Advertisement


Home > Politics - Gossip
చంద్రబాబు: తన పనిని తానే ఈసడించుకున్న వేళ...

‘ఏ మాత్రం ఫలితం లేనప్పుడు ఎందుకు ఇవన్నీ... ఆపేస్తే పోతుంది..’ అంటూ వెల్లడైన ఆగ్రహావేశాల మూలం ఏమిటి? తన పని వలన ఫలితం ఉండడం లేదని తనకే అసహ్యం పుడుతున్నదన్నమాట. తానేదో చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోందే తప్ప.. ఏదేదో జరిగిపోతున్నట్లుగా ప్రజలకు ప్రకటనలు జారీ చేయడానికి ఉపయోయగపడుతోందే తప్ప.. వాస్తవంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్నదేమీ లేదనే అసహనం పెచ్చు మీరుతున్నదన్నమాట. చంద్రబాబునాయుడు తన పనికి ఫలితం లేకపోవడంపై పనినే ఈసడించుకున్న సందర్భం సోమవారం నాడు పోలవరం పనుల సమీక్షల వేళ చోటు చేసుకోవడం గమనార్హం. 

చంద్రబాబునాయుడేమో.. వచ్చే ఏడాదికెల్లా పోలవరం పూర్తిచేసేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేస్తాం అని ఇప్పటికి కొన్ని వందల వేల సందర్భాల్లో చెప్పి ఉంటారు. మొన్నటికి మొన్న కేంద్రంనుంచి వచ్చిన మంత్రి గడ్కరీ మాత్రం.. ‘‘వచ్చే ఏడాది చివరికెల్లా ’’ అంటే అసాద్యం గానీ.. ఆ తర్వాత కొన్నినెలలకు అంటే ఎన్నికల్లోగా ఇచ్చే ప్రయత్నం చేస్తాం అంటూ సన్నాయినొక్కులు నొక్కి వెళ్లారు. అక్కడికి వెళ్లి పనుల తీరును కూడా పరిశీలించిన గడ్కరీకి అనుకున్నట్లుగా ఈ పనులు పూర్తి అయ్యే ఛాన్సేలేదని బోధపడినట్లుంది. 

తాజాగా సోమవారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించినప్పుడు చంద్రబాబునాయుడు కూడా పనుల తీరు మీద చిరాకు పడిపోయారు. చంద్రబాబునాయుడు ప్రతి సోమవారం పోలవరం పనుల మీద సమీక్ష నిర్వహిస్తుంటారు. అయితే పనులు మాత్రం అనుకున్న వేగంతో జరగడంలేదని, ఇలాగైతే అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తికావడం కష్టం అని.. చంద్రబాబునాయుడు సోమవారం అధికార్ల సమావేశంలో విరుచుకుపడ్డారు. 

అయితే ఇక్కడ గమనించాల్సిన కామెడీ ఏంటంటే.. పోలవరం పనులు అనుకున్న లక్ష్యం సమయానికి పూర్తి కావడం కష్టం అనే సంగతి.. చంద్రబాబుకు ఇన్నాళ్లకు కనిపించిందేమో గానీ.. కొన్ని రోజుల కిందట ఒకరోజు పర్యటనలో ఆ ప్రాజెక్టు వద్దకు వెళ్లి వచ్చిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆ స్వల్ప సమయంలోనే ఇది ఇప్పట్లో  పూర్తయ్యే ప్రాజెక్టు కాదనే విషయం గ్రహించేశారు.

అందుకే ఆయన 2018 నాటికి పూర్తికావడం అసాధ్యం అంటూ బహిరంగ వేదిక మీదినుంచే తేల్చిచెప్పేశారు. ఇదంతా కలిపి తాను ఇన్నాళ్లుగా చేస్తున్న పని దండగ అయిపోతున్నదని చంద్రబాబు కూడా గ్రహించినట్లుగా కనిపిస్తోంది. అసలు ఈ సమీక్షలు చేయడం ఎందుకు? అంటూ ఆయన అధికార్ల మీద ఉడుక్కుంటున్నారు. మరో సంగతి కూడా చంద్రబాబు వైఖరిలో చిత్రంగా కనిపిస్తోంది. అనుకున్న తరహాలో పనులు చేపట్టని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటాం.. వారిని బ్లాక్ లిస్టులో పెట్టి.. వేరే వాళ్లకి పనులు అప్పగిస్తాం అనే డైలాగును కూడా ఆయన చాలా నెలలుగా చెబుతూనే ఉన్నారు.

ఆ రకంగా నిర్లక్ష్యం కారణాం పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లే గనుక ఉంటే.. అలాంటి వారిలో కొందరినైనా నిబంధనలను ఒప్పందాలను అనుసరించి బ్లాక్ లిస్టులో పెడితే.. కనీసం మిగిలిన వారిలో భయం పుట్టి పనులు వేగంగా నడిపిస్తారు కదా అనే అభిప్రాయం కూడా పలువురిలో వ్యక్తం అవుతోంది. మరి అలా బ్లాక్ లిస్టులో పెట్టడానికి సరిపడా నిబంధనల అనుకూలత చంద్రబాబుకు ఉందా... లేదా, అవంతా ఏదో బిల్డప్ కోసం నిప్పులు చెరగడం మాత్రమేనా అనేది వేచిచూడాలి.