cloudfront

Advertisement


Home > Politics - Gossip

భాజపాకు చెక్: ఓడినా గద్దెమీదనే కాంగ్రెస్!

భాజపాకు చెక్: ఓడినా గద్దెమీదనే కాంగ్రెస్!

కాంగ్రెస్ పార్టీ తమ వ్యూహ నైపుణ్యాన్ని బయటకు తీస్తున్నది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీకి మాత్రం గద్దె ఎక్కే అవకాశం ఇవ్వకుండా అడ్డుకుంటున్నది. ఎటూ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు గనుక.. తాము రెండో స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది గనుక.. ఇప్పుడు వారు చక్రం తిప్పుతున్నారు. తాము సెకండ్ పొజిషన్ లో ఉన్నప్పటికీ.. అధికారం మాత్రం తమ చేతినుంచి జారిపోకుండా చూసుకుంటున్నారు. అందుకోసం జేడీఎస్ కు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది.

దేవెగౌడ కుమారుడు కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసి... సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి రంగం సిద్ధంచేసింది. గవర్నర్ ను కలిసి ఈ మేరకు తమను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరబోతున్నారు. మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ ఒక వాదన లేవనెత్తుతూ వచ్చింది. కర్నాటక గవర్నర్ నిజాయితీగా వ్యవహరించేట్లయితే గనుక.. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన వారినే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తొలుతగా ఆహ్వానించాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చింది.

అప్పటికి వారికి తామే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తాం అనే నమ్మకం ఉండేది. కానీ ఫలితాల వెల్లడితో అంతా తారుమారు అయింది. భాజపా మెజారిటీ సీట్లు సాధిస్తూ వంద మార్కును క్రాస్ చేసినా.. క్లియర్ మెజారిటీకి కొన్నిసీట్ల దూరంలో ఆగిపోయినట్టే అనుకోవాలి. ఇలాంటి నేపథ్యంలో వారు అధికారంలోకి వచ్చే అవకాశం లేకుండా చేయడానికి కాంగ్రెస్ ఓ మెట్టుదిగింది.

బెంగుళూరులో వ్యూహరచన చేస్తున్న కాంగ్రెస్ పెద్దలు, హుటాహుటిన అధిష్టానాన్ని సంప్రదించి.. తుది నిర్ణయం తీసుకుని జేడీఎస్ నుంచి ఎవరు సీఎం అయినా పర్లేదని, తాము సంపూర్ణమైన మద్దతు అందిస్తాం అని ప్రకటించేశారు. ఈ మేరకు ఢిల్లీనుంచి వచ్చిన వారు దేవెగౌడతోను, కుమారస్వామితో కూడా మాట్లాడారు.

వారిద్దరూ తమ ప్రతిపాదనకు ఒప్పుకున్నట్లుగానే చెబుతున్నారు. అయితే సింగిల్ లార్జెస్ట్ ను తొలుత ఆహ్వానించాలనే డిమాండ్ ను కాంగ్రెస్ చాలా కన్వీనియెంట్ గా పక్కన పెట్టేసింది గానీ.. గవర్నర్ ఆ సాంప్రదాయాన్నే పాటించదలచుకుంటే ఏం చేస్తారో మాత్రం అర్థంకావడం లేదు.