Advertisement


Home > Politics - Gossip
చంద్రబాబు జైకొట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమే!

భారతీయ జనతా పార్టీతో అంటకాగడానికి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదంటూ తెలుగుదేశం పార్టీ ఒకవైపు విపరీతమైన ప్రచారం సాగిస్తూ ఉంటుంది. తమ ఆటలు సాగనివ్వడం లేదు గనుక.. ఎన్డీయే నుంచి కొత్తగా బయటకు వచ్చిన తెలుగుదేశం.. భాజపా మీద అదేపనిగా బురద చల్లుతూ.. ఆ ఎఫెక్టు వైకాపా మీద కూడా పడేలా చేయడానికి పనిగట్టుకుని వారికి బంధాన్ని అంటగడుతూ వెళ్తోంది.

అయితే వాస్తవంలో కాంగ్రెస్ తో అంటకాగడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉబలాటపడుతునట్లుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. పైపెచ్చు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెబుతున్న మాటలు వింటున్నా.. తెదేపాలో కీలక నాయకుడు యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానాలు వింటున్నా.. చంద్రబాబు- కాంగ్రెస్ మైత్రి ఖరారవుతుందనే అనిపిస్తోంది.

ఏపీలో కాంగ్రెస్ పార్టీ చాలా దారుణమైన స్థితిలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. వారికి సొంతంగా ఒక్క సీటు అయినా గెలుచుకోగల సత్తా ఉందో లేదో వారికే అనుమానంగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ కు సానుకూల సంకేతాలు పంపుతున్న చంద్రబాబుతో మైత్రికి ఇబ్బందేముంటుంది. ఆ సూచనే రఘువీరారెడ్డి మాటల్లో కనిపిస్తోంది.

దేశంలోని భాజపా వ్యతిరేక ప్రాంతీయ పార్టీలు అన్నిటినీ ఏకతాటిపైకి తెస్తాం అని ఆయన వెల్లడిస్తున్నారు. భాజపా మోసాల వల్ల వారికి శత్రువులు పెరుగుతున్నారని, వారంతా కాంగ్రెస్ కు మిత్రులవుతున్నారని ఆయన చెప్పారు. కర్నాటకలో ప్రమాణ స్వీకారం వేదిక మీద రాహుల్ తో రాసుకుపూసుకు తిరిగిన చంద్రబాబు వైఖరి పర్యవసానంగానే రఘువీరా ఇలాంటి మాటలు చెబుతున్నారని అంతా అనుకుంటున్నారు.

మరోవైపు తెదేపా మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. కాంగ్రెస్ తో కలుస్తామనే పుకార్లలో నిజం లేదని, తెదేపా పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకతతో అని సెలవిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీయే నుంచి బయటకు వచ్చాం అంటున్న ఆయన రేపు అదే రాష్ట్ర ప్రయోజనాల సాకు చెప్పి.. కాంగ్రెస్ తో అంటకాగడాన్ని సమర్థిస్తారనే వాదన కూడా వినిపిస్తోంది. కర్నాటకలో ప్రాంతీయ పార్టీలు అన్నీ ఏకం కావడంతో భాజపాకు వణుకు పుడుతోందని అంటున్నారు గానీ.. నిజానికి వారు కాంగ్రెస్ భుజాలపై ఉన్నారనే సంగతిని యనమల మరచినట్టున్నారనే విమర్శలు వస్తున్నాయి.