cloudfront

Advertisement


Home > Politics - Gossip

ఆ మాట సహించలేకపోతున్న చంద్రబాబు!

ఆ మాట సహించలేకపోతున్న చంద్రబాబు!

చంద్రబాబునాయుడు పరిస్థితి ఇప్పుడు ఇరకాటంలో పడినట్లుగా మారింది. ఇన్నాళ్లూ ఆయన ఏ ఊరికి వెళ్లినా, ఏ వేదిక ఎక్కినా ఒక్కరిని విమర్శిస్తే సరిపోయేది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కడూ దుర్మార్గుడు దుష్టుడు అవినీతి పరుడు అనేసి చేతులు దులుపుకునేవాళ్లు. ఇప్పుడు ఆయన తిట్టిపోయవలసిన వారి జాబితా పెరిగిపోయింది.

జగన్ తోపాటు, పవన్ కల్యాణ్ ను, కొత్తగా కన్నా లక్ష్మీనారాయణను కూడా తూర్పారపట్టవలసిన పరిస్థితి. ఇలా ముగ్గురు ప్రత్యర్థుల మీద బురద చల్లాల్సి వస్తుండడంతో.. చంద్రబాబుకు పాపం, సొంత డప్పు కొట్టుకోడానికి సమయం చాలడం లేదు. వారిని విమర్శించడానికే ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి వస్తున్నట్టుంది.

నిజానికి భాజపా అధ్యక్ష బాధ్యతల్లోకి వచ్చిన వెంటనే.. ఢిల్లీలో పెట్టిన ప్రెస్ మీట్ లోనే కన్నా లక్ష్మీనారాయణ అన్న మాటలను చంద్రబాబు నాయుడు సహించలేకపోతున్నట్లుగా కనిపిస్తోంది. ‘ప్రత్యేకహోదా కోసం తొలినుంచి పోరాడుతున్న వ్యక్తి ఒక్క జగన్ మాత్రమే’ అని కన్నా చెప్పిన సంగతి అందరికీ గుర్తుండొచ్చు. కానీ, ఆ మాటను చంద్రబాబు సహించలేకపోతున్నారు. అలా అన్నందుకు జగన్ ను – కన్నాను జమిలిగా తిట్టడానికి పూనుకుంటున్నారు.

అయినా కన్నా చెప్పిన మాటల్లో అబద్ధం ఏముందో అర్థం కావడం లేదు. ప్రత్యేకప్యాకేజీకి ఒప్పుకోవడానికి ముందు అయినా సరే.. హోదా గురించి కేంద్రంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎన్నడైనా డిమాండ్ చేసిందా? పోరాడిందా? ప్రయత్నించిందా? అంటే శూన్యం. హోదా రాదనే సంగతి 2015లోనే తేలిపోయింది అంటున్నారు.. కనీసం 2014లో అయినా సరే.. హోదా గురించి వారు ఎన్నడైనా నోరు మెదిపారా? అంటే లేదనే సమాధానమే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి మాత్రం తొలినుంచి పోరాడుతూనే ఉన్నారు.

ఈ బడ్జెట్ సమావేశాల్లో కూడా మొండిచెయ్యి చూపించాకే.. చంద్రబాబు హోదా పాటెత్తుకున్నారనే సంగతి అందరికీ తెలుసు. ప్రత్యేక ప్యాకేజీ కింద చెప్పిన నిధులను ఇవ్వడానికి స్పెషల్ పర్పస్ వెహికిల్ ఉండాలని అన్నందుకే చంద్రబాబు దానిని తిరస్కరించి, తిరిగి హోదా కోసం పోరాడుతున్నా అనే కలర్ ఇస్తున్నారనేది కూడా అందరికీ తెలుసు. హోదా అనేది ఆయన ఎన్నికల ప్రచారానికి ఓ ట్రంప్ కార్డ్ లాగా వాడుతున్నారు. చివరికి పవన్ కల్యాణ్ కూడా... హోదా అనేదానిని అవసరార్థం వాడుకునే అంశంగానే చూస్తున్నారు.

ఇలా ప్రధాన పార్టీలతో బేరీజు వేసి చూసినప్పుడు.. హోదా కోసం తొలినుంచి పాటుపడుతున్నది ఒక్క జగన్ మాత్రమే అనడంలో ఎంతమాత్రమూ సందేహం లేదని తెలుస్తుంది. మరి చంద్రబాబు కన్నా మాటలకు ఎందుకు కంగారు పడుతున్నారో... అందరికీ తెలిసిన సంగతే.