cloudfront

Advertisement


Home > Politics - Gossip

చంద్రబాబుకు.. ‘వాకిట్లోన పోరు ఇంతింత గాదయా’?

చంద్రబాబుకు.. ‘వాకిట్లోన పోరు ఇంతింత గాదయా’?

‘‘చెప్పులోని రాయి చెవిలోని జోరీగ
కంటిలోని నలుసు కాలిముల్లు
ఇంటిలోని పోరు ఇంతింత గాదయా
విశ్వదాభిరామ వినురవేమ.’’

అని వేమన ఎప్పుడో చెప్పాడు. చంద్రబాబు నాయుడుకు కూడా ఆ సంగతి చాలా బాగాతెలుసు. ఈ పోరు అనేది ఏదైతే ఉన్నదో.. అది ఇంటిలోనే ఉన్నంతకాలమూ ఆయన ఆ చికాకును భరిస్తూనే వచ్చారు. తీరా ఇక మనవల్ల కాదని అనుకున్నాక.. ఇంట్లోంచి బయటకు గెంటేశారు. కానీ ఆ ‘పోరు’ బెడద వదలిపోలేదు. వాకిట్లోనే మొదలైంది. ఇంటిలో పోరు వాకిట్లోకి మారితే.. ఇంకాస్త పరువు పోవడం తప్పితే ఇంకేం జరుగుతంది. పాపం, శతకకారుడు వేమన కూడా.. దీనిని ఊహించలేకపోయాడు. అందుకే వాకిట్లో పోరు గురించి రాయలేదు. చంద్రబాబుకు ఇప్పుడు అది మొదలైంది. ఇప్పట్లో వదిలేలా కూడా కనిపించడంలేదు.

తెలంగాణ తెలుగుదేశంలో ‘స్కూలు మూసేద్దాం’ తరహా డైలాగులతో పార్టీని ఇరుకున పెడుతూ వచ్చిన నాయకుడు మోత్కుపల్లి నరసింహులు. పాపం ఆయనకు గవర్నర్ గిరీని ఆశపెట్టి, మోడీ వద్ద తనమాటకు చెల్లుబాటు లేకపోవడంతో చంద్రబాబు ఏం చేయలేకపోయారు. తర్వాత రాజ్యసభ ఆశపెట్టి దానిని కూడా ఇవ్వలేదు. పార్టీ మీదనే విమర్శలు చేస్తుండే సరికి, ఏకంగా పార్టీనుంచి వెలి వేసేశారు.

అయితే మోత్కుపల్లి ఊరుకోలేదు. తాను తెలంగాణ నాయకుడే అయినా.. చంద్రబాబునాయుడు పరువు తీయడానికి ఆంధ్రప్రదేశ్ లో ఊరూరా తిరగడం ప్రారంభించారు. ఇదివరకే కొన్ని నగరాల్లో తిరిగిన మోత్కుపల్లి... ఇప్పుడు తిరుపతిలో చంద్రబాబు మీద నిప్పులు చెరుగుతున్నారు.

ఒకవైపు దళిత తేజం అంటూ చంద్రబాబు దళితుల్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉంటే.. ఆయన దళిత వ్యతిరేకి అని, తనకు రాజ్యసభ ఎంపీ ఆశపెట్టి, ఆ పదవిని వందకోట్లకు అమ్ముకున్నాడని ఆరోపణలు చేస్తున్నారు. ఎన్టీఆర్ ను మానసికంగా హింసించి చంపాడని, నమ్మకద్రోహి అని చంద్రబాబు మీద చెలరేగి విమర్శలు చేస్తున్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి పారిపోయారని ఇలా విమర్శిస్తున్నారు.

అయినా మోత్కుపల్లి బెడద ఇప్పట్లో తొలగేది కూడా కాదు. ఆయన ఎన్నికలదాకా ఊరూరా తిరుగుతూ చంద్రబాబును ఇదే రేంజిలో తిడుతూ ఉండడం ఖరారుగానే కనిపిస్తోంది. చంద్రబాబును ఓడించడానికి కంకణం కట్టుకుని, తనవంతు కృషి చేయడానికి మోత్కుపల్లి పాటుపడుతున్నట్లుగా ఉంది.