cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Gossip

చిన్న మెదడు చిట్లిపోయిందేమో?

చిన్న మెదడు చిట్లిపోయిందేమో?

ఎవడు కొడితే దిమ్మ దిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుందో అనే సినిమా డైలాగు ఒకటి వుంది. ఇది సినిమా డైలాగే కానీ ఒక్కోసారి ఇది నిజంగానే జరిగే అవకాశమూ వుంటుంది. ఇప్పటి వరకు ఆంధ్రను పాలించిన సిఎమ్ లు ఒక లెక్క..జగన్ ఒక్కడూ ఒకలెక్క. ఎందుకంటే ఎవరు సిమ్ అయినా 'మన సామాజిక వర్గం' ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగింది. 

నాలుగు డబ్బులు పడేస్తే ఏ ప్రభుత్వంలో అయినా 'మన' పనులు, 'మన' ప్రయోజనాలు, 'మన' వ్యాపారాలు, 'మన' అక్రమాలు, 'మన' సంపాదనలు అన్నీ సజావుగా సాగిపోయేవి. అలా ఎవరైనా సాగనివ్వకపోతే, అన్ని రకాల మీడియాల్లో, వ్యవస్థల్లో ఊడలమర్రిల మాదిరిగా పాతుకుపోయిన 'మన' వాళ్లు నిద్రలేచేవాళ్లు. అలాంటి ప్రభుత్వం లేదా సిఎమ్ గద్దె దిగేదాకా నిద్రపోయేవారు కాదు.

జగన్ మొండివాడు

కానీ ఈ జగన్ అనే సిఎమ్ ఉన్నాడేం..మహా మొండివాడు. 'మన' వాళ్ల వ్యవహారాలను కాచి వడపోసేసాడు. వండి వార్చేసాడు. 'మన' వాళ్లను ఎక్కడ వుంచాలో అక్కడ వుంచుతున్నాడు. 'మన' వ్యాపారాల కిటుకులు, 'మన' అక్రమాల మూలాలు తెలిసిన వాడు. 

ఎక్కడ కొడితే 'మనం' గిలగిలలాడతామో తెలుసుకున్నవాడు. అన్నింటికి మించి 'మన' వల్ల దారుణంగా దెబ్బతిన్నవాడు. దెబ్బతిన్న పులి శ్వాస నుంచి వచ్చే వేడి ఏమిటో ఇప్పుడు 'మన'కు రుచి చూపిస్తున్నాయి.

అందుకే 'మన'కు మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఏం చేయాలో కాదు, ఏ మాట్లాడుతున్నామో కాదు, ఆఖరికి ఏం రాస్తున్నామో కూడా అర్థం కావడం లేదు. 'మన'మే ఇలా అంటున్నాం..'మన'మే అలా అంటున్నాం

ప్రచారంలో ఘనాపాఠీలు

''...‘నిజం చెప్పులు వేసుకుని బయల్దేరే లోపే అబద్ధం ఊరంతా తిరిగొస్తుంది..'' ఈ మాట కొత్తది కాదు. ఈ మాటను ఈ వారం మాట మెలితిప్పడంలో ఘనత వహించిన సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఆర్కే తన కొత్త పలుకులో మరోసారి ఉద్ఘాటించారు. కానీ ఆయన ఈ మాటలు చెబుతుంటే పులి శాకాహారం గురించి మాట్లాడుతున్నట్లు వుంది. దశాబ్దాల కాలంగా 'మన' తెలుగు మీడియా చేస్తున్నదే ఇది. నిజాన్ని చెప్పులు కూడా వేసుకోనివ్వకపోవడం. 

