cloudfront

Advertisement


Home > Politics - Gossip

రెండు తెలుగు రాష్ట్రాలకు అభినందనలు!

రెండు తెలుగు రాష్ట్రాలకు అభినందనలు!

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే కేటగిరీలో దేశంలోని రాష్ట్రాలకు ప్రకటించిన ర్యాంకుల్లో ఈసారి ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. కేవలం 0.09 శాతం మార్కుల తేడాతో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. కాకపోతే ఈ ఏడాది.. ర్యాంకులు ప్రకటించే ఈ విభాగానికి పేరుమారింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని కాకుండా.. ‘స్టేట్ బిజినెస్ రిఫార్మ్స్ అసెస్ మెంట్’ అని పేరు పెట్టారు.

మొత్తానికి దేశంలోనే పారిశ్రామికీకరణ విషయంలో ఎక్కువగా పేరు వినిపించే రాష్ట్రాలు హరియాణా, గుజరాత్ లాంటివి కాగా, తెలుగురాష్ట్రం విడిపోయిన తర్వాత.. రెండు రాష్ట్రాలూ ఆ రేసులో ముందంజలోనే ఉండడం ప్రత్యేకంగా అభినందించదగిన విషయం. గత ఏడాది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలూ రెండూ మొదటిస్థానంలోనే నిలిచాయి. ఈసారి 0.09 శాతం స్కోరు తేడాతో తెలంగాణ రెండోస్థానానికి పరిమితం అయింది. మొత్తంగా ఏపీకి 98.42 శాతం మార్కులు రాగా, తెలంగాణకు 98.33 వచ్చాయి. ఇది శుభ పరిణామమే. ప్రపంచ బ్యాంకు డైరెక్టర్ జునాయిద్ ఆంధ్రప్రదేశ్ పనితీరుకు కితాబులివ్వడం కూడా గమనించాల్సిన విషయం.

సంస్కరణలు అమలు చేసే విషయంలో తెలంగాణతో పాటూ ఝార్ఖండ్ కూడా వంద శాతం మార్కులు సాధించడం విశేషం. నిజానికి ఈ విషయంలో ఏపీ కాస్త వెనుకబడినా ఫీడ్ బ్యాక్ లో కవర్ చేసేసి, రేసులో ముందుకెళ్లిపోయింది.

అయితే ఇక్కడ చిన్న మతలబు కూడా ఉంది. ప్రభుత్వ సేవలను ఉపయోగించుకున్న వారినుంచి మాత్రమే ఈ ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. అంటే.. వారందరూ కూడా ఆ ఏడాదిలో ఆ రాష్ట్రాల్లో కొత్తగా పరిశ్రమలు పెడుతున్న వారే అయిఉండే అవకాశం ఉంది. వారు సహజంగానే ప్రభుత్వాలకు అనుకూలంగా చెబతారు.

పరిశ్రమలు ఏర్పాటుచేయడానికి తమ ప్రయత్నాలు తాము చేసి.. కార్యరూపం దాల్చకుండా మిగిలిపోయిన వారినుంచి కూడా ఫీడ్ బ్యాక్ తీసుకుంటే.. అసలు ప్రభుత్వ వ్యవస్థలో ఎలాంటి లోపాలు ఉన్నాయో తెలుస్తుంది. పరిశ్రమలకు కేటాయింపులు, అనుమతుల విషయంలో ఏదైనా అవినీతి గట్రా ఉంటున్నాయో కూడా వెల్లడవుతుంది.

కాకపోతే సహజంగా ఒకటో ర్యాంకు వచ్చిన వాడి గురించే అంతా చెప్పుకుంటారు తప్ప.. వెంట్రుక వాసిలో మిస్సయిన రెండో ర్యాంకు గురించి అంతగా చర్చించుకోరు. ఈ ర్యాంకులను చూస్తే.. ఏపీ-98.42, తెలంగాణ- 98.33, హర్యానా- 98.07, ఝార్ఖండ్- 97.99, గుజరాత్- 97.96. అంటే మొదటి స్థానానికి అయిదో స్థానానికి ఉన్న వ్యత్యాసం.. కేవలం 0.46 మాత్రమే.

స్థూలంగా చెప్పాలంటే.. మనదేశంలో కొత్తగా పరిశ్రమలు పెట్టదలచుకుంటున్న వారంతా.. నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నది గనుక.. ఆంధ్రప్రదేశ్ వైపు ఎగబడుతున్నాయని అనుకోవడానికి వీల్లేదు. ర్యాంకులు వచ్చిన అన్ని రాష్ట్రాలూ ఇంచుమించుగా ఒకే స్థాయిలో ఉన్నాయని అనుకోవాలి. అయినా సరే, ‘ర్యాంక్ 1’ లో ఉన్నందుకు ఆంధ్రప్రదేశ్ ను అభినందించాలి.