cloudfront

Advertisement


Home > Politics - Gossip

కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఎప్పుడంటే!

 కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఎప్పుడంటే!

తెలంగాణ రాజకీయం ఇంకా పూర్తిస్థాయిలో రసవత్తరంగా మారలేదు. ఇందుకు కారణం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ఖరారు చేయకపోవడమే. కాంగ్రెస్ పార్టీ కసరత్తు కొనసాగుతూ ఉంది. హైదరాబాద్‌లోని ఒక స్టార్ హోటల్‌లో ఈ వ్యవహారం సాగుతూ ఉంది. అధిష్టాన దూతలు, కొంతమంది స్థానిక కాంగ్రెస్ నేతలు ఈ వ్యవహారంపై అక్కడ మంతనాలు సాగిస్తూ ఉన్నారు. అయితే వాళ్ల కసరత్తు ఇప్పుడప్పుడే కొలిక్కి వచ్చేలా లేదని సమాచారం.

దానికి మరింత సమయం పడుతుందని.. ఇంకా వారంరోజుల తర్వాతే ఈ కసరత్తు పూర్తి అవుతుందని తెలుస్తోంది. ఇక ఎలాగూ కాంగ్రెస్ జాబితాను ఇక్కడ నుంచే ప్రకటించలేరు. దానికి ఢిల్లీనే వేదిక. ఈ కసరత్తు అంతా పూర్తి అయ్యాకా.. ఢిల్లీ నుంచి అభ్యర్థుల ప్రకటన జరుగుతుందని సమాచారం.

ఆంటోనీ ఆధ్వర్యంలోని ఎన్నికల కమిటీ అభ్యర్థుల ప్రకటన చేస్తుందట. దాదాపు 90 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రకటిస్తుందని సమాచారం. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. నోటిఫికేషనే తరువాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కసరత్తు ఇంకా కొనసాగుతూ ఉండటం గమనార్హం.

అభ్యర్థుల జాబితా వస్తే.. అప్పుడు కాంగ్రెస్ లో అసలు రాజకీయం మొదలవుతుంది. ఇప్పటికే చాలామంది తమ వారసులకు టికెట్లను అడిగి పెట్టుకున్నారు. ఆశావహుల జాబితా కూడా పెద్దదే. ఒక్కసారి అభ్యర్థుల ప్రకటన వస్తే.. అప్పుడు కాంగ్రెస్ విబేధాలు వీధికి ఎక్కుతాయి. ఎలాగూ పొత్తులు ఉండనే ఉంటాయి.

అలా సీట్లను త్యాగం చేయాల్సిన వాళ్లు మరింత రచ్చ చేస్తారు. అప్పుడు తెలంగాణ రాజకీయం పూర్తిగా రసకందాయకంగా మారుతుంది. కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం విజయదశమి తర్వాతే అని సమాచారం.