cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Gossip

చంద్రబాబు ట్రాప్‌లో రాహుల్‌, కాంగ్రెస్‌ పడినట్లా?

చంద్రబాబు ట్రాప్‌లో రాహుల్‌, కాంగ్రెస్‌ పడినట్లా?

ఈ అరుదైన సన్నివేశాన్ని గమనించారా? ఒకే వేధికపైకి వచ్చి ఏఐసీసీ అధినేత రాహుల్‌ గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారం చేయడం. రాహుల్‌గాంధీ కనీసం కాంగ్రెస్‌ పక్షాన ఉమ్మడి ఏపీకి పనిచేసిన ముఖ్యమంత్రుల పేర్లలో ఒక్కటి కూడా ప్రస్తావించకుండా చంద్రబాబు గురించే మాట్లాడడం, చంద్రబాబు కూడా గతంలో కాంగ్రెస్‌ను నానాతిట్లు తిట్టినా, ఇప్పుడు దేశంకోసం కాంగ్రెస్‌తో కలిశానని చెప్పడం.. రాజకీయ విలువలకే వీరిద్దరూ కొత్త అర్థం చెప్పారు.

రాజకీయం అంటే పచ్చి అవకాశవాదమని వీరిద్దరూ నిరూపించారు. అంతేకాదు వైఎస్‌ రాజశేఖరరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి వంటి వారి పేర్లను ప్రస్తావించకపోతేమానే, కనీసం తెలంగాణకు చెందిన మాజీప్రధాని, మాజీ ముఖ్యమంత్రి పీవీ.నరసింహారావు గురించి కాని, మర్రిచెన్నారెడ్డి, జలగం వెంగళరావు, అంజయ్య, బూర్గుల రామకృష్ణారావు గురించి కాకుండా చంద్రబాబును మెచ్చుకుని రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ శ్రేణులకు ఏమి సందేశం ఇచ్చారో అర్ధంకాదు.

అంతేకాదు.. కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిన ప్రచార ప్రకటనలలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్‌టీఆర్‌ బొమ్మవేశారు కానీ, కాంగ్రెస్‌ పూర్వ ముఖ్యమంత్రుల బొమ్మలు మాత్రం వేసుకోలేదు. ఇదంతా చూస్తుంటే నిజంగానే చంద్రబాబు ట్రాప్‌లో రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ పడిందా అన్నడౌటు వస్తుంది. అదే సమయంలో ఎన్‌టీఆర్‌ బొమ్మను కాంగ్రెస్‌ ప్రచార ప్రకటనలలోకి అనుమతించడం, స్వయంగా చంద్రబాబే కాంగ్రెస్‌ కండువాను వేసుకోవలసిన పరిస్థితి రావడం.. ఇవన్ని చూస్తుంటే తెలుగుదేశంపార్టీ ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్‌కు కట్టబెట్టిందన్న భావన ఏర్పడుతుంది.

ఖమ్మంలో జరిగిన ప్రజాకూటమి ప్రచారసభలో ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలిసి పాల్గొనడం చారిత్రక సన్నివేశమే. అది క్లైమాక్సా, యాంటి క్లైమాక్సా అన్నది డిసెంబర్‌ 11న కాని తేలదు. అయితే వ్యూహాత్మకంగానే కాంగ్రెస్‌, టీడీపీలు ఖమ్మం ప్రాంతాన్ని ఈ సభావేదికగా ఎంచుకున్నాయని చెప్పాలి. ఖమ్మంజిల్లా మొదట నుంచి తెలంగాణ ఉద్యంలో పెద్దగా యాక్టివ్‌గా లేదనిచెప్పాలి. అక్కడ టీఆర్‌ఎస్‌ బలహీనంగా ఉండేది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే అక్కడ పార్టీ పుంజుకుంది.

