Advertisement


Home > Politics - Gossip
బేరాల పనిలేదు.. తిరిగి హస్తిన చేరిన పెద్దలు

బేరాసారాలు సాగించే పరిస్థితి ఉంటుందేమో.. మన అనుభవాన్ని రంగరించి చక్రం తిప్పేద్దాం.. అధికారానికి దూరం కొద్దిగా ఉన్నట్లయితే.. మన తడాఖా చూపిద్దాం అని రంగంలోకి దిగిన కాంగ్రెస్ పెద్దలు తిరిగి హస్తిన బాట పట్టినట్టే. పరాభవం ఇంత దారుణంగా ఉంటుందని ఊహించలేక, ఎగ్జిట్ పోల్స్ ను నమ్మి.. కన్నడ సీమలో బేరసారాలకు దిగిన వారు, ఖంగుతిన్నారు. 

మూడు పార్టీలు ప్రధానంగా తలపడిన కర్నాటక  రణస్థలంలో.. ఏ ఒక్కరూ కూడా స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి రావడం అసాధ్యం అని ఎగ్జిట్ పోల్స్ చెప్పగానే కాంగ్రెస్ కు ఆశపుట్టింది. తులనాత్మకంగా చూసినప్పుడు.. కాంగ్రెస్ , భాజపాలకంటె తక్కువ సీట్లు మాత్రమే గెలుచుకోగల అవకాశం ఉన్నప్పటికీ.. జేడీఎస్ కీలకమైన పార్టీ అవుతుందని అంతా అనుకున్నారు. పరిస్థితి  హంగే అయితే గనుక.. రకరకాల సంభావ్యతలకు ఇక్కడ ఆస్కారం ఉంది.

హంగ్ అని అంచనాలు సాగుతున్నప్పుడు.. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మనం అవతరిస్తే కొందరు ఎమ్మెల్యేలనైనా తమ జట్టులోకి లాక్కోడానికి అవసరమైన తాయిలాలు పెట్టడానికి, బేరాలు సాగించడానికి కాంగ్రెస్ ప్రముఖులు వచ్చారు. కానీ.. మంగళవారం ఫలితాలు వెలువడడం మొదలు కాగానే వారికి అసలు పనిలేకుండా పోయింది. 

కాంగ్రెస్ పార్టీ తరఫున గులాంనబీ ఆజాద్ ముందే బెంగుళూరు చేరుకున్నారు. అశోక్ గెహ్లాట్ కూడా వచ్చారు. గోవాలో గతంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చినా కూడా.. భాజపా చక్రం తిప్పడంతో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది. అలాంటి సీన్ రిపీట్ కాకుండా.. కనీసం కర్నాటకలో అయినా ఏదో ఒక మాయ చేయాలని కాంగ్రెస్ కోరుకున్నది. కానీ వారికి ఇక్కడ ‘సింగిల్ లార్జెస్ట్’ హోదా కూడా దక్కలేదు. 

భాజపాలో ఆదినుంచి నిశ్చింతే ఉంది. తాము సింగిల్ లార్జెస్ట్ గా రాకపోయినా సరే.. జేడీఎస్ ను మచ్చిక చేసుకుని అధికారంలోకి రావాలని వారు అనుకున్నారు. కానీ చివరికి వారికి అలాంటి అవసరమే లేకుండాపోయింది. ప్రత్యర్థులు ఆరోపిస్తున్నట్లుగా ఎన్నికలకు ముందునుంచే జేడీఎస్ తో ఒక అవగాహన ఉండినా.. కూడా ఇప్పుడు దాని అవసరం లేకుండాపోయింది. 

అధికారానికి స్వల్పదూరంలో ఆగిపోయే పరిస్థితి వస్తే బేరసారాలు ఫలిస్తాయని కాంగ్రెస్ పెద్దలు ఆశించారు. అలాంటి పరిస్థితే వస్తే.. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చి తీరాలనే కోరికతో కాంగ్రెస్ అగ్ర నాయకులు ముందే రంగంలోకి దిగారు. ఎవరి వ్యూహరచనా నైపుణ్యాలు ఎలా పనిచేశాయో... ఎవరి చాణక్య సామర్థ్యాలు ఫలించాయో గానీ.. భాజపా గద్దెమీదకు వస్తున్నది.

హస్తిన నుంచి వచ్చిన హస్తం పార్టీ పెద్దలు.. తిరిగి విమానం ఎక్కి వెనక్కు బయల్దేరాల్సి వచ్చింది పాపం!