Advertisement


Home > Politics - Gossip
కామెడీ : రాళ్లు పడలేదంటే... నోట్ల రద్దు సక్సెస్సే!

ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అమెరికా యూనివర్సిటీలో ఒక సరికొత్త కామెడీ డైలాగుల్ని సంధించారు. అదేంటో గానీ.. అమెరికా యూనివర్సిటీలలో ప్రసంగించడానికి వెళితే  ప్రతినేతకూ ఏదో ఒక కామెడీ చేయాలని అనిపించే లాగా కనిపిస్తోంది. తాజాగా అరుణ్ జైట్లీ చెబుతున్న కామెడీ డైలాగులు ఏంటో తెలుసా...? కొన్నాళ్లుగా కాశ్మీర్ లో ఆందోళన కారులు రాళ్లు రువ్వడం వంటి సంఘటనలు తగ్గిపోయాయిట. అంటే దాని అర్థం తీవ్రవాదం, ఉగ్రవాదం తగ్గిపోయినట్లేనట. అంటే దానికి మూల కారణం.. ఉగ్రవాదులకు సరిగా డబ్బు అందడం లేదుట. అందుకు అంతకంటె మూల కారణం.. తాము చేపట్టిన నోట్లరద్దు వల్లనేనట!!

చూశారా... ముడిపెట్టడం చేతనైతే బోడిగుండుకీ మోకాలికీ మాత్రమే కాదు... బోడిగుండుకీ బొటనవేలికీ కూడా ముడిపెట్టి చోద్యం చూడగల తెలివితేటల్ని అరుణ్ జైట్లీ ప్రదర్శిస్తున్నారు. నోట్లరద్దు అనే వ్యవహారం ఈదేశంలో ప్రజల జీవనాన్ని అతలాకుతలం చేసేసిందని.. ఏడాది గడుస్తున్నప్పటికీ.. ఇప్పటికీ జనజీవితం గాడిలో పడలేకపోతున్నదనేది వాస్తవం.

ఈ చేదు వైఫల్యాన్ని ఒప్పుకోవడానికి, ప్రజల ముందు లెంపలు వేసుకోవడానికి ప్రభుత్వానికి అహంకారం అడ్డువస్తోంది. పదేపదే నోట్లరద్దు అనేది అద్భుతం అని, దీనిని ప్రజలు ఆమోదించారు.. అని టముకు వేసుకోవడం ద్వారా ఆ అసత్యాన్ని అందరూ నమ్మేలా చేయడానికి మోడీ సర్కారు నానా తపన పడుతోంది. అరుణ్ జైట్లీ మాటల్లో కూడా అదే యావ కనిపిస్తోంది. 

నోట్లరద్దు ద్వారా సామాన్యుల జీవితాలను గందరగోళంలోకి నెట్టేసిన మోడీ సర్కారు.. వారికి గతిలేని స్థితిలో ఆన్ లైన్, డిజిటల్ లావాదేవీలు జరిగే పరిస్థితి కల్పించింది. అయిదే ప్రజలు ఆ దిశగా ఎన్నిపాట్లు పడుతున్నా పట్టించుకోకుండా, ఆలావాదేవీలు పెరగడానికి వారికి ఎలాంటి మినహాయింపులు, వెసులుబాట్లు కల్పించకుండానే... వాళ్లంతా ఎగబడి డిజిటల్ లావాదేవీకు మొగ్గుతున్నట్లుగా బిల్డప్ ఇచ్చుకుంటోంది.

ఈ విషయంలో ప్రభుత్వం కనీసం చంద్రబాబునాయుడు కమిటీ చేసిన డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహకాల గురించి కూడా పట్టించుకోకపోవడం.. ఆర్థిక లావాదేవీలు అంటేనే మధ్య తరగతి ప్రజలు భయపడే వాతావరణాన్ని తొలగించకపోవడం ఘోరం. అయినప్పటికీ.. ఆర్థికమంత్రి అమెరికాలో బర్కెలీ ఇండియా సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ ఇలాంటి అర్థసత్యాల ప్రచారం చేశారు. 

మరోవైపు రెండేసి లక్షల రూపాయల వరకు నగలు, బంగారం కొనుగోళ్లకు సంబంధించి డిజిటల్ లావాదేవీ అనేదానిని తప్పనిసరి చేయకుండా, కనీసం ఆధారాలు పాన్ ఉంటేనే లావాదేవీ జరగాలనే నిబంధనను కూడా సడలించేసి.. మోడీ సర్కారు కూడా నల్ల కుబేరులకు రాచమార్గం వేస్తోందనే ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. సామాన్యుడి ప్రతి రూపాయి ఖర్చూ రాబడీ ప్రభుత్వం కళ్లలో పడుతోంది గానీ.. ఎంచక్కా దొంగడబ్బుతో బంగారం కొనుక్కుంటే.. ఎక్కడా సర్కారు వారి రికార్డుల్లోకి ఎక్కాల్సిన అవసరం లేకుండా చేయడాన్ని అరాచకం కాక ఏమనాలి? మరి విదేశీ గడ్డమీద ప్రసంగాల్లో ఇలాంటి వైఫల్యాలన్నిటికీ అరుణ్ జైట్లీ ఎలాంటి ముసుగు వేసి మాట్లాడతారో వేచిచూడాలి.