అక్కడ కాంగ్రెస్‌, టీడీపీ, వామపక్షాలు బలంగా ఉన్నాయి. అంతేకాక సామాజికవర్గాల సమీకరణలు, ఆంధ్రబోర్డర్‌ వంటి అంశాలు కూడా ప్రభావితం చేస్తాయి. టీడీపీ అక్కడ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. గతంలో పార్లమెంటరీ పార్టీనేతగా పనిచేసిన నామా నాగేశ్వరరావు ఖమ్మం నుంచి అసెంబ్లీకి పోటీచేస్తున్నారు. మదిర నుంచి కాంగ్రెస్‌ ప్రచారకమిటీ చైర్మన్‌ మల్లుబట్టి కూడా అక్కడే ఉంటారు. వీటన్నిటి రీత్యా అక్కడ జనసమీకరణ బాగా జరుగుతుందని అంచనా వేయడం, టీడీపీ, కాంగ్రెస్‌ కలయికకు పెద్దగా నిరసన ఉండదన్న భావంతో ఖమ్మంను ఎంపిక చేసుకున్నారు.

అంతవరకు బాగానేఉంది. కానీ రాహుల్‌గాంధీ, చంద్రబాబులు తమ కలయిక అవసరం ఏమిటో వివరించడంలో అంతగా సఫలం అయినట్లు కనిపించలేదు. చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో యధా ప్రకారం, సీబీఐ, ఐటీ, ఈడీదాడులు జరుగుతున్నాయని వాపోయారు. దర్యాప్తు సంస్థలు ఎందుకు పనిచేయరాదన్న దానిపై వివరణ ఇవ్వలేదు. అయితే టీడీపీ ఎంపీలు సుజనాచౌదరి, సీఎం.రమేష్‌లపై జరిగిన దాడులలో ఏమి బయటపడలేదా? బయటపడినా కేసులు పెట్టరాదని చంద్రబాబు డిమాండ్‌ చేస్తున్నారా? ఆ విషయాల గురించి ప్రస్తావించలేదు.

అదే సమయంలో రాహుల్‌గాంధీ కూడా ఈ విషయాలు ఏవీ ప్రస్తావించలేదు. చంద్రబాబు బాధపడుతున్న సీబీఐ దాడులను సమర్థిస్తున్నది, లేనిది ఆయన వివరించలేదు. మోడీ ప్రభుత్వం చేసిన నోట్లరద్దు, జీఎస్టీని అప్పట్లో పూర్తిగా సమర్థించిన చంద్రబాబు, ఇప్పుడు రివర్స్‌లో మాట్లాడుతున్నారు. రాహుల్‌గాంధీ నోట్లరద్దు గురించి ప్రస్తావించలేదు. అయితే కాంగ్రెస్‌ నేతలు, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి వంటి వారు కేసీఆర్‌ నోట్లరద్దును సమర్థించారని అన్నారు. కాని అదే సమయంలో తమపక్కన ఉన్న చంద్రబాబు ఆ రోజులలో ఎంతగట్టిగా వాదించి గుర్తులేనట్లు వ్యవహరించారు.

చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న విమర్శలకు నేరుగా సమాధానం చెప్పలేకపోయారు. తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తామని అన్నారు తప్ప, ఆయా ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఏపీ ముఖ్యమంత్రిగా ఎందుకు లేఖలు రాయవలసి వచ్చిందని కాని, ఇకపై రాయబోనని కాని ఏవీ ప్రస్తావించకుండా జాగ్రత్తపడ్డారు. కాంగ్రెస్‌ నేతలు కూడా ఆ విషయాలపై మాట్లాడడానికి సాహపించలేదు. ఒకవైపు రాష్ట్రాన్ని విభజించి సోనియాగాంధీ ఆంధ్రుల పొట్టగొట్టిందని చంద్రబాబు ఐదేళ్లుగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నవనిర్మాణ దీక్షలు చేశారు.