అబద్దాని ఊరంతా కాదు, ప్రపంచం అంతా చుట్టేలా చేయడం. లేదూ అంటే నాదెండ్ల అప్పట్లో ఎన్టీఆర్ ను గద్దె దింపితే వెన్నుపోటు అయింది, చంద్రబాబు దింపితే పార్టీ కళ్యాణం కోసం అన్నట్లు అయిపోయింది. ఇలాంటి యవ్వారాలు చాలా అంటే చాలా వున్నాయి. చంద్రబాబు తింటే ఫలహారం. వేరే వాళ్లు తింటే చిరుతిళ్లు అనే టైపు ఇవన్నీ. సుద్దులు అన్నీ ఇతరులకు, మెప్పుకోలు చంద్రబాబుకు అన్నదే 'మన' మీడియావైఖరి. 

ఈవారం ప్రవచనం

ఇంతకీ ఈవారం ఆర్కే ఏం ప్రవచించారు చూద్దాం.

''...ఉపఎన్నికలో బీజేపీకి ఆర్థిక సహాయం చేయడానికి కూడా ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి అంగీకరించినట్లు చెబుతున్నారు..'' ఈ ఒక్క లైన్ చాలు పలుకు మొత్తం ఎలావుందో అర్థమైపోయి, రెండు చేతులు జేబులో పెట్టుకుని అలా అలా వెళ్లిపోవడానికి.

రాజకీయాల్లో త్రిముఖపోటీ బెటర్ నో, ముఖాముఖీ పోటీ బెటర్ నో అన్నది అందరికీ తెలిసిందే. చిరంజీవి పార్టీ పెట్టినపుడు, పవన్ కళ్యాణ్ పార్టీ ఒంటరిగా పోటీ చేసినపుడు ఆ త్రిముఖ పోటీలో ఎవరు దెబ్బతిన్నారో, ఎవరు లాభపడ్డారో అందరికీ తెలిసిందే. 

తెలుగుదేశం పార్టీ పెట్టింది ఆదిగా, కాంగ్రెస్ పార్టీని ఢీకొనడానికి వీలుగా మిగిలిన పార్టీలు అన్నింటిని తనవైపు తెలుగుదేశం ఎలా తిప్పుకున్నదీ కూడా తెలిసిన విషయమే. 2014లో భాజపా, జనసేన విడిగా పోటీ చేసి వుంటే ఈ పాటికి బాబుగారు ఎలా వుండేవారో కూడా అర్థం అవుతుంది. మరి ఇలా సదా, ముఖాముఖి పోటీకి అంగలార్చేది చంద్రబాబు, ఆయన తెలుగుదేశం.

వైఎస్సార్ కానీ, వైకాపా కానీ ముక్కోణపు పోటీలోనే గెల్చుకుని వచ్చాయి. మరి ఆ పార్టీ ఎందుకు ముఖాముఖీ పోటీ వుండాలి అని కోరుకుంటుంది? ఇది ఓ ప్రశ్న. తెలంగాణలో కేసిఆర్ ఏం చేసారు. కాంగ్రెస్ ను లేకుండా చేసి, భాజపా అనే కత్తిని తన పీకల మీదకు తెచ్చుకున్నారు. 

ఆది అందరూ చూసారు. జగన్ కూడా చూసారు.. అది చూసుకూడా తెలుగుదేశం లేకుండా ఎందుకు చేయాలనుకుంటారు? పోనీ అలా అనుకున్నారే అనుకుందాం. దానికి భాజపా కావాలా? అందుకోసం భాజపాను బలమైన శతృవుగా తయారుచేయాలా?

తెలుగుదేశం జనాలను తన పార్టీలోకి లాగేసుకోవాలంటే పెద్ద కష్టం ఏమీ కాదు. వైఎస్సార్, కేసిఆర్, చంద్రబాబు ఇదే పని చేసారు. జగన్ కూడా చేస్తే తెలుగుదేశం వీక్ అయిపోతుంది. భాజపా ఎలాగూ ప్రస్తుతం వీక్ గానే వుంది. ఇది మానేసి, ఇలా చేయడం వదిలేసి, తెలుగుదేశాన్ని వీక్ చేసి, ఆ బలాన్ని భాజపాకు అందించాలని మెడమీద తలకాయ వున్న రాజకీయ నాయకుడు ఎవరైనా అనుకుంటారా?

