cloudfront

Advertisement


Home > Politics - Gossip

తిరుమలలో బాబుకు షాక్!

తిరుమలలో బాబుకు షాక్!

తిరుమలేశుని బ్రహ్మోత్సవాల సందర్భంగా అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరువేంకటగిరినాధునికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించడానికి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పొలిటికల్ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ గైర్హాజరయ్యారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ.. తనకు స్థానికంగా.. కనీసం అధికార్లనుంచి కూడా గౌరవం దక్కడం లేదంటూ.. ఆమె అలకవహించారు. అందుకే చంద్రబాబు కార్యక్రమానికి ఆమె గైర్హాజరయ్యారు.

ప్రస్తుతం ఎన్నికలకు పార్టీని సిద్ధంచేసే తరుణంలో, తమ సొంత ఎమ్మెల్యే తన కార్యక్రమానికి కూడా హాజరుకాకపోవడం అనేది నిజంగానే చంద్రబాబుకు షాక్ అని చెప్పాలి. తిరుపతి నియోజకవర్గంలో ఇలాంటి అసమ్మతి అనేది చంద్రబాబు ఊహించినది కాకపోవచ్చు. అందుకే ఆయన కంగారు పడినట్లే కనిపిస్తోంది. సుగుణమ్మ ఎందుకు రాలేదో ఆరాతీసి తెలుసుకోవాలని, సమస్యను పరిష్కరించాలని చంద్రబాబునాయుడు, మంత్రి అమరనాధ రెడ్డిని ఆదేశించారు.

సుగుణమ్మ చాలాకాలంగా పార్టీ తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వడంలేదంటూ.. ఆవేదన చెందుతున్నారు. స్థానికంగా అధికారులు కూడా పట్టించుకోవడం లేదనేది ఆమె ఆరోపణ. తిరుమల తిరుపతి దేవస్థానాల అధికారులు కూడా బ్రహ్మోత్సవాల సందర్భంగా కార్యక్రమానికి వెళ్లినప్పుడు కనీసం ప్రోటోకాల్ ను కూడా పట్టించుకోకుండా.. తనపట్ల అనుచితంగా ప్రవర్తించారనేది సుగుణమ్మ కంప్లయింట్.

గతంలో ఎమ్మెల్యేగా ఉన్న వెంకటరమణ హఠాన్మరణంతో జరిగిన ఉపఎన్నికలో ఎమ్మెల్యే అయిన ఆయన భార్య సుగుణమ్మ అప్పటినుంచి పార్టీకి విధేయంగానే ఉన్నారు. కానీ.. సొంత నియోజకవర్గంలో తన అస్తిత్వానికే ఇబ్బంది కలిగేలాగా అధికారులు ప్రవర్తించడంతో.. ఆమె ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబునాయుడు మాత్రం.. ఈ అసంతృప్తిని చక్కదిద్దే పనిలో ఉన్నారు.

పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికలకు సిద్ధమవుతుండగా.. ఏ ఒక్క నాయకుడు ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లుగా కనిపిస్తోంది. మరి తిరుపతి షాక్ పరిణామాలు ఎలా మలుపులు తిరుగుతాయో ఏమో?