Advertisement


Home > Politics - Gossip
బాబుగారు ఈ పని అప్పుడే చేసి ఉంటేనా?

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హస్తినాపురానికి విజయం చేసి.. అక్కడి రారాజు చండమార్తాండ చక్రవర్తులు నరేంద్ర మోడీ వారిని దర్శించుకుని.. వారికి చందన తాంబూలాదులు లుప్తము కాగా.. దుశ్శాలువ, శ్రీహరి ప్రసాదములు, జ్ఞాపికలను సమర్పించుకుని... చిరునవ్వులను ముదలకించుకుని.. అన్యధా శరణం నాస్తి అని వారికి విన్నవించుకుని.. కొన్ని నిమిషముల పాటు సేవించుకుని తరించిన సువర్ణ ఘట్టమును అంతసులువుగా మరచిపోవడం కష్టం.

చంద్రబాబునాయుడు మోడీ తో గడిపింది కేవలం కొన్ని నిమిషాల వ్యవధి మాత్రమే.. కానీ బయటకు వచ్చి తాను  ప్రెస్ మీట్ పెట్టి.. సుదీర్ఘంగా గంటల తరబడి ఉపన్యసించారు. చూడబోతే చెప్పవలసిన చోట (లోపల) చెప్పింది తక్కువ..  రెండు ముక్కల్లో ముగించాల్సిన చోట (బయట) చెప్పింది ఎక్కువగా కనిపిస్తోంది. చూడబోతే.. తాను మోడీకి సమర్పించిన మొత్తం 17పేజీల పాఠాన్ని బయట మీడియాకు అప్పజెప్పి.. అదంతా మోడీ చెప్పినంతగా ఫీలయి భారం దించేసుకున్నారు. ఇంతా కలిపి ‘సీరియస్ గా పరిశీలించి న్యాయం చేస్తా అన్నారు’... ఇదొక్కటే మోడీ రెస్పాన్స్ గురించి చంద్రబాబు చెప్పిన వాక్యం.

ఒక్క ముక్కలో చెప్పలాంటే.. ఈ చంద్రభేటీ అనేది.. నరేంద్రమోడీ రెండేళ్ల కిందట అమరావతి శంకుస్థాపనకు వచ్చి.. మట్టీ నీళ్లూ మన మొహాన కొట్టి చేసిన అవమానం కంటె ఇది దొడ్డది.

కానీ ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఉంది. చంద్రబాబు తన ప్రెస్ మీట్ లో ఓ మాటను చాలా యథాలాపంగా ‘పాసింగ్ స్టేట్మెంట్’ లాగా అనేశారు. ఇప్పటికీ న్యాయం చేయకపోతే.. ఇక కోర్టును ఆశ్రయించడం తప్ప మాకు మార్గం లేదు అని ఆయన చెప్పారు.

ఇక్కడ మనం బద్రి సినిమాలో పవన్ డైలాగును గుర్తు చేసుకోవాలి. ‘‘మళ్లీ ఇదే రిపీటవుద్ది.. ముందు ఏం చేయాలో డిసైడ్ చేసుకో’’ అని !

చంద్రబాబునాయుడు కూడా కోర్టుకు వెళ్లక తప్పని పరిస్థితి వస్తుంది. కోర్టులో ఎలా న్యాయాన్ని పొందాలో ఇప్పటినుంచి నిపుణలతో మాట్లాడి చంద్రబాబు సిద్ధపడితే మంచిది. అలాగే.. ఎప్పటిదాకా కేంద్రం చేసే న్యాయం కోసం ఎదురుచూసి.. ఏ డెడ్ లైన్ తర్వాత కోర్టుకు వెళ్తారో కూడా తెలుగు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉంది.

అయినా ఇక్కడ మరో సంగతి కూడా ఆలోచించాలి.

ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మోసం చేసినప్పుడే చంద్రబాబు కోర్టు గడప తొక్కిఉంటే తప్పకుండా న్యాయం జరిగి ఉండేది. ఇప్పుడాయన ఈ రీతిగా మోడీ ని బతిమాలాల్సిన అవసంర ఉండేది కాదు. వ్యక్తుల దయాదాక్షిణ్యాల మీద ఒక రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడడం అనే దుర్మార్గపు పరిస్థితి వచ్చేది కాదు. ఆరోజే గనుక కోర్టుకువెళ్లి రాష్ట్రానికి ప్రత్యేకహోదానే దక్కి ఉండేదని.. పరిశ్రమల పరంగా నిధుల పరంగా రాష్ట్రం ఎంతో ఎడ్వాంటేజీలో ఉండేదని పలువురు అంటున్నారు. మరి బాబు గారికి ఈ వాదనలన్నీ వినిపిస్తాయో లేదో!!