Advertisement


Home > Politics - Gossip
గడ్కరీతో భలే డిమాండు పెట్టిన చంద్రబాబు!

‘తను తినను తవుడు లేదు గానీ... ప్రియురాలికి వడియాలు కావాలన్నాట్ట’ వెనకటికి ఓ పెద్దమనిషి! కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తానుగా పూనుకుని జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించడానికి వచ్చేసరికి.. చంద్రబాబునాయుడు ఆయన ముందు ఆచరణకు అనూహ్యమైన కోరికల చిట్టా విప్పారు. పోలవరం పనులు త్వరిగతిన జరగాలంటే.. ముందస్తుగానే నిధులు విడుదల చేయాలని ఆయన గడ్కరీని కోరారు.

పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు. 2014నుంచి ఈ ప్రాజెక్టుకు అయ్యే ప్రతిరూపాయి వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే చెల్లించాలి. అందుకు వారు కట్టుబడే ఉన్నారు. నిజానికి అది విభజన చట్టంలో ఉన్న విషయమే. కాకపోతే.. అదేదో తాము ఏపీ మీద ప్రత్యేకప్రేమతో, పోలవరం మీద ప్రత్యేకదయతో చేస్తున్నట్లుగా భాజపా సర్కారు బిల్డప్పులు ఇచ్చుకుంటోంది.

కాకపోతే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో నీతి ఆయోగ్ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పనుల నిర్వహణకు కన్సల్టెంటు పాత్ర పోషిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వమే పనులకు కాగల ఖర్చులు పెట్టి ఆ మొత్తాలను కేంద్రం నుంచి తర్వాత వసూలు చేసుకుంటోంది. నిజానికి ఇప్పటిదాకా రాష్ట్రం ఖర్చు పెట్టిన మొత్తాల్లోనే కేంద్రం నుంచి ఇంకా భారీ మొత్తాలు విడుదల కాకుండా పెండింగ్ లో ఉన్నాయి.

ఇదిలా ఉండగా.. పోలవరం పనుల అంచనాలు పెంచిన తర్వాత.. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు కేంద్రం నుంచి ఇంకా ఆమోదం లభించలేదు. వారు మాత్రం ‘మేం లేవనెత్తిన సందేహాలకు రాష్ట్రం నుంచి సమాధానాలు రానేలేదు’ అంటున్నారు. ఒకసారి ఆ అంచనాలకు ఆమోదం లభిస్తే తప్ప.. రాష్ట్రం పెట్టే ఖర్చులకు ఎప్పటికప్పుడు నిధులు విడుదల అవుతాయి.

తమాషా ఏంటంటే.. ముందుగా అలాంటి మొరటు సామెతను ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వచ్చిందంటే.. పెట్టేసిన ఖర్చులు ఇవ్వడానికే దిక్కులేదు. ఇప్పుడు చంద్రబాబు.. పోలవరం పనులకు ముందుగానే నిధులు ఇవ్వాలని అడుగుతుండడం చోద్యం కాక మరేమిటి? మేం వేగంగా పనులు పూర్తి చేయడానికి నిధులు అడిగినా కూడా ఇవ్వలేదు.. అని తాజా ధర్మపోరాట దీక్షల్లో కేంద్రం మీద కొత్త నిందలు వేయడానికే తప్ప... ఇలాంటి డిమాండు వల్ల మరో ప్రయోజనం లేదు.

బాబు డిమాండుకు గడ్కరీ చాలా తెలివిగా ఆర్థిక శాఖతో సంప్రదించి ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటాం అని చెప్పారు. ఆర్థిక శాఖ అంటే అరుణ్ జైట్లీ చేతిలోని వ్యవహారం. రాష్ట్రానికి ఇప్పుడు కేంద్రంనుంచి ఇంత ద్రోహం జరుగుతున్నదంటే.. అందులో అరుణ్ జైట్లీ పాత్రే ఎక్కువ అని అనేకమంది అంటూ ఉంటారు. మీరు అడిగినట్లుగా ఇవ్వడం మాకు సుతరామూ ఇష్టంలేదు.. అని చెప్పడానికి బదులుగా గడ్కరీ ఈ ఎపిసోడ్ ను అరుణ్ జైట్లీ కోర్టులోకి నెట్టివేసినట్లుగా అనుకోవాలేమో మరి.