Advertisement


Home > Politics - Gossip
పవన్ పై ఈగ వాలితే ఊరుకోడంతే...

ఒక సినిమా హీరో.. మహా అయితే ఆయన ఒక రాజకీయ పార్టీని కూడా ప్రకటించి ఉండవచ్చు గాక..  అంతకంటె మహా అయితే.. గత ఎన్నికల సమయంలో అధికారం దక్కడానికి కీలకంగా ఉపయోగపడి ఉండవచ్చు గాక.. కానీ ఆయన హైదరాబాదునుంచి తనను కలవడానికి విజయవాడకు వస్తోంటే.. ప్రోటోకాల్ మర్యాదల్లాగా వెంటఉండి గౌరవప్రదంగా స్వాగతించి తీసుకురావడానికి ప్రత్యేకంగా ఒక మంత్రిని పురమాయించడమూ... ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడమూ జరిగినప్పుడు ప్రజలు దాన్ని గురించి పెద్దగా పట్టించుకోలేదు....

ఇంకా బొడ్డూడని ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఒక సామాజిక సమస్య గురించి ముఖ్యమంత్రితో చర్చించడానికి సచివాలయంలోని కార్యాలయానికి వచ్చినప్పుడు.. ఏదో అమెరికా అధ్యక్షుడు వచ్చిన స్థాయిలో ఎయిర్ పోర్టు నంచి రోడ్ల పొడవునా భయంకరమైన బందోబస్తు ఏర్పాటుచేసి, ఆయన ఆగమన వేళలో సచివాలయ ప్రాంగణంలో ఉద్యోగులు కూడా స్వేచ్ఛగా తిరగకుండా.. ఆంక్షలు విధించి.. అతి మర్యాదలు ప్రదర్శించినప్పుడు ప్రజలు కొంతవరకు నివ్వెరపోయారు!!
అయితే నిజానికి అంతకంటె ఎక్కువే చంద్రప్రేమ తాండవిస్తోంది. 

ఈ ఉపోద్ఘాతం మొత్తం ఎవ్వరి గురించో పాఠకులకు ఈసరికి అర్థమైపోయి ఉండాలి. అవును.. సినీ హీరో పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నెత్తిన పెట్టుకుంటున్న తీరు గురించే!

పైన చెప్పుకున్నవన్నీ ఒక ఎత్తు అయితే.. తాజా పరిణామాల్ని గమనించినప్పుడు చంద్రబాబు తీరు ఇంకా ఆశ్చర్యం కలిగిస్తోంది. పవన్ కల్యాణ్ మాత్రం తన ప్రసంగాల్లో తెలుగుదేశం ఎంపీల గురించి మంత్రుల గురించి ఎడా పెడా సెటైర్లు వేస్తూ.. సినిమా ఫక్కీలో కామెడీ చేస్తుంటారు. వెటకారాలు చేస్తుంటారు. చంద్రబాబునాయుడును మాత్రం పల్లెత్తు మాట అనరు.

చంద్రబాబు కూడా ఒక లీడర్ లాగా కాకుండా.. ఒక సామాన్య వ్యక్తి లాగా.. తనను ఏమీ అనకుండా ఉంటే చాలు.. తన పార్టీ సహచరుల్ని ఎన్ని రకాలుగా తిడితే మాత్రం నాకేముంది.. అన్నట్లుగానే ఇన్నాళ్లూ పట్టించుకోలేదు. అదే సమయంలో పార్టీ నాయకులు ఎవరికి వారు పవన్ కల్యాణ్ కు రిటార్టు ఇవ్వడానికి (అదికూడా సుతిమెత్తగా) ప్రయత్నిస్తే మాత్రం చంద్రబాబు ఆగ్రహోదగ్రులవుతున్నారు. పవన్ మీద సెటైర్లు వేసినందుకు, కామెంట్లు చేసినందుకు .. అలాంటి తీరు తగదంటూ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజును, రాష్ట్ర మంత్రి పితానిని మందలించినట్లు కొన్ని రోజుల కిందట వార్తలు వచ్చాయి. 

అయితే మంత్రి పితాని సత్యనారాయణకు మంగళవారం నాటి పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో.. ఇంకాస్త గట్టిగానే అక్షింతలు పడినట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో పవన్ మీద పితాని కామెంట్ల సంగతి చర్చకు వచ్చిందిట. దాంతో చంద్రబాబు సీరియస్ గానే.. పవన్ మీద కామెంట్ల విషయంలో పార్టీ నాయకులు అదుపు పాటించాలని.. ఎవరికి తోచినట్లు వారు మాట్లాడడం కరెక్టు కాదని పితానిని మందలించారట.

మొన్నటితో ఈ ఎపిసోడ్ అయిపోయిందని అనుకుంటే.. తాజాగా మళ్లీ ముఖం మీదనే, అందరి ఎదుట మంత్రిని పవన్ కల్యాణ్ కు రిటార్టు ఇచ్చినందుకు మందలించడాన్ని పార్టీ సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. అటు పవన్ తో తమతో స్నేహబంధానికి విలువ ఇస్తున్నాడో లేదో కనిపించడం లేదు గానీ.. చంద్రబాబు మాత్రం పవన్ మీద ఈగ వాలినా సహించేలా లేడని అనుకుంటున్నారు.