cloudfront

Advertisement


Home > Politics - Gossip

పచ్చదళానికి కాంగ్రెస్ మార్క్ స్ట్రోక్!

పచ్చదళానికి కాంగ్రెస్ మార్క్ స్ట్రోక్!

ఇప్పుడిక పోలింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఎన్నికల ప్రచార పర్వం యావత్తూ ముగిసిపోయింది. ఈ దశకు వచ్చిన తర్వాత కూడా ఇంకా చంద్రబాబునాయుడు ప్రాపకం తమకు అవసరం ఉందా? అని తర్కించుకున్నదో ఏమోగానీ.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. తమ మార్కు స్ట్రోక్ ను తెలుగుదేశానికి రుచి చూపించింది. తెలుగుదేశం పార్టీకి కేటాయించిన సీటు నుంచి.. తమ పార్టీ నాయకుడు తిరుగుబాటు అభ్యర్థిగా పోటీచేయగా.. అతడిని బుజ్జగించి విరమింపజేయడం గానీ, లేదా, అతనిమీద చర్య తీసుకోవడం గానీ చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ.. ప్రచారం ముగిసి.. పోలింగ్ కు కొన్నిగంటల సమయం మిగిలి ఉందనగా.. కాంగ్రెస్ కార్యకర్తలంతా సదరు తిరుగుబాటు అభ్యర్థికే ఓటు వేయాలంటూ... పిలుపు ఇవ్వడం తెలుగుదేశానికి మాస్టర్ స్ట్రోక్ కావచ్చు.

ఇదంతా ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకున్న రాజకీయ మలుపులు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎల్బీనగర్ ను గెలుచుకుంది. ఈసారి కూడా పొత్తుల్లో భాగంగా అదే స్థానాన్ని ఆశించింది. అయితే తమ పార్టీ నాయకుడి కోసం ఎల్బీనగర్ కావాలని అనుకున్న కాంగ్రెస్, తెదేపాకు ఇబ్రహీంపట్నం కేటాయించింది. ఇన్నాళ్లుగా ఎల్బీనగర్ లో పనిచేసి, అక్కడ బలంగా ఉన్న నాయకుడు సామ రంగారెడ్డి తెదేపా సూచన మేరకు అయిష్టంగానే.. ఇబ్రహీంపట్నంలో నామినేషన్ వేయాల్సి వచ్చింది.

ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడు క్యామమల్లేశ్ ఆ స్థానాన్ని తెదేపాకు ఇచ్చినందుకు నిరసనగా.. తెరాసలో చేరిపోయారు. కాంగ్రెస్ కే చెందిన మల్ రెడ్డి రంగారెడ్డి తిరుగుబాటు అభ్యర్థిగా బీఎస్పీ బీఫారం తెచ్చుకుని బరిలోకి దిగారు. ఇతరత్రా కొన్ని నియోజకవర్గాల్లో తిరుగుబాట్లుగా పోటీచేసిన పలువురిని కాంగ్రెస్ సస్పెండ్ చేసింది గానీ.. మల్ రెడ్డి జోలికెళ్లలేదు. మరోవైపు మహాకూటమి తరఫున తెదేపా సామ రంగారెడ్డి.. అయిష్టంగా అక్కడ బరిలో కొనసాగారు.

ప్రచార పర్వం ముగిసిపోయిన తర్వాత.. పోలింగ్ కు ముందురోజు.. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఓ ప్రకటన చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలంతా మల్ రెడ్డికే ఓటు వేయాలని పిలుపు ఇచ్చారు. దీంతో తెదేపాకు కాంగ్రెస్ జెల్ల కొట్టినట్టయింది. మహాకూటమిలో కాంగ్రెస్ ముందు ముందు భాగస్వామ్య పక్షాలకు ఎలా చుక్కలు చూపించబోతున్నదో అనడానికి ఇది సంకేతం మాత్రమే అని పలువురు విశ్లేషిస్తున్నారు.

తెలంగాణ వోటింగ్ ఇవాలే... ముళ్లు ఎటువైపు తిరుగనుంది?