cloudfront

Advertisement


Home > Politics - Gossip

మోడీ సాయం.. చంద్రబాబు స్వాహా!

మోడీ సాయం.. చంద్రబాబు స్వాహా!

దేశవ్యాప్తంగా ఉన్న అంగన్ వాడీ వర్కర్ల వేతనాలను రూ.1500 మేర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. అక్టోబరు నుంచి పెరిగే ఈ వేతనాలు, నవంబరు నెలలో వారు అందుకునే జీతంనుంచి ప్రతిఫలిస్తాయి. వేతనాలను పెంచుతున్నట్లుగా మోడీ ప్రకటన చూసి అంగన్ వాడీ వర్కర్లు మురిసిపోవాల్సిందే తప్ప... ప్రత్యక్షంగా వారికి ఒరిగేదేమీ ఉండదు. ఆ పెంచిన మొత్తం కాస్తా చంద్రబాబు సర్కార్ స్వాహా ఖాతాలోకి వెళ్లిపోతుందే తప్ప... నేరుగా వర్కర్లకు చేరదు.

వివరాల్లోకి వెళితే...
అంగన్ వాడీ వర్కర్లకు గతంలో 3000 రూపాయల వేతనం లభిస్తుండేది. అందులో కేంద్ర వాటా 1800 కాగా, రాష్ట్ర వాటా 1200 మాత్రమే. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ వేతనాల పెంపుకోసం అంగన్ వాడీ వర్కర్లు ఉద్యమాలు చేసినప్పుడు.. ముందు తెలంగాణ సర్కారు వారి వేతనాలను పెంచింది. ఏపీలో కూడా పలు ఉద్యమాలు జరిగినా చంద్రబాబు లాఠీచార్జిలు చేయించారే తప్ప పట్టించుకోలేదు. ఇటీవల ఆ వేతనాలకు రాష్ట్రప్రభుత్వం తరఫున మరో 7500 కలిపి, మొత్తం 10500 రూపాయల వేతనం అందేలాగా చేశారు. కొన్నినెలలుగా ఆ మొత్తం అంగన్ వాడీలకు ఏపీలో అందుతోంది.

ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ దేశవ్యాప్తంగా ఉన్న అంగన్ వాడీ వర్కర్లకు దీపావళి కానుక అంటూ మరో 1500 రూపాయలు పెంచుతున్నట్టు ప్రకటించారు. సాధారణంగా అయితే.. ఈ మొత్తం ప్రస్తుత వేతనానికి కలిసి.. ఏపీలో అంగన్ వాడీలకు రూ.12000 వంతున రావాలి. అయితే అలా జరగబోవడం లేదు. తాము ఇటీవలే రూ.7500 పెంచేశాం గనుక, ఆ అదనపు భారంలోకి కొత్తగా కేంద్రం నుంచి వస్తున్న రూ.1500ను జమ చేసుకోవాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. అంటే మోడీ కొత్తగా చేస్తున్న సాయం చంద్రబాబు సర్కార్ ఖాతాలోకి వెళ్లిపోతుందే తప్ప... నేరుగా అంగన్ వాడీలకు ఎలాంటి లబ్ధి చేకూరదు.

ప్రభుత్వం తమ వెసులుబాటుకోసం ఇలా చేయవచ్చు గాక.. అయితే 7500 రూపాయలు వేతనం పెంచినందుకు వారు ప్రభుత్వ కార్యక్రమాల గురించి ప్రచారం చేయాలని, ఇంకా రకరకాల అదనపు బాధ్యతలను చంద్రబాబు అప్పగించేశారు. ఇప్పుడు ఆ పనిభారంలో కోత ఉండదు. సరికదా, ‘‘నేను మీకు 7500 పెంచా’’ అని సొంతడప్పు కొట్టుకోవడమూ తగ్గదు. మోడీ పెంచిన సాయం వారి వేతనాల్లో కలిపి రూ.12000గా అందిస్తే తప్ప.. ఇలా డబ్బా కొట్టుకోడానికి చంద్రబాబుకు హక్కు ఉండదని పలువురు డిమాండ్ చేస్తున్నారు.