సోనియాగాంధీని, రాహుల్‌గాంధీని బండబూతులు చందంగా విమర్శించేవారు. మరి వాటిని ఎవరూ గుర్తు చేసుకోలేదు. పైగా పైకిమాత్రం ఎప్పటి నుంచో ఉన్న బంధం మాదిరి ఎవరికి వారు నటించారు. కాని మాటలలో మాత్రం ఎక్కడా ప్రజలలో వ్యక్తం అవుతున్న సందేహాలకు అటు కాంగ్రెస్‌ లేదా టీడీపీ, రాహుల్‌ లేదా చంద్రబాబు ఎవరూ సమాధానం చెప్పకుండా దాటవేసి నటించడం ఈ సమావేశం విశిష్టతగా కనిపిస్తుంది. చంద్రబాబు తన ప్రసంగంలో కాంగ్రెస్‌తో కలవడం చారిత్రక అవసరం అని సమర్థించుకునే యత్నంచేశారు తప్పితే, రాహుల్‌గాంధీ మాత్రం అసలు ఆ ఊసే ఎత్తలేదు.

మల్లుభట్టి విక్రమార్క, టీడీపీనేత నామా నాగేశ్వరరావు వంటి వారు తెలంగాణ రావడానికి చంద్రబాబు ఏ విధంగా సహకరించింది వివరించారు. ఈ మొత్తం సమావేశం చూసినవారికి ఏమనిపిస్తుందంటే, తెలంగాణ కోసం అంతగా పోరాడిన వ్యక్తి ఏపీకి వచ్చి విభజనకు వ్యతిరేకంగా ఎంత హడావుడి చేశారు? సమైక్య ఉద్యమం చేశారంటూ ఎన్‌జీఓ నేతలను ఎలా సన్మానించారు? ఏవైనా డబుల్‌ గేమ్‌ ఆడేవారివే రోజులా? ప్రజలు పిచ్చోళ్లా.. ఏ రోటికాట ఆ పాట పాడేవారిని సమర్ధిస్తారా? అన్నది ఆలోచించవలసిన అంశమే. కేసీఆర్‌ నియంతృత్వం గురించి కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ మందకృష్ణ, గద్దర్‌ వంటివారు మాట్లాడారు.

మరి ఏపీలో చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ఉందా లేదా అన్నది వారికి తెలియదా? మందకృష్ణ మాదిగ మరీ కేసీఆర్‌పై గుడ్డి వ్యతిరేకతతో మాట్లాడి, చంద్రబాబును పొగిడి తన పరువు తానే తీసుకున్నట్లుగా ఉంది. ఏపీలో వభజన తర్వాత మాలలకే ప్రాధాన్యం ఇస్తున్నారని, షెడ్యూల్‌ కులాల వర్గీకరణపై మరోసారి అసెంబ్లీ తీర్మానం చేయాలని అక్కడ దళితులు కోరుతుంటే, మందకృష్ణ భిన్నంగా మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది.

మందకృష్ణ కొంతకాల క్రితం అమరావతిలో జాతీయ రహదారిపై ఆందోళనకు దిగినప్పుడు అక్కడ పోలీసులు ఏమిచేశారో ఆయన మర్చిపోయారా? లేక చంద్రబాబుపై ఆయనకు సడన్‌గా కలిగిన అభిమానం వల్ల దానిని వదలివేశారా అన్నది తెలియదు. ఇక ప్రజా గాయకుడు గద్దర్‌ తీరు మరీ ఆశ్చర్యంగా ఉంది. ఆయన కేసీఆర్‌ను విమర్శించవచ్చు. తప్పులేదు. కాని ఏకంగా రాహుల్‌, చంద్రబాబులను ప్రజాస్వామ్య రక్షకులు మాదిరి అభివర్ణించడం మాత్రం అందరిని విస్తుపరచిందని చెప్పాలి. ఇంతకాలం విప్లవ ఉద్యమంలో ఉన్న గద్దర్‌పై ఒకసారి కాల్పులు జరిగాయి. అది ఎవరి హయాంలోనో ఆయనకు తెలియనిది కాదు.