మరి ఎందుకు 'మన' ఆర్కే ఇలా రాస్తున్నారు? ఆయన సీనియర్ జర్నలిస్ట్ కదా? ఆ మాత్రం తెలియదా?

అంతరార్థం..అయోమం 

ఈవారం కొత్తపలుకు అంతరార్ధం అంతా ఒక్కటే. కేసిఆర్...జగన్, భాజపా అంతా ఒక్కటై చంద్రబాబును ఆయన పార్టీని అణగదొక్కేయాలని అనుకుంటున్నారు. అనే సానుభూతి ని ముందుగానే తిరుపతి ఓటర్లలో జనరేట్ చేయడం అన్నది ఒక్కటే సింగిల్ పాయింట్ అజెండా. ఇది కోసం ఏదోదో రాయాల్సి వస్తోంది. ఆ రాత అంతా ఎవరో ఖండించాల్సిన పని కూడా లేదు. దానికి అదే ఖండిస్తుంది. కావాలంటే చూడండి.

ఈవారం కొత్త పలుకు మొత్తం మనమే ఎస్ అనడం, మళ్లీ మనమే నో అనడం టైపులో కొనసాగింది. ఉపఎన్నికలో అధికారపక్షం గెలుపు పెద్ద గెలుపు కాదనీ మనమే అంటాం, కాదనీ మనమే అంటాం. భాజపాకు డబ్బులు కూడా మనమే పెడతాం అంటాం..అలా చేసి కేసిఆర్ దెబ్బయిపోయారు అంటాం. అయినా కూడా చంద్రబాబు మీద కోపంతో జగన్ అలాగే చేస్తారనీ అంటాం. 

అమరావతి, పోలవరం విషయాల్లో జగన్ విఫలం అయ్యాడనీ అంటాం...కానీ అలా అని వాటిని జనం పట్టించుకోవడం లేదనీ మనమే బాధపడతాం. డబ్బులు జల్లేసి, రాష్ట్రాన్ని గుల్ల చేస్తున్నాడనీ అంటాం. ఈ చేత్తో డబ్బులు ఇచ్చి ప్రభుత్వం ఆ చేత్తో లాగేస్తోందనీ మనమే అంటాం. డబ్బులు జల్లేసి ఓటు బ్యాంకు పెంచుకుంటున్నాడనీ మనమే అంటాం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు పెరిగిపోతోందనీ మనమే అంటాం.

చెప్పేవాళ్లు  ఎవరు?

జగన్ చేస్తున్న తప్పులు, చెబుతున్న అబద్దాలు విడమర్చి చెప్పేవాళ్లు లేరూ అంటూ బాధపడుతున్నారు ఆర్కే. ఎలా వుంటారు? ఎవరినన్నా ఎదగనిస్తే కదా? మేధావులు అంతా 'మన'వాళ్లే. రాజకీయ పార్టీ నేతలు 'మన'వాళ్లే..మీడియా 'మన'దే. సినిమా 'మన'దే. పరిశ్రమలు, కాంట్రాక్టులు, వ్యాపారాలు 'మన'. 

అమరావతి ఉద్యమ కీలకనేతలు 'మన'వాళ్లే. మరి 'మన' వాళ్ల గురించి 'మన' బాధల గురించి 'మన'మే చెబితే ఎవరు నమ్ముతారు. 'మన' వాళ్లు కానీ ఉండవల్లి, సబ్బం హరి లాంటి వాళ్లు చెప్పాలి. అలాంటి వాళ్లు 'మన'వాళ్లు కాని వాళ్లు 'మన' ఉచ్చులో పడగలిగిన వాళ్లు ఏరీ? ఎక్కడ?...అదే బాధ..అదే వ్యథ. పాపం ఈ 'మన'వ్యధకు మందు లేదు. జగన్ కొట్టిన, కొడుతున్న దెబ్బలు అలాంటవి మరి.నయం కావడం కష్టమే.

ఆర్వీ

 


×