cloudfront

Advertisement


Home > Politics - Gossip

చక్రం తిప్పింది చిన్నమ్మే?

చక్రం తిప్పింది చిన్నమ్మే?

కన్నా లక్ష్మీనారాయణను పదవి వరించడం అనేది భాజపాలో ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. అయితే పార్టీలో ఇంత అసంతృప్తికి, తిరుగుబాట్లకు కారణమయ్యే నిర్ణయానికి అధిష్టానం రావడం వెనుక.. కన్నాకు పదవి దక్కేలా చక్రం తిప్పినది మాత్రం చిన్నమ్మగా పేరున్న దగ్గుబాటి పురందేశ్వరి అని విశ్వసనీయంగా తెలుస్తోంది. భాజపా కొత్త అధ్యక్షుడి వేటలో కాపు సామాజిక వర్గానికి చెందిన నాలుగైదు పేర్లను పరిశీలిస్తున్న సమయంలోనే... కన్నా లక్ష్మీనారాయణకు అనుకూలంగా పురందేశ్వరి పావులు కదిపినట్లుగా బయటకు పొక్కింది.

అయితే... అప్పట్లో చంద్రబాబు మీద ఎదురుదాడికి సమర్థుడు కావడం ఒక్కటే ప్రాతిపదికగా భావిస్తూ ఉన్న పార్టీ నాయకత్వం సోమువీర్రాజు వైపు మొగ్గుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ.. నిర్ణయం వెలువడే చివరి క్షణాల్లో దగ్గుబాటి పురందేశ్వరి చక్రంతిప్పారు. సోము వైపు మళ్లుతున్న పవనాలను ఆమె చాలా చక్కగా కన్నా వైపు మళ్లించినట్లుగా చెప్పుకుంటున్నారు. దగ్గుబాటి పురందేశ్వరి గత సార్వత్రిక ఎన్నికలలో రాజంపేట నుంచి భాజపా తరఫున పోటీచేసి ఓడిపోయారు.

ఈసారి ఆ నియోజకవర్గం వద్దని, తనకు అంతో ఇంతో పట్టున్న ఆంధ్రాప్రాంతం నుంచే పోటీచేయాలని అనుకుంటున్నట్లు సమాచారం ఉంది. ఆ ప్రాంతం నుంచి బరిలోకి దిగేట్లయితే తనకు సహకరించగలరనే నమ్మకంతో ఆమె కన్నా లక్ష్మీనారాయణ నాయకత్వాన్ని వెనకేసుకు వస్తున్నారు. పురందేశ్వరి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఆమె బలం, స్థాయి సంగతి ఎలా ఉన్నప్పటికీ.. కేంద్రంలో మాత్రం చాలా బలంగానే ఉండేవారు.

హస్తిన రాజకీయాలను చక్కబెట్టడంలో, ఢిల్లీ సర్కార్ లో కీలకంగా వెలగడంలో ఆమెకు సొంత శైలి ఉంది. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఢిల్లీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకున్న తరహాలోనే.. పురందేశ్వరి.. భాజపాలోకి వచ్చిన తర్వాత కూడా.. అంతిమంగా తనమాట నెగ్గేలా చేసుకోగలుగుతున్నారనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి కన్నాకు పదవితో రాష్ట్ర భాజపా రెండు ముక్కలుగా చీలిపోయినట్లు కనిపిస్తోంది.

సోమవారం నాడు అమిత్ షా ఢిల్లీలో నిర్వహించిన పదాధికారుల, పార్టీ అధ్యక్షుల, కీలక నాయకుల సమావేశానికి ఏపీనుంచి కన్నా, పురందేశ్వరి మాత్రమే హాజరయ్యారు. కనీసం జాతీయ కార్యవర్గ సభ్యుడు కంభంపాటి హరిబాబు కూడా వెళ్లలేదు. అసలే ఠికానా లేకుండా మారిపోయిన పార్టీ, అదనంగా ముక్కలు కావడానికి పురందేశ్వరి తన వంతు కృషి చేశారనే విమర్శలు వస్తున్నాయి. మరి వీటిని ఆమె ఎలా నెగ్గుకురాగలరో.. పార్టీకి వైభవస్థితి ఎలా తేగలరో చూడాలి.