చంద్రబాబు హయాంలో నక్సల్స్‌ ఎన్‌కౌంటర్‌ అయితే ఇదే గద్దర్‌ ఆనాటి చంద్రబాబు ప్రభుత్వంపై ఎన్నిపాటలు పాడింది అందరికి తెలుసు. కాని ఇప్పుడు గద్దర్‌కు చంద్రబాబు ప్రజాస్వామ్యవాది కనిపించడమే రాజకీయాలలో విలువల క్షీణతకు  పెద్ద ఉదాహరణగా ఉంది. ఏపీలో ఇరవైమూడు మంది విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం గద్దర్‌కు ప్రజాస్వామ్యంగా కనిపించిందా? అక్కడ కొన్ని టీవీ ఛానళ్లను బంద్‌ చేయించడం గద్దర్‌కు స్వేచ్ఛగా అనిపించిందా? గెలిచిన ఎమ్మెల్యేలకు కాకుండా ఓడిపోయిన టీడీపీ అభ్యర్థులకు నిధులు మంజూరు చేయడం ప్రజాస్వామ్యంగా గెలిపించిందా?

నాలుగున్నరేళ్లు బీజేపీతో కలిసిఉండి, అన్నిటికి మద్ధతు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు రాజకీయ అవసరాలకు ఎన్‌డీఏ నుంచి బయటకు వస్తే ఆయనలో గద్దర్‌కు ప్రజాస్వామ్యం కనిపించింది. ఒకపక్క టీడీపీ ఎంపీ సుజనాచౌదరి వేలకోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసంచేశారని, రుణాలు ఎగవేశారని ఈడీ చెబుతుంటే, తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పుడు గద్దర్‌ వంటి విప్లవకారులకు గొప్పగా కనిపించడం వింతగానే ఉంది. మరి ఏమి ఆశించి గద్దర్‌ ఇలా మాట్లాడారో కాని, ఇంతకాలం ఆయనపై ఒక గౌరవమైన అభిప్రాయాన్ని కోల్పోయినట్లు అనిపిస్తుంది.

ఏతావాతా చెప్పాలంటే కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు, రాహుల్‌గాంధీ, చంద్రబాబునాయుడు ఒక అవకాశవాదంతో కలిశారన్న విషయం వారి మాటలలోనే అర్థం అవుతుంది. వారిద్దరూ పొడి, పొడిగానే ఎదుటివారి గురించి మాట్లాడారు తప్పితే, పూర్తిగా మనసుతో మాట్లాడినట్లు అనిపించలేదు. కాకపోతే చంద్రబాబు తన నటనా వైదుష్యంతో ప్రజాకూటమికి అనుకూలంగా మత్రం ప్రచారం చేశారు. గతంలో బండబూతులు తిట్టిన చంద్రబాబు చెంత కూర్చోవడానికి రాహుల్‌గాంధీకి పెద్దగా బాధ అనిపించలేదా అన్న ప్రశ్నకు సమాధానం దొరకదు.

అలాగే 2014కి ముందు ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాలను, ఆనాటి ముఖ్యమంత్రులు ముఖ్యంగా వైఎస్‌ రాజశేఖరరెడ్డిని చంద్రబాబు ఎంత తీవ్రంగా విమర్శించేవారో అందరికి తెలుసు. అలాగే చంద్రబాబుపై కాంగ్రెస్‌పార్టీ ఎన్ని విమర్శలు చేసేదో కూడా తెలుసు. అయినా వారిద్దరూ పక్కనపక్కన కూర్చోవడమే కాకుండా, ఒకేదండను కూడా వేసుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. మరి ఇంతకాలం పోటీపడ్డ కాంగ్రెస్‌ తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలే ఆత్మాభిమానం లేనివారా?

నాయకులు తమ సొంత అవసరాల కోసం ఇలాచేస్తే పార్టీల క్యాడర్‌ కూడా వారిని అనుసరించాలా? దీనికి కాలమే సమాధానం చెబుతుంది.
-కొమ్మినేని శ్రీనివాసరావు

తెలంగాణ ఓటరు నాడి... ముళ్లు ఎటువైపు తిరుగుతోంది?... చదవండి గ్రేట్ ఆంధ్ర పేపర్