర్వేషన్లు కూడా పూర్తయ్యాయి.

ప్రక్రియ మొత్తం పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఎప్పుడంటే అప్పుడు ఎన్నికల నిర్వహణకు రెడీగా ఉంది యంత్రాంగం. ముస్లిం మైనారిటీలు, బీసీలు, దళితులు, కాపులు టిడిపి వైపే ఉన్నట్లు రెండు ఎన్నికలు రుజువు చేశాయి కాబట్టి ఇతర కార్పొరేషన్‌లలోనూ తమకు తిరుగుండదని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్రలో ఈ మున్సిపల్‌ కార్పొరేషన్‌లు ఉన్నాయి కాబట్టి అన్నింటికీ ఒకేసారి ఎన్నికలు జరిగితే రాష్ట్రం మొత్తం మీద టిడిపి బలమేమిటో తెలుస్తుందని భావిస్తున్నారు. అన్ని చోట్ల విజయం సాధించినట్లయితే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందనే సందేహమే రాదని చెబుతున్నారు. అన్ని కార్పొరేషనలో టిడిపి బలంగా ఉందంటున్నారు. నంద్యాల ఎన్నికల్లో గెలిచిన అధికార పార్టీ కర్నూలు కార్పొరేషన్‌లో గెలవడం సులభం.

అక్కడ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి పట్టుంది. తిరుపతి సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో ఉంది. ఈ కార్పొరేషన్‌లలో ముందే వైకాపాకు కేడర్‌ లేదని, నంద్యాల, కాకినాడ అపజయంతో డీలా పడిందని టిడిపి నాయకులు సంతోషంగా చెబుతున్నారు. ఈ మున్సిపల్‌ కార్పొరేషన్‌ల ఎన్నికలకు షెడ్యూలు ప్రకటించగానే వైకాపా నాయకులు తమ పార్టీలోకి జంప్‌ అవుతారని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా టిడిపి ప్రస్తుతం రేసు గుర్రంలా ఉంది. జగన్‌ తలపెట్టిన పాదయాత్రను అడ్డుకునేవిధంగా షెడ్యూలు ప్రకటిస్తారేమో....!

టిడిపి కోట్లు ఖర్చు చేసి విజయం సాధించింది అనే మాట తప్ప మరోటి మాట్లాడలేకపోతున్నారు  వైసీపీ నాయకులు. అసలది విజయమే కాదంటున్నారు.  ఏం మట్లాడాలో అర్థం కావడంలేదు. టిడిపి మీద ఎదురుదాడి చేసే పరిస్థితి లేదు. అందుకని ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో  'పచ్చ' పార్టీ  వైఫల్యాలను ఏకరువు పెడుతున్నారు. ఈ ఏకరువు సారాంశం ఏమిటంటే తమ పార్టీ ఇప్పుడు ఓడిపోయినా వచ్చే నష్టం ఏమీలేదని, సాధారణ ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పడమన్నమాట.

అనేక ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన టిడిపి 2014 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిందని, తమ పార్టీ పరిస్థితి అదేనని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అద్భుతం జరుగుతుందని బలంగా నమ్ముతున్నారు.  టిడిపిలోకి కొత్తగా ఫిరాయింపుల అంశం గురించి  అడిగినప్పుడు రెండు చోట్ల ఓటమికి నిరాశపడి ఎవ్వరూ వెళ్లరని చెబుతున్నారు. గతంలో ఇలా చెప్పినవారే వెళ్లారు కదా అన్నప్పుడు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. పైకి ఇలా చెబుతున్నా ఎప్పుడే నాయకుడు కొంప ముంచుతాడోనని భయంగానే ఉంది.

-నాగ్‌ మేడేపల